మోదీ ప్రత్యేకత ఏమంటే ఏదైనా నమ్మించేలా చెబుతాడు. ఆయన మాటలు విని కరోనా పోతుందని శబ్దాలు చేసాం, దీపాలు వెలిగించాం. కరోనా పోలేదు కానీ, మనలోనే చాలా మంది పోయారు. అసలు వైరస్‌కి , శబ్దాలు, దీపాలకి ఏం సంబంధమని బుద్ధిజ్ఞానం వున్నప్పటికీ మనం ఆలోచించలేదు.
ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి 10 లక్షల వుద్యోగాలు ఇస్తానని అంటున్నాడు. నమ్మించేలా మాట్లాడడం ఒక ఆర్ట్. మోదీ మంచి ఆర్టిస్ట్. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఎలా ఇస్తారని మనం అడగం. అయన చెప్పడు. కటవుట్ చూసి కొన్ని నమ్మాలి. ప్రతిపక్షాలు ప్రశ్నించే స్థితిలో లేవు. ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోరు. వచ్చే 18 నెలల్లో 10 లక్షల మంది ఉద్యోగాల్లోకి చేరుతారట!
వాస్తవం ఏమంటే నిజంగానే ఉద్యోగాలు ఖాళీ వున్నాయి. అయితే ఉన్న వాళ్ల మీదే పనిభారం వేసి, లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని ఇంత కాలం నడిపారు. ఒక్క రైల్వేలోనే 2.3 లక్షలున్నాయి. ఒక వైపు ప్రైవేట్ రైళ్లు అంటూనే ఇంకోవైపు లక్షల ఉద్యోగాల భర్తీ అంటే నమ్మేదెలా?
గతంలో రైల్వేశాఖ ఏం చేసిందంటే లక్ష ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 40 లక్షల మంది టెస్ట్ రాశారు. పరీక్ష ఫీజే కొన్ని కోట్ల రూపాయలు వచ్చింది. చివరికి సగం ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల్ని ఒక రకంగా దోచుకోవడమే. ఇపుడు 10 లక్షల ఉద్యోగాలంటే ఎన్ని వందల కోట్లు అప్లికేషన్ ఫీజు వస్తుందో ఒకసారి ఊహించుకోండి.
ఇంత కాలం ఖర్చు తగ్గించాలని ఉద్దేశపూర్వకంగా కేంద్రమే నియామకాల్ని ఆపింది. ఎన్నికలు వచ్చే సరికి నిరుద్యోగులపై ప్రేమ పుట్టింది. ఇదే బీజేపీ 2014లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. 2019 నాటికి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది.
అసలు సమస్య ఏమంటే డబ్బులు. ప్రపంచమంతా ఇన్‌ఫ్లేషన్ వైపు వెళుతోంది. రిజర్వ్ బ్యాంక్ కష్టాల్లో వుంది. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో 10 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇవ్వడమంటే ఎన్నికల స్టంట్ అని సులభంగానే అర్థమవుతుంది.