తెలుగుదేశం పార్టీని ప్రజలే చాలా వరకూ ఖాళీ చేశారు. గత ఏడాది అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు మామూలుగా చిత్తు చేయలేదు! ఒక పార్టీ ప్రతిపక్షంలోకి పడిపోవడం దారుణమైన ఓటమి ఏమీ కాదు. అయితే తెలుగుదేశం వంటి మూడు దశాబ్దాల పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం కావడం అంటే అది మామూలు ఓటమి కాదు. ఆ ఓటమి ఎంత కఠినమైనదో ఓడిపోయినప్పుడు కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అర్థం అవుతున్నట్టుగా ఉంది!
ప్రజలే తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించారు, మిగిలిన వారు తామే ఖాళీ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లోనే ఇప్పుడు ఆ పార్టీకి తాడూ బొంగరం లేకుండా పోతోంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ పతానావస్థ కేవలం సీఎం జగన్ సొంత జిల్లాలో మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉండటం గమనార్హం!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన నేతలు ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొంతమంది తప్పదని పని చేసినా.. ఏదో తమ నియోజకవర్గం వరకూ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది కూడా ఏ నామమాత్రపు పోటీ మాత్రమే లాగుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను బజారుకు తెచ్చారు.
జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడటం, అయిన కాడికి దోచుకోవడం, చంద్రబాబును ఆకాశానికెత్తడం… ఇదే పనిగా ఐదేళ్ల పాటు పని చేసిన నేతలు, ఇప్పుడు మాత్రం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే.. టీడీపీ సార్వత్రిక ఎన్నికల కన్నా తక్కువ శాతం ఓట్లకు పరిమితం అయ్యేలా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.