మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిలో అధికారంపై రోజురోజుకూ ధీమా పెరుగుతోంది. ఆయన ఆలోచనల్లో మార్పు వస్తోంది. సొంతంగానే అధికారంలోకి వస్తామన్న నమ్మకం పెరిగింది. ఇతర పార్టీలను కలుపుకుని పోవాలన్న ఆలోచనల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. నిన్నటి వరకూ జనసేనానిపై ఉన్న అవకాశవాద ప్రేమ, నేడు ఏమైందో, ఎక్కడుందో తెలియని పరిస్థితి. మరోవైపు జనసేనతో పొత్తుకు ఆయన పునరాలోచనలో పడ్డారు.
బాదుడే బాదుడే పేరుతో జనంలోకి వెళుతున్న చంద్రబాబు … తనకు ప్రజలు నీరాజనం పడుతున్నారని నమ్ముతున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే తన సభలకు పోటెత్తుతున్నారని విశ్వసిస్తున్నారు. జనం రాక చంద్రబాబులో భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నదనేది నిజం. దీంతో పవన్‌తో పొత్తు, కొత్త సమస్యని సృష్టించుకోవడమే అనే భయం ఆయన్ను పట్టుకుంది. జనసేనతో పొత్తు కుదుర్చుకుని, అనవసరంగా వారికి సీట్లు కేటాయించి నష్టపోతామనే ఆందోళన పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఆయనపై పెరుగుతోంది. పొత్తు లేకుండానే ఎన్నికల బరిలో నిలబడాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో చంద్రబాబు స్వరంలో మార్పు వచ్చింది. అందుకే పొత్తుపై ఆయన మౌనం పాటిస్తున్నారు. ఇటీవల జగన్‌పై యుద్ధానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం పార్టీ నిర్మాణం లేని జనసేనతో పొత్తు కుదుర్చుకుని, కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించినట్టు అవుతుందనే హెచ్చరిక పార్టీ నేతల నుంచి వెళ్లింది. త్యాగాలకు సిద్ధమని తొందర పడి మాట్లాడారనే విమర్శ సొంత పార్టీ నుంచే బలంగా వినిపించింది. అందుకే చంద్రబాబు పొత్తుపై యూటర్న్ తీసుకోవడాన్ని గమనించొచ్చు. జనంతో పొత్తు అన్నానే తప్ప, జనసేనతో కాదని ఆయన మాట మార్చారు.
కుప్పంలో వన్‌సైడ్ లవ్ కామెంట్స్ కూడా గాలికి పోయాయి. తెలంగాణాలోనే మూడోంతుల సీట్లలో పోటీ చేయనున్నట్టు జనసేనాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం బలం లేని చోట మూడొంతుల సీట్లలో పోటీ చేస్తే, ఇక ఆంధ్రాలో సగం సీట్లు అడుగుతారని, అన్ని ఇస్తే …చేజేతులా మరోసారి వైసీపీ చేతికి అధికారం పూలల్లో పెట్టి అప్పగించినట్టే అని బాబుకు పార్టీ నాయకులు నూరిపోస్తున్నారని తెలిసింది. మహా అయితే 15 సీట్లకు మించి జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేనట్టు పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన వెనుక టీడీపీ వ్యూహం లేకపోలేదు.
జనసేనతో వన్‌సైడ్ లవ్, కలిసి వస్తే త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు అన్న నేపథ్యంలో, ఇప్పుడు ఒక్కసారిగా కుదరదంటే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తనకు తానే జనసేనాని పొత్తు వద్దనుకునేలా చేయడమే చంద్రబాబు ఎత్తుగడ. అందుకే ఇటీవల కాలంలో పొత్తుపై చంద్రబాబు అసలు మాట్లాడ్డం లేదు. అంతేకాదు, అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే సమర్థులకు అవకాశం ఇస్తామన్నారు. జనసేనతో పొత్తు ఆలోచన వుంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు ఆలోచన ఇప్పట్లో చేసి వుండేవారు కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరి వరకూ ఏదీ తేల్చకపోవడం చంద్రబాబు నైజమని, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఈ దఫా చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నప్పటి నుంచి చంద్రబాబులో మునుపెన్నడూ లేని ధీమా కనిపిస్తోంది. తన సభలకి జనం వెల్లువెత్తడం, ఇదే సందర్భంలో గడపగడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు వెళుతుంటే, ప్రజలు నిలదీస్తున్నారనే వార్తలు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనతో పనేంటి? అనే ప్రశ్నే టీడీపీలో అంతర్గత చర్చకు దారి తీసింది.
త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు అన్నప్పటి నుంచి జనసేన నేతలు లెక్కలేకుండా మాట్లాడ్డం కూడా టీడీపీకి చురుక్కు మంటోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తారా? అలాగైతేనే టీడీపీతో పొత్తుకు సిద్ధమని జనసేన నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని టీడీపీ ఆగ్రహంగా ఉంది. జనసేనతో పొత్తు విషయమై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పందిస్తూ… ఉలవచేను ఒత్తు, పగాడితో పొత్తు వద్దనే సామెతను గుర్తు చేయడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో పొత్తులపై మహానాడులో చంద్రబాబు స్పష్టత ఇస్తారని టీడీపీ నాయకులు అన్నారు.
నిన్నటి వరకూ జనసేనతో పొత్తుకు టీడీపీ ఆసక్తి కనబరిచిన మాట నిజమే అని ఇరు పార్టీల నేతలు ఒప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబుపై పెరుగుతున్న ప్రజాదరణ, జగన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో సహజంగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఖరిలో అనూహ్య మార్పు వచ్చింది, మున్ముందు మరింత వస్తుందని చెప్పక తప్పదు. రాజకీయం అంటే ఇదే కదా!
-సొదుం రమణ