విశాఖ రాజధానిగా పూర్తిగా టీడీపీ వ్యతిరేకిస్తున్న సంగతి విధితమే. విశాఖకు రాజధాని ఎందుకు అని ఏకంగా తమ్ముళ్ళు ఎకసెక్కమే ఆడారు. మరో వైపు చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎవరు కోరుకున్నారంటూ ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ఆ ప్రాంత వాసులను అవమానించడమే.
ఈ నేపధ్యంలో విశాఖను రాజధానిగా వద్దు అంటున్న టీడీపీ మాకు వద్దు అంటూ దండం పెట్టేశాడో తమ్ముడు. విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాం రాం అనేశారు. విశాఖ రాజధాని వద్దు అని చంద్రబాబు చెబుతున్న పార్టీలో తాము ఎందుకు ఉండాలి అని ఆయన అంటున్నారు.
విశాఖ రాజధాని అయితే వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలు బాగుపడతాయని ఆయన అన్నారు. ఇదే విషయం అధినేతకు చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు. విశాఖ బాగు కోరుకోని టీడీపీకి ఇక్కడి ఓట్లు కూడా ఎందుకని నిఖార్సైన ప్రశ్నే సంధించారు. అవును.. పాయింటే. ఇదే మాట జనం కూడా అనుకుంటే టీడీపీ సైకిల్ విశాఖలో గల్లంతే మరి.
ఇప్పటికే వరసగా తమ్ముళ్ళు సైకిల్ దిగిపోతున్నారు. రేపో మాపో మిగిలిన వారు కూడా గుడ్ బై టీడీపీ అనేలా ఉన్నారు. మరి వీరంతా వైసీపీకి జై కొట్టేలా ఉన్నారు. అదే జరిగితే విశాఖ పసుపు కోటకు బీటలు వారడం ఖాయమే.