కింది కోర్టు తీర్పు నచ్చింది, పై కోర్టు తీర్పు కాదు!

మోడీ అనే పేరును ఉద్దేశించి దొంగ‌లకంద‌రికీ ఎందుకా ఇంటి పేరుంటుంది.. అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల్లో తీవ్ర‌మైన నేర‌ముంద‌ని సూర‌త్ కోర్టు భావించింది కొన్ని నెల‌ల క్రితం. ఆ త‌ర‌హా…

మోడీ అనే పేరును ఉద్దేశించి దొంగ‌లకంద‌రికీ ఎందుకా ఇంటి పేరుంటుంది.. అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల్లో తీవ్ర‌మైన నేర‌ముంద‌ని సూర‌త్ కోర్టు భావించింది కొన్ని నెల‌ల క్రితం. ఆ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌కు అత్యంత తీవ్ర‌మైన శిక్ష అయిన రెండేళ్ల జైలు శిక్ష‌ను రాహుల్ కు విధించింది సూర‌త్ కోర్టు! 

ఆ కోర్టు ఆ నిర్ణ‌యం వెళ్ల‌డించిన కొంత సేప‌టిలోనే లోక్ స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించింది. రెండేళ్ల జైలు శిక్ష‌ను ఎదుర్కునే ఏ ప్ర‌జాప్ర‌తినిధీ చ‌ట్ట స‌భ‌ల్లోకి ప్ర‌వేశానికి అన‌ర్హుడ‌నే నియ‌మాన్ని అనుస‌రించి రాహుల్ ఎంపీ ప‌ద‌వికి అన‌ర్హ‌త ను ప్ర‌క‌టించింది. రాహుల్ ను ఎంపీ హోదా నుంచి డిస్మిస్ చేసింది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌య‌నాడ్ సీటుకు ఖాళీని కూడా అనౌన్స్ చేసింది. మ‌రి ఎందుకో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేదంతే!

రాహుల్ నాయ‌కుడిగా బ‌ల‌మైన వాడా, బ‌ల‌హీనుడా అనేదాన్ని ప‌క్క‌న పెడితే… కాంగ్రెస్ కు అత‌డు ప్ల‌స్సా, మైన‌స్సా అనే చ‌ర్చ వేరే అనుకుంటే.. రాహుల్ పై  చ‌ర్య‌లు మాత్రం ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఆ మాట అన్నాడ‌ని అత‌డిని ఎంపీగా అన‌ర్హుడిగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అయ్యింది స‌ర్వత్రా. అయితే బీజేపీ ఆ చ‌ర్య‌ల‌న్నింటినీ స‌మ‌ర్ధించుకుంది. మోడీ ఇంటి పేరునే అంటాడా.. అత‌డికి ఎంపీ గా ఉండే అర్హ‌త లేద‌ని బీజేపీ నేత‌లు వాదిస్తూ వ‌చ్చారు. మ‌రి ఈ అంశంపై రాహుల్ స్పందిస్తూ… త‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. దీంతో బీజేపీకి మ‌రింత ఆగ్ర‌హం క‌లిగింది. 

దేశంలో చాలా చోట్ల అదే వ్యాఖ్య‌ల‌పై కేసులు పెట్టారు. చివ‌ర‌కు వ్య‌వ‌హారం సుప్రీం కోర్టు వ‌ర‌కూ చేరింది. అయితే సుప్రీం కోర్టు కింది కోర్టు అభిప్రాయంతో విబేధించింది. రాహుల్ మాట‌ల‌ను కోర్టు స‌మ‌ర్థించ‌క‌పోయిన‌ప్ప‌టికీ…  ఆ మాట‌ల‌కు ఆ చ‌ట్టంలోని తీవ్ర‌మైన శిక్ష‌ను భావ్యం కాద‌ని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క మాట‌ను ప‌ట్టుకుని రెండేళ్ల పాటు జైలు శిక్ష వేయ‌డం, దాని వ‌ల్ల ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై ఉప ఎన్నిక ప్ర‌భావం.. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాహుల్ కు ప‌డ్డ శిక్ష‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో.. రాహుల్ ఎంపీ ప‌ద‌వికి అన‌ర్హ‌త వేటు పై కూడా స్టే ప‌డ్డ‌ట్టు అయ్యింది.

రాహుల్ మాట‌ల‌పై విచార‌ణ‌, శిక్ష అవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. సూర‌త్ కోర్టు శిక్ష విధించిన కొన్ని గంట‌లైనా గ‌డ‌వ‌క‌ముందే.. స్పీక‌ర్ కార్యాల‌యం వేగంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే ఈ అంశంలో బీజేపీ ఆగ్ర‌హావేశాల‌ను చాటింది. ఒక‌వేళ రాహుల్ కు నోటీసులు ఇచ్చి, లేదా పై కోర్టు వెళ్ల‌డం వ‌ర‌కూ స‌మ‌యం ఇచ్చి ఆ  పై చ‌ర్య‌లు తీసుకుని ఉంటే.. అది ప్ర‌జాస్వామ్యానికి అందం అయ్యేది. 

అయితే.. వెనువెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా రాహుల్ పై చ‌ర్య‌ల కోసం ఎదురుచూశార‌ని అంతా అనుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. మ‌రి ఆ చ‌ర్య‌ల సంగ‌త‌లా ఉంటే.. కింది కోర్టు నిర్ణ‌యాన్నే సుప్రీం కోర్టు త‌ప్పు ప‌ట్టిన‌ట్టుగా అయ్యింది. మ‌రి ఇప్పుడు త‌మ చ‌ర్య‌ల‌ను వెన‌క్కు తీసుకోవ‌డం మిన‌హా స్పీక‌ర్ కార్యాల‌యానికి మ‌రో మార్గం లేక‌పోవ‌చ్చునేమో!

మ‌రి సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వ‌డానికి కొన్ని గంట‌ల ముందు… రాహుల్ గాంధీ త‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ స్ప‌ష్టం చేశాడు. త‌ద్వారా త‌న తీరును స‌మ‌ర్థించుకున్నాడు. ఆ వెంట‌నే కోర్టు తీర్పు తో రాహుల్ కు చాలా ఊర‌ట ల‌భించింది. దీంతో త‌మ‌ది నైతిక విజ‌యం అని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. రాహుల్ తిరిగి లోక్ స‌భ ప్ర‌వేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల నుంచి గెలిచిన రాహుల్ ను మోడీ అడ్డుకున్నార‌ని, ఇప్పుడు రాహుల్ ప్ర‌జాస్వామ్యయుతంగా మ‌ళ్లీ లోక్ స‌భ‌లోకి ఎంట‌ర‌వుతున్నాడ‌ని కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది. 

ఇక రాహుల్ కు శిక్ష స్టే ద‌క్క‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీకి సుతార‌మూ ఇష్టం లేన‌ట్టుగా ఉంది. ఇప్పుడు రాహుల్ కు అవ‌కాశం ఇస్తే అదే అల‌వాటుగా మార‌తుంద‌ని బీజేపీ చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ అన్న మాట‌ల‌కు రెండేళ్ల జైలు శిక్ష చాలా చాలా ఎక్కువ‌ని కోర్టు చ‌ట్ట‌ప్ర‌కార‌మే స్పందించింది క‌దా. కింది కోర్టు తీర్పును స్వాగ‌తించిన బీజేపీ, స‌ర్వోన్నత న్యాయ‌స్థానం తీర్పును హుందాగా స్వాగ‌తించి ఉంటే పోయేదిగా!