టాలీవుడ్ అన్నది హీరోల సామ్రాజ్యం. కానీ ఈ మధ్య డైరక్టర్ల మాట కూడా చెల్లుబాటు కావడం పెరిగింది. అయినా కూడా చాలా విషయాల్లో హీరోల మాటే చెల్లుబాటు అవుతుంది. ప్రతి హీరోకి సాధారణంగా వాళ్ల మైండ్ సెట్ కో, లేదా ఇతరత్రా బంధాలతోనో, అనుబంధాలతోనో స్వంత పీఆర్వోలు వుంటారు.
హీరోలు తమ తమ నిర్మాతలకు వాళ్లనే రికమెండ్ చేస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ విషయంలో డైరక్టర్లు వేళ్లుపెట్టడం పెరిగింది. అయినా కూడా హీరోలు పట్టు పట్టి తమకు కావాల్సిన వాళ్లకే పీఆర్ బాధ్యతలు అప్పగించడం పరిపాటిగా మారింది.
గౌతమీపుత్ర శాతకర్ణి టైమ్ లో డైరక్టర్ క్రిష్ మాట చెల్లలేదు. బాలయ్య మాటే నెగ్గింది. వినయ విధేయరామ సినిమా విషయంలో దర్శకుడు బోయపాటి కిందామీదా పడినా, ఎంత పట్టుపట్టినా, రామ్ చరణ్ టీమ్ కే పీఆర్ బాధ్యతలు దక్కాయి.
అరవింద సమేత వీరరాఘవ సినిమా విషయంలో డైరక్టర్ త్రివిక్రమ్ మాటను కాదని, హీరో ఎన్టీఆర్ తన పీఆర్ టీమ్ నే పెట్టుకున్నాడు. దాంతో త్రివిక్రమ్ సైలంట్ అయ్యారు. అంతెందుకు మహర్షి సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ వంశీ పైడిపల్లిని కాదని హీరో మహేష్ తన పీఆర్ టీమ్ నే రంగంలోకి దింపారు.
కానీ ఇప్పడు బన్నీ వంతు వచ్చేసరికి వ్యవహారం రివర్స్ అయినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన నూతన సంవత్సరం సందర్భంగా బయటకు రాబోతోంది. కానీ ఈ సినిమాకు ప్రకటన దగ్గర నుంచే పీఆర్ వ్యవహారాలు అన్నీ త్రివిక్రమ్ తన చేతిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గీతా కాంపౌండ్ పీఆర్ టీమ్ ను పూర్తిగా పక్కన పెట్టేసారని వినిపిస్తోంది. ఈ విషయంలో బన్నీ మాట చెల్లలేదనో? లేదా బన్నీ కలుగచేసుకోలేదనో టాక్ వినిపిస్తోంది. చిత్రంగా బన్నీకి మిగిలిన పనులు అన్నీ ఈ పీఆర్ టీమ్ నే చూసుకుంటుంది.
ఆఖరికి బన్నీ బయట అడియో ఫంక్షన్ లకు వెళ్లినా, అక్కడ ముందుగా వెళ్లిపోయి, జనాలను సమీకరించి, ప్లకార్డులు తయారుచేయించి, జేజేలు కొట్టించడం కూడా ఈ పీఆర్ టీమ్ బాధ్యతే. కానీ అలా నమ్ముకున్న వారిని మాత్రం ఇలా అసలైన టైమ్ లో సింపుల్ గా వదిలేయడం బన్నీకే సాధ్యమైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి బన్నీ విదేశాల్లో వున్నారని, ఆయన వచ్చిన తరువాత దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.