తప్పదు.. ఆర్ఆర్ఆర్ రేటు తగ్గించాల్సిందే

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇది. బాహుబలి లాంటి చరిత్ర తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న మూవీ ఇది. దీంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చుక్కల్ని తాకుతుందని అంతా ఊహించారు.…

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇది. బాహుబలి లాంటి చరిత్ర తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న మూవీ ఇది. దీంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చుక్కల్ని తాకుతుందని అంతా ఊహించారు. నిర్మాత దానయ్య కూడా అదే ఊహించాడు. భారీ రేట్లు సెట్ చేసి కూర్చున్నాడు. కానీ ఇప్పుడు దానయ్య తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.

నాన్-థియేట్రికల్ రైట్స్ కింద (హిందీ, తెలుగు కలిపి) దాదాపు 200 కోట్లు రూపాయలు ఆశిస్తున్నాడు దానయ్య. ఈ మార్కెట్ ను నెల రోజుల కిందటే ఓపెన్ చేశాడు. హిందీ శాటిలైట్, హిందీ డిజిటల్, తెలుగు శాటిలైట్, తెలుగు డిజిటల్, ఇలా అన్నీ కలిపి ఒకే సంస్థకు కట్టబెట్టాలని ముందుగా అనుకున్నాడు. తమిళ్, కన్నడ, మలయాళం సంగతి తర్వాత చూద్దామనుకున్నాడు. కానీ దానయ్య అనుకున్నప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు బాగా మారిపోయాయి.

దానయ్య కోరుతున్నట్టు బల్క్ లో ఇవన్నీ కొనేందుకు ఏ ఛానెల్ ముందుకు రావడం లేదు. జీ గ్రూప్ నెల కిందట చర్చలు ప్రారంభించినప్పటికీ ఇప్పుడది ఆర్థిక కష్టాల్లో ఉంది. ఒకే సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టే సాహసం అది చేయదు. జీ కంటే ముందు స్టార్ గ్రూప్ బరిలోకి దిగినప్పటికీ.. వాళ్లు కూడా మొత్తంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. తెలుగు సెగ్మెంట్ వరకు మాట్లాడుకుందాం అంటున్నారు. జోరుగా సినిమాలు కొనే సన్ నెట్ వర్క్ ఎందుకో ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అలియాభట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నప్పటికీ హిందీ మార్కెట్ ఓపెన్ కాకపోవడం. 

ఇక డిజిటల్ విషయానికొస్తే నెట్ ఫ్లిక్స్ భారీ రేటు ఆఫర్ చేస్తున్నప్పటికీ.. దానయ్య ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్ ఎలా తయారైందంటే.. నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో మూవీ ముందుగానే స్ట్రీమింగ్ కు వస్తే టీవీలో సినిమా ప్రసారం చేసేటప్పుడు ఆ ప్రభావం గట్టిగా పడుతోంది. టీఆర్పీలు రావడం లేదు. అందుకే ముందుగా శాటిలైట్ పూర్తయిన తర్వాత డిజిటల్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు. లేదంటే శాటిలైట్+డిజిటల్ ఒకే సంస్థకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు.

మార్కెట్ ఓపెన్ చేసి ఇన్నాళ్లయినా డీల్స్ లాక్ అవ్వకపోవడంతో దానయ్య ఇప్పుడు డైలమాలో పడ్డాడు. సవరించిన ఫిగర్లతో మరోసారి ఛానెళ్లను సంప్రదించాలని భావిస్తున్నాడు.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?