అక్కడ నిర్మాత తప్పు.. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ తప్పు

సినిమా ప్రమోషన్ టైమ్ లో తన సినిమా గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతుంటారు మేకర్స్. కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు నిర్మాత దిల్ రాజు. ఎఫ్3 సినిమా టైమ్ లో ఆయన తన సినిమా…

సినిమా ప్రమోషన్ టైమ్ లో తన సినిమా గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతుంటారు మేకర్స్. కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు నిర్మాత దిల్ రాజు. ఎఫ్3 సినిమా టైమ్ లో ఆయన తన సినిమా కంటే టాలీవుడ్ బిజినెస్, నిర్మాత కష్టాలు, పెరిగిన టికెట్ రేట్లు, ఫేక్ కలెక్షన్లపై ఉన్నదున్నట్టు మాట్లాడారు.

మీడియా సమావేశంలో మొదటి ప్రశ్నకే రొటీన్ గా వద్దు, కొత్తగా మాట్లాడుకుందాం అని మొదలుపెట్టిన దిల్ రాజు, గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా టాలీవుడ్ మార్కెట్, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చేస్తున్న తప్పులపై ఓపెన్ గా స్పందించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే ప్రస్తుతం మార్కెట్లో అవ్యవస్థకు కారణం అన్నారు దిల్ రాజు.

“తన సినిమా గొప్పగా ఉందంటూ నిర్మాత వంద చెబుతాడు. తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎంతకు తీసుకోవాలని అనేది డిస్ట్రిబ్యూటర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఓ సినిమా హిట్టయితే ఎంత వస్తుంది, ఫ్లాప్ అయితే ఎంత నష్టం వస్తుంది, ఎంత పెట్టాలనేది డిస్ట్రిబ్యూటర్ ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ప్రొడ్యూసర్ ది తప్పు కాదు, తప్పంతా డిస్ట్రిబ్యూటర్లదే. ఒక డిస్ట్రిబ్యూటర్ గా నేను గుడ్డిగా వెళ్లను. సినిమా ఫ్లాప్ అయితే నాకు ఎంత నష్టం వస్తుంది అనే పాయింట్ ను ముందుగా లెక్కేసుకుంటాను. అక్కడ్నుంచి లెక్కలేసుకొని సినిమా కొంటాను.”

చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వాస్తవ పరిస్థితిని గమనించకుండా డబ్బులు పెడుతున్నారని, అందుకే నష్టాలు చూస్తున్నారని దిల్ రాజు ఆరోపించారు. ఇక మార్కెట్లో నిర్మాతది కూడా తప్పు ఉందన్నారు దిల్ రాజు. ఓ సినిమాకు ఎంత పెట్టాలనే అంశం దగ్గర్నుంచి, ప్రతి షెడ్యూల్ కు బడ్జెట్ పై చర్చ అవసరం అన్నారు. ఇలా చేయకుండా చాలా మంది నిర్మాతలు టాలీవుడ్ మార్కెట్ ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

“సినిమా కొనే విషయంలో డిస్ట్రిబ్యూటర్ ది తప్పు. బడ్జెట్ విషయంలో నిర్మాతది తప్పు. రెమ్యూనరేషన్లు, బడ్జెట్ ముందుగా నిర్మాత చూసుకోవాలి. నేను నా సినిమాలకు ఓ 10శాతం ఎక్కువే వేసుకుంటాను. ప్యాండమిక్ టైమ్ లో నా సినిమాలన్నింటిపై 50 కోట్లు బడ్జెట్ పెరిగింది. అవన్నీ నాకు తెలిసి పెరిగాయి. శంకర్ లాంటి దర్శకుడితో సినిమా తీస్తూ కూడా నేను నా బడ్జెట్ లెక్కలు దాటలేదు. ప్రతి షెడ్యూల్ కు బడ్జెట్ పై డిస్కషన్ ఉంటుంది. ఒక షెడ్యూల్ లో పెరిగితే, మరో షెడ్యూల్ లో ఎలా తగ్గించాలని రోజూ ఆలోచిస్తాం. కానీ కొంతమంది నిర్మాతలు ఇలా లెక్కలేసుకోవడం లేదు. బడ్జెట్ గురించి ఆలోచించకుండా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు. కొన్ని పెద్ద నిర్మాతలు నష్టపోవడానికి ఇదే కారణం.”

టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న కలెక్షన్ల గొడవ కూడా భవిష్యత్తులో ఉండదని జోస్యం చెప్పారు దిల్ రాజు. కలెక్షన్ల లెక్కలతో ఫ్యాన్స్ కొట్టుకునే రోజులు పోతాయని, పారదర్శకంగా వసూళ్లు వెల్లడించే పద్ధతి వస్తుంది అన్నారు. ఇక అప్పుడు ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు వేసుకునే అవకాశం ఉండదని తేల్చిచెప్పారు. టాలీవుడ్ లోని అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్టే, వసూళ్ల విషయంలో కూడా మార్పు అనివార్యం అన్నారు.