ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పోటీ ఎందరి మధ్య ఉండబోతున్నది అనేది కీలకాంశం. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా ఫోకస్ పెట్టడం గ్యారంటీ. తెలుగుదేశం ఇప్పటికే బేల పలుకులు పలుకుతోంది. తమను అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని ఆర్తనాదాలు చేస్తోంది. ఇకపోతే జనసేన-భాజపా కూటమి సంగతేమిటి? వారు ఎంత మాత్రం పోటీలో ఉండబోతున్నారు. అనేది చర్చనీయాంశమే.
ఈ రెండు పార్టీల పొత్తు బంధంలో చిత్రమైన వాతావరణం ఉంది. భారతీయ జనతా పార్టీకి సాధారణంగానే.. కేంద్రంలో ఎంపీ ఎన్నికలు తప్ప.. మరొకటి పట్టవు. ప్రత్యేకించి తాము పలురకాలుగా ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీలు గెలవరని తెలుసు గానీ, ఎమ్మెల్యేలు గెలవాలని కూడా వారు కోరుకోరు. స్థానిక సంస్థల ఎన్నికల మీద వారికి అంతకంటె కనిష్టమైన శ్రద్ధ ఉంటుంది. వారికి ఇవి పూర్తిగా అనవసరమైన ఎన్నికలు.
కానీ వారితో పొత్తు పెట్టుకున్న జనసేనకు ఇవి చాలా అవసరం. కనీసం జగన్ ను ఊరూరా తిరిగి తిట్టడానికైనా ఈ ఎన్నికలను వాడుకోవాలనేది వారి కోరిక. కానీ… వారికి భాజపా పొత్తు ఏమాత్రం ఉపయోగపడేలా లేదు. పవన్ కల్యాణ్ తన పార్టీకి ఏదో క్షేత్ర స్థాయిలో బలం విపరీతంగా ఉన్నట్లుగా.. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రతిచోటా పోటీచేస్తాం అని ఇప్పటికే పదేపదే చెప్పారు. ఇప్పుడు పోటీచేయలేకపోతే పరువు పోతుంది.
విచిత్రమైన స్థితి ఏంటంటే.. భాజపాకు ఈ ఎన్నికల గురించి ఏమాత్రం పట్టింపు లేదు. వారు పోటీచేయడం గురించి పట్టించుకోరు. జనసేన పోటీచేయాలనుకుంటే గనుక.. రాష్ట్రమంతా సమస్త స్థానిక ఎన్నికల సీట్లను వారికే అప్పజెప్పేస్తారు. పొత్తు ధర్మం గనుక.. బాగుండదని అనిపిస్తే.. పవన్ కల్యాణ్ ఒప్పుకున్నన్ని సీట్లు మొక్కుబడిగా తీసుకుంటారు.. అంతే తప్ప ఎన్నికలను పట్టించుకోరు.
జనసేనకు పోటీమీద కోరిక ఉంది గానీ.. వారికి క్షేత్రస్థాయిలో పట్టులేదు. భాజపా నాయకులు జనసేన టికెట్ పై నిలబడతారనుకోవడం కల్ల. వీరు చివరికి కేడిండేట్లుగా మనుషుల్ని కూడా వెతుక్కోవాల్సిందే. ఇలాంటి చిత్రమైన విరుద్ధ భావజాలాలతో ఈ రెండు పార్టీలు సతమతం అవుతున్నాయి.