ప్రతి మనిషికీ అజ్ఞానమే అతి పెద్ద శత్రువు. దాన్ని జయించిన వాళ్లు దేన్నైనా సాధిస్తారు. జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శత్రువుగా చూస్తారు. అందుకే జగన్ ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా పవన్ తీవ్రంగా పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను సీఎం కానివ్వనని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాదరణ ముందు, పవన్ ప్రతిజ్ఞ, శపథాలకు విలువ లేకుండా పోయింది.
రాజకీయాల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ విషయం బాగా తెలిసి కూడా పవన్‌కల్యాణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. తన వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రజలపై రుద్దాలనే క్రమంలో ఆయన రాజకీయంగా ఫెయిల్ అయ్యారు. అయితే గెలుపోటములు శాశ్వతం కాదు. కానీ ఓటమికి కారణాలు తెలుసుకుని, తప్పులు సరిదిద్దుకునే వాళ్లనే గెలుపు వరిస్తుంది. ఈ విషయంలో పవన్ వైఖరిలో మార్పు రాలేదు. దాన్నే అజ్ఞానమని చెప్పడం. తన తిక్కకో లెక్క ఉందని ఓ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అజ్ఞానానికి లెక్కేంటో పవన్‌కే తెలియదు.
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పవన్ మాటల వెనుక మర్మమేంటో ఆయనకే తెలియాలి. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
“2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని సైతం ఒప్పిస్తా. ఆ పార్టీ హైకమాండ్‌తో ఈ విషయం చర్చిస్తా. రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. బీజేపీ అధినాయకత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలనని అనుకుంటున్నా. బీజేపీ విధానాలు ఎలా ఉన్నా.. నా నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తారనే భావిస్తున్నాను. నాకు మోదీతో బాగా కనెక్షన్ ఉంది” అని పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ చెప్పేది ఎట్లా వుందంటే తాతకు దగ్గు నేర్పుతా అన్నట్టు. బీజేపీని పవన్ ఒప్పించడం ఏంటి? అసలు ఏమిటీ ఆలోచన. రాజకీయాల్లో రెండు రెళ్లు నాలుగు ఎప్పటికీ కాదు. రాజకీయ లెక్కులు వేరుగా వుంటాయి. బీజేపీకి రాజకీయ పాఠాలు నేర్పాలని అనుకోవడంలోనే పవన్ అజ్ఞానం బయటపడింది. ఏమీ తెలియకుండానే దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తున్నదా? ఏ రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలో బీజేపీకి మరొకరు చెప్పాలా? జగన్ అంటే పవన్‌కు వ్యక్తిగతంగా పడదని లోకమంతా తెలుసు. ఇదే సందర్భంలో టీడీపీ చేతిలో పదేపదే మోసపోతున్నామనే ఆవేదన బీజేపీలో వుంది. చంద్రబాబు నమ్మకస్తుడైన నాయకుడు కాదని బీజేపీ భావన.
టీడీపీతో పొత్తు వల్ల ఆ పార్టీకే తప్ప తమకు లాభం లేదని బీజేపీ భావిస్తోంది. ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఏదో ఒకటి ధ్వంసమైతే తప్ప, తాము బలపడే అవకాశాలు లేవని బీజేపీ ఆలోచిస్తోంది. అలాంటప్పుడు పవన్ చెప్పినట్టు విని, టీడీపీని బలోపేతం చేయాలని బీజేపీ ఎందుకు తనను తాను బలిపెట్టుకుంటుంది? అయినా టీడీపీని అధికారంలోకి తేవాలన్న తపన పవన్‌లో ఎందుకు?
జనసేనతో కలిసి 2024లో అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తామని బీజేపీ నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, అలాగే వ్యవస్థలో మార్పు తేవాలని ఉపన్యాసాలు చెప్పే పవన్, ఆచరణకు వచ్చే సరికి, అందుకు పూర్తి విరుద్ధంగా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాజకీయాల్లో జగన్, పవన్, చంద్రబాబు శాశ్వతం కాదు. రాజకీయాల్లో విలువలను పాటించిన వాళ్లనే సమాజం గుర్తు పెట్టుకుంటుంది. తాను ఏ విలువలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారో పవన్ ఆత్మ పరిశోధన చేసుకోవాలి. తన శత్రువు అజ్ఞానమే అని గ్రహించాలి. అజ్ఞాన పొరలు చెరిగిపోనంత వరకూ పవన్ ఆలోచనలు ఇట్లే వుంటాయి.
ఒక వైపు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే, మరోవైపు ఆ పార్టీని ఒప్పిస్తానని పవన్ చెప్పడం ఏంటి? ఇదే కదా అతి అని ఎవరైనా విమర్శించేది? బీజేపీ మనసెరిగి ప్రవర్తిస్తే, జనసేనానికి భవిష్యత్ వుంటుంది. లేదంటే రెంటికీ చెడ్డ రేవడిలా పవన్ రాజకీయ జోకర్‌గా మిగులుతారు.
సొదుం రమణ