'పలాస 1978' సినిమా ప్రమోషన్ ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఇది అంబేద్కర్ వాద సినిమా అని, దీన్ని దళితులు తప్పకుండా చూడాలని, వారే చూడకపోతే ఎలా అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. సినిమా ఏదైనా కావొచ్చు.. దాన్ని ఒక కులం వారు చూడాలి, ఆ కులం వారు చూడకపోతే ఎలా.. అంటూ ప్రశ్నించడం గమనార్హమే. హాట్ కామెంట్స్ చేయడం తమ్మారెడ్డికి అలవాటే. ఈ క్రమంలో పలాసకు ప్రచారం కల్పించడానికి ఆయన చేసిన కుల కామెంట్లు మీడియాలో చర్చనీయాంశంగా నిలిచాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు పలాస సినిమా ప్రమోషన్ కోసం డైరెక్టుగా మందకృష్ణ మాదిగ రంగంలోకి దిగడం గమనార్హం! బాబాసాహేబ్ అంబేడ్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు మందకృష్ణ మాదిగ. ఈ సినిమా ఒక్కసారి చూస్తే సరిపోదు అని, పది సార్లు చూసినా తక్కువ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
చిరంజీవి నటించిన స్వయంకృషి, దాసరి నారాయణ రావు తీసిన సినిమాలు చాలావరకు సామాజిక కోణాల్లో ఉంటాయని, అటువంటి గొప్ప చిత్రాలు మళ్లీ రావు అనుకున్నామని.. వాటి తర్వాత ఈ సినిమానే అని మందకృష్ణ చెప్పారు. దళితులు ఈ సినిమా తప్పక చూడాలని తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిస్తే, దళితవాద నేత మందకృష్ణ డైరెక్టుగా ఈ సినిమా ప్రచారం చేస్తున్నారు.