ఆయ‌న రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కాద‌ట‌…బీజేపీకి ఊపిరి!

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆయ‌న అభ్య‌ర్థి కాద‌ని తెలియ‌డంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. ఆయ‌నే అభ్య‌ర్థి అయి వుంటే మోదీ సర్కార్‌కు పెద్ద స‌వాలే ఎదురై వుండేది. ఆయ‌న అభ్య‌ర్థి కాక‌పోవ‌డంతో తృటిలో ఓట‌మి నుంచి…

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆయ‌న అభ్య‌ర్థి కాద‌ని తెలియ‌డంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. ఆయ‌నే అభ్య‌ర్థి అయి వుంటే మోదీ సర్కార్‌కు పెద్ద స‌వాలే ఎదురై వుండేది. ఆయ‌న అభ్య‌ర్థి కాక‌పోవ‌డంతో తృటిలో ఓట‌మి నుంచి బీజేపీ త‌ప్పించుకున్న‌ట్టే. ఆ ఘ‌న‌త వ‌హించిన నాయ‌కుడెవ‌రో తెలుసుకున్నాం.

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ తాజా ప్ర‌క‌ట‌నతో బీజేపీ ప్ర‌శాంతంగా ఉంది. లేక‌పోతే ఏమ‌య్యోదో ఊహించ‌డం క‌ష్ట‌మ య్యేది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రేస్‌లో తాను లేన‌ని కేఏ పాల్ ప్ర‌క‌టించారు. కేఏ పాల్ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌ని ఎప్పుడు, ఎలా జ‌రిగిందో తెలియ‌దు. కానీ బ‌రిలో లేన‌ని స్వ‌యంగా పాల్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఢిల్లీలోని కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షా లకు స్పష్టంగా చెప్పిన‌ట్టు కేఏ పాల్ తెలిపారు. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానన్నారు. 

బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు వేర్వేరు కూటములుగా ఉండొద్దని పాల్ సూచించారు.

ముఖ్యంగా తాను ఎవ‌రి వైపో స్ప‌ష్టం చేశారు. ఓడిపోయే వారి వైపు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉండ‌న‌ని స్ప‌ష్టం చేశారు. అంటే బీజేపీ ప‌క్షాన వుంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారని లెక్క‌ల‌తో స‌హా చెప్పారు. తాను మాత్రం రాష్ట్రపతి అభ్యర్థి కాద‌ని ప్ర‌క‌టించి బీజేపీకి ఉప‌శ‌మ‌నం క‌ల్పించడం విశేషం.  

బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనం అయిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకి ప్రతిపాదించిన‌ట్టు కేఏ పాల్ తెలిపారు. కేసీఆర్‌తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించిన‌ట్టు పాల్ వెల్ల‌డించారు.