మొన్న నాగరాజు.. నిన్న నీరజ్.. మరో పరువు హత్య

హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య చోటుచేసుకుంది. మొన్నటికిమొన్న నాగరాజు అనే వ్యక్తిని సరూర్ నగర్ ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు బేగంబజార్ లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.…

హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య చోటుచేసుకుంది. మొన్నటికిమొన్న నాగరాజు అనే వ్యక్తిని సరూర్ నగర్ ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు బేగంబజార్ లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఇది కూడా పరువు హత్యే. తమ కులం కాదనే కోపంతో, అమ్మాయి బంధువులు ఈ హత్యకు తెగబడ్డారు.

బేగం బజార్ కు చెందిన నీరజ్ కుమార్ చిన్న వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకొని, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల కిందట వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే పెళ్లయి ఇన్నేళ్లయినా సంజన కుటుంబీకుల మనసు మారలేదు. మరీ ముఖ్యంగా సంజన సోదరుడు నీరజ్ పై పగబట్టాడు.

6 నెలలుగా నీరజ్ కదలికల్ని గమనిస్తున్న సంజన సోదరుడు.. నిన్న అతడ్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం వర్షం పడడంతో జనాలు తక్కువగా ఉన్నారు. అదే సరైన టైమ్ అని భావించి తన ఫ్రెండ్స్ ను పిలిచాడు. వ్యాపారనిమిత్తం రోడ్డుపైకొచ్చిన నీరజ్ ను రాయితో తలపై కొట్టి చంపాడు. తర్వాత కొబ్బరిబొండాల కత్తితో పొడిచాడు.

నీరజ్ ను గమనించిన స్థానికులు హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే నీరజ్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

జరిగిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గంటల వ్యవథిలోనే కేసును ఛేదించారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. నీరజ్ ను ఐదుగురు చంపినట్టు గుర్తించారు. వాళ్లకు మరో ఐదుగురు సహకరించినట్టు తెలుసుకున్నారు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యకు నిరసనగా వ్యాపారులంతా ఈరోజు బేగంబజార్ బంద్ కు పిలుపునిచ్చారు.