జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాటలను ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో? తరువాత ఆయన చేతలు ఎలా వేరుగా వుంటాయో, మళ్లీ ఆ చేతలకు అనుగుణంగా మాటలను ఎలా సవరించుకుంటారో తెలిసిందే.
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించారు. ప్రతి చోటా కనీసం వెయ్యి ఓట్లు వుంటాయన్నారు. తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. పొత్తు ఎవరితో అన్నది తరువాత చెబుతా అన్నారు.
సరే ప్రతి చోటా ఫ్యాన్స్ వుంటారమ్మా అన్న మహేష్ బాబు డైలాగ్ ప్రకారం పవన్ కు కూడా ప్రతి చోటా ఫ్యాన్స్ వుంటారు. ఆ విషయం పక్కన పెడితే తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు. ఇదేమీ కొత్త మాట కాదు. గతంలో కూడా అనేక సార్లు ఆయన పోటీ చేస్తా అన్నారు చేయలేదు. అందువల్ల ఈ పోటీ మాటను కూడా సీరియస్ గా ఎవ్వరూ తీసుకోరు. పోనీ ఈసారి నిజంగా పోటీ చేస్తారు అనే అనుకుందాం…ఎవరితో పొత్తు అన్నది తరువాత చెబుతా అంటున్నారు.
ఆల్రెడీ ఆయన భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా ఆ పార్టీతోనే వెళ్లాలి లెక్క ప్రకారం. అలా కాదు ఆంధ్రలో భాజపాతో, తెలంగాణలో తెరాసతో వెళ్లా అని అంటారా? అప్పుడు కానీ జనం బుగ్గలు నొక్కుకోరు. రెండు చోట్ల ఇద్దరితో పొత్తు అంటే నవ్వక ఏం చేస్తారు? తెలంగాణ లో భాజపా వుంది, తెలుగుదేశం వుంది. మళ్లీ వాటితోనే వెళ్లాలి కానీ కొత్త పొత్తులు అనకూడదు కదా?
అంటే పవన్ మదిలో భాజపాను వదిలి తేదేపాతో ముందుకు వెళ్లే ఆలోచన వుందా? అదే పద్దతిలో తెలంగాణలో కూడా పోటీ చేసి చంద్రబాబుకు ఓట్లు సంపాదించి పెట్టాలనుకుంటున్నారా? ఏమో? కానీ ఇంకో గమ్మత్తయిన ముచ్చట కూడా వుంది.
ఆంధ్రలోనే అధికారం ఆశించలేదు..తెలంగాణలో ఆశిస్తానా? అన్నారు. అధికారం ఆశించని దానికి రాజకీయాలు దేనికి? వేరే వాళ్లకు అధికారం అందించడానికా?
పవన్ మాటలు ఇలాగే వుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించడం అనవసం అనిపించేలా?