భూమన నాయకత్వంలో టీటీడీలో ధార్మిక, సామాజిక విప్లవం

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి గురించి చెప్పుకుంటే భూమన కరుణాకర రెడ్డి, ఆ తరువాత అనే చెప్పుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ…

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి గురించి చెప్పుకుంటే భూమన కరుణాకర రెడ్డి, ఆ తరువాత అనే చెప్పుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పని చేసిన ఆయన సనాతన హిందూ ధర్మాన్ని ఒక వైపు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనలకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేయించారు. మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన మార్కు వేసుకున్నారు. రెండోసారి ఆయ‌న టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మితులైన సంద‌ర్భంగా , గ‌తంలో ఆయ‌న చేసిన గొప్ప కార్యాల గురించి తెలుసుకుందాం.

దళిత గోవిందం

తాళ్ళపాక అన్నమాచార్యులు చెప్పిన విధంగా టీటీడీలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిలను దళిత వాడలకు తీసుకెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి భూమన కరుణాకర రెడ్డి శ్రీకారం చుట్టారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులతో పాటు తాను కూడా దళిత వాడలకు వెళ్ళి కళ్యాణం అనంతరం అక్కడే నిద్రించే విప్లవాత్మక కార్యక్రమం అమలు చేశారు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకెళ్ళారు. ఆయన హయాంలో టీటీడీ చేపట్టిన సామాజిక కార్యక్రమాల్లోఅత్యంత ఆదరణ లభించింది కార్యక్రమాల్లో ఇదొకటి.

కళ్యాణమస్తు

పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూత నివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణ మస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఈ సామూహిక వివాహాల కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. స్వామివారి సమక్షంలో పెళ్ళి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేసే ఈ కార్యక్రమం ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఉచితంగా పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా వధూవరులకు పెళ్ళి బట్టలు, వధువుకు తాళి బొట్టు, మెట్టెలు, పెళ్ళి విందు కూడా ఉచితంగా అందించి కొన్ని వేల కుటుంబాలకు సహాయం చేశారు. ఇప్పటికి కూడా కళ్యాణమస్తు అనగానే కరుణాకర రెడ్డే గుర్తుకు వచ్చేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండో సారి టీటీడీ సారధ్య బాధ్యతలు స్వీకరిస్తున్న కరుణాకర రెడ్డి తిరిగి ఈ కార్యక్రమం అమలు చేయించే అవకాశం ఉంది.

గోమహా సమ్మేళనం

సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహా సమ్మేళనం నిర్వహించారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టత ను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు అందుకుంది.

ధార్మిక సదస్సు

సనాతన హిందూ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు భూమన కరుణాకర రెడ్డి నాయకత్వంలోని ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు.

ఎస్వీ బీసీ

హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ సొంతంగా టీవీ చానల్ ప్రారంభించాలనే ఆలోచనతో శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఎస్వీ బీసీ ని ప్రారంభించారు.

ఉద్యోగుల సంక్షేమం

ఒక వైపు ధార్మిక కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు టీటీడీ ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా దృష్టి పెట్టారు. 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఇంటి స్థలాలను ఇప్పించడంలో  కరుణాకర రెడ్డి చూపిన తెగువ  మాటల్లో చెప్పలేనిది. బ్రాహ్మణ పట్టు, డెయిరీ ఫామ్, పూర్ హోమ్ లో ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వినాయకనగర్, ఎస్జీ ఎస్ కళాశాల వద్ద అపార్ట్ మెంట్లు నిర్మించి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. పూర్ హోమ్, డెయిరీ ఫామ్‌లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలను కూడా అందించారు. ఆ తరువాత  కొందరు అధికారుల మూలంగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కరుణాకర రెడ్డి మరోసారి టీటీడీ అధ్యక్షుడిగా నియమితులైనందున‌ ఈ సమస్య పరిష్కారమై తమకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.

అలాగే కరుణారరెడ్డి హయాంలో అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇవికొన్ని మాత్రమే. రెండో సారి టీటీడీ చైర్మన్‌గా భాద్యతలు తీసుకుంటున్న కరుణాకర రెడ్డి మరో మారు టీటీడీని హిందూ ధర్మ ప్రచారం కోసం పరుగులు పెట్టిస్తారని ఆశిద్దాం.