రాజకీయాల్లో ఎత్తు పల్లాలు మామూలే. కానీ, రాజకీయంగా అత్యంత పతనావస్థలోకి వెళ్ళిపోయాక.. ఇంకా ఆ పతనానికి సంబంధించిన లోతుల్ని వెతకడం బహుశా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తప్ప ఇంకెవరికీ చెల్లవేమో.! రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు అభ్యర్థిని నిలబెట్టింది. ‘దళిత కార్డు’ తెరపైకి తెచ్చి, వర్ల రామయ్యను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసే దిశగా ఈ చర్య తమకు ఉపకరిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ‘పార్టీ విప్ జారీ చేస్తుంది.. ఆ విప్‌కి తగ్గట్టుగానే ఓటేయాలి.. లేకపోతే అనర్హత వేటు తప్పదు..’ అని చంద్రబాబు, వర్ల రామయ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక, టీడీపీ ప్రజా ప్రతినిథుల్ని హెచ్చరించారు. సో, ఇక్కడ చంద్రబాబు ఉద్దేశ్యం, పార్టీ ఫిరాయించినవారిపై వేటు వేయించాలనే తప్ప.. దళిత నేత అయిన వర్ల రామయ్య మీద వల్లమాలిన ప్రేమ కాదన్నమాట.
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టగలరేమోగానీ, చంద్రబాబు ఆ అభ్యర్థిని గెలిపించలేరు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా స్పష్టంగా చెప్పేశారు. అంటే, చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే వర్ల రామయ్యను బలిపశువుని చేస్తున్నారన్నమాట. గతంలో.. అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు (13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనే) రాజ్యసభ ఎన్నికలు జరిగితే, బలానికి మించి అభ్యర్థుల్ని నిలపాలనుకుని, చివరి నిమిషంలో ఆ ఆలోచనని చంద్రబాబు విరమించుకున్న విషయం విదితమే.
దళితుడికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తే, మమ్మల్ని విమర్శిస్తారా.? అంటూ అప్పుడే వర్ల రామయ్య ఎపిసోడ్‌ని పట్టుకుని తెలుగు తమ్ముళ్ళు దిక్కుమాలిన రాజకీయం షురూ చేసేశారు. అవునా.? టీడీపీకి దళితులంటే అంత గౌరవమా.? అలాగైతే, మోత్కుపల్లి నర్సింహులుకి ఎందుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదట.? సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరుల్ని రాజ్యసభకు పంపించి, చంద్రబాబు రాష్ట్రాన్నిగానీ, టీడీపీనిగానీ ఏమన్నా ఉద్ధరించగలిగారా.!
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. రాజకీయాల్లో మరీ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా వ్యాఖ్యానించాల్సి వస్తోంది. ఈ దిక్కుమాలిన రాజకీయాల్ని తట్టుకోలేకనే.. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు ‘క్యూ’ కట్టేస్తున్నారు.