జ్ఞానవాపిపై బాబ్రీ తరహాలో భయపడుతున్నారా?

హిందూ ఆలయాలను కూల్చి, శిథిలం చేసి వాటి స్థానంలో అప్పటి ముస్లిం పాలకులు మసీదులు నిర్మించారా? అనేది ఎప్పటికీ వివాదాస్పద అంశమే. ఒక ప్రాంతం మీద మరొకరు దాడులు నిర్వహించినప్పుడు అక్కడి సాంస్కృతిక మూలాలను…

హిందూ ఆలయాలను కూల్చి, శిథిలం చేసి వాటి స్థానంలో అప్పటి ముస్లిం పాలకులు మసీదులు నిర్మించారా? అనేది ఎప్పటికీ వివాదాస్పద అంశమే. ఒక ప్రాంతం మీద మరొకరు దాడులు నిర్వహించినప్పుడు అక్కడి సాంస్కృతిక మూలాలను సర్వనాశనం చేయడం అనేది సాధారణంగా జరిగే సంగతే. 

ఆ క్రమంలో భాగంగా దండయాత్ర నిర్వహించిన అప్పటి ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను సర్వనాశనం చేసి ఉండడం సహజంగా జరిగి ఉంటుంది. అయితే ఆ శిబిరాల మీదనే వారు మసీదులు నిర్మించుకుని ఉంటే .. ఆ ఆనవాళ్లను ఇప్పుడు శాస్త్రీయంగానూ పరిశోధించి రాబడుతున్నారు. మసీదులు కావాలంటే మరొక చోట కూడా నిర్మించుకుని ఉండవచ్చు. కానీ హిందూ ఆలయ శిథిలాల మీద కట్టడం వలన అనేక దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ అవి మానని గాయాలలాగా రేగుతూనే ఉన్నాయి.

‘రామజన్మ స్థలంలో ఉన్న ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారు’ అనే అంశంపై రేగిన వివాదం దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన సంగతి అందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలం న్యాయ విచారణ తర్వాత ఆ వివాదం సమసిపోయి, గాయం మానుతున్నది అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు వివాదం తెరమీదకు వస్తోంది.

బాబ్రీ మసీదు రామాలయ స్థలంలోనే నిర్మించినట్టుగా సాక్షాధారాల సహా న్యాయస్థానం కూడా నిర్ధారించింది. ఇప్పుడు జ్ఞానవాపి మసీదులో కూడా హిందూ సంస్థలు చెబుతున్నట్టుగా అక్కడి శివాలయం ఉన్న మాట నిజమేనని ముస్లిం సంస్థలే భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ జ్ఞానవాపీ మసీదు పై భారత పురావస్తు శాఖ  వారు సర్వే పూర్తిచేసి, నివేదిక ఇచ్చిన తరువాత బాబ్రీ మసీదు తరహా ఘటనలు పునరావృతం కాకూడదని అంటున్నారు.

జ్ఞానవాపి మసీదు విషయంలో న్యాయస్థానం నిర్ణయాన్ని గౌరవిస్తామని అంటున్నారు. ఒకవేళ పురావస్తు శాఖ సర్వేలో అక్కడ శివాలయం ఉన్న మాట ధ్రువీకరణ అయితే ఏం చేయాలో ఆయనే సలహా ఇస్తే బాగుంటుంది.

డిసెంబరు 6 ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్న ఒవైసీ అప్పటి పరిస్థితులు వేరు అని గుర్తించాలి. ఇలాంటి శాస్త్రీయమైన ధృవీకరణ లేకపోవడం వల్ల, రామాలయ స్థానంలో బాబ్రీ మసీదు కట్టారనే వాదనతో హిందూ సంస్థలు దానిని కూల్చివేశాయి. 

ఇప్పుడు జ్ఞానవాపి మసీదు విషయంలో వేరే వివాదం తలెత్తకుండా శాస్త్రీయమైన సర్వే జరుగుతోంది. సర్వే తర్వాత అక్కడ హిందూ ఆలయం ఉండేదని, మసీదు నిర్మాణం అక్రమం అని తేలిస్తే గనుక ముస్లిం సంస్థలు దానిని గౌరవిస్తాయా అనేది ఓవైసీ తేల్చి చెప్పాలి. దేశంలో సౌహార్థ వాతావరణం చెడిపోకుండా ఉండడానికి తన వంతుగా ఆయన సూచన ఏమిటో తేల్చాలి. పురావస్తు సర్వే తేల్చే అంశాలకు హిందూ ముస్లింలు అందరూ కట్టుబడి ఉండాలని అనుకుంటేనే దేశానికి మంచిది.