తమన్నాతో అనీల్ రావిపూడికి పెద్ద గొడవ జరిగింది. కానీ ఆ విషయాన్ని అతడు లైట్ తీసుకున్నాడు. తమన్నకు తనకు మధ్య సెట్స్ లో జరిగిన గొడవ చిన్నదేనని, ఆ గొడవ జరిగిన 2 రోజులకు అంతా సర్దుకుందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు మీడియా ఇచ్చిన కథనాల్ని కూడా కొట్టి పారేశాడు. అక్కడితో ఆగకుండా.. త్వరలోనే ఎఫ్3 సినిమా ప్రమోషన్ కు తమన్నా వస్తుందని కూడా అన్నాడు.
కట్ చేస్తే.. తమన్న అసలు ఎఫ్3 వైపు కన్నెత్తి చూడలేదు. సినిమా విడుదలై చాలా రోజులైనా యూనిట్ మాత్రం తమ ప్రచారం ఆపలేదు. ఏదో ఒక రూపంలో ప్రమోషన్ చేస్తూనే ఉంది. తాజాగా కూడా ఓ ఈవెంట్ నిర్వహించారు. కనీసం ఆ కార్యక్రమానికైనా మిల్కీబ్యూటీ వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ తమన్న రాలేదు.
మరోవైపు యూనిట్ తమ ప్రచారాన్ని ఆపేసింది. ఇప్పుడు తమన్న ప్రచారానికి వచ్చినా రాకున్నా పెద్దగా ఒరిగేదేం లేదు. కానీ అనీల్ రావిపూడి, తమన్న మధ్య సంబంధాలపై మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.
అనీల్-తమన్న మధ్య అభిప్రాయబేధాలు ఇంకా సద్దుమణగలేదంటూ సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. తమన్న ప్రమోషన్ కు వస్తుందని బహిరంగంగా రావిపూడి ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదంటే గొడవ పెద్దదే అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
మరోవైపు అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత నిర్మాత దిల్ రాజు కూడా తమన్న కోసం ప్రయత్నించారని, కానీ ఫలితం దక్కలేదని అంటున్నారు. చూస్తుంటే.. రావిపూడి అప్ కమింగ్ సినిమాల్లో తమన్నాకు ఇక చోటు దక్కడం అసాధ్యం అనిపిస్తోంది.