మే 21, 1991. జీవితంలో మరిచిపోలేని రోజు. ఆ రోజు తిరుపతి గంగజాతర. తిరుపతి వాసులకి పెద్ద పండుగ కింద లెక్క. ఊరంతా ఒకటే సందడి. రకరకాల వేషాలతో, డప్పుల సౌండ్‌తో కోలాహలంగా ఉంది. జర్నలిస్టులకి సెలవు దొరకడం కష్టం. అయినా సరే జాతరకి సెలవు తీసుకునేవాన్ని.
రాత్రి జాతరలో కలుసుకుందామని కొందరు మిత్రులు ముందే నిర్ణయించుకున్నాం. అర్థరాత్రి తర్వాత అసలు జాతర వుంటుంది. తెల్లవారి అమ్మవారి మట్టి విగ్రహం చెంప నరుకుడు తర్వాత ఆ మట్టిని తీసుకెళ్లి పవిత్రంగా దాచుకుంటారు.
రాత్రి 10 గంటల సమయం. గుడికి వెళ్లే ఇరుకుదారిలో ఇరువైపులా దుకాణాలు, ఒకటే సందడి. బొమ్మల దుకాణాల వద్ద పిల్లలు ఏవేవో కొనిపెట్టమని అమ్మానాన్నలతో మారాం చేస్తున్నారు. ఆడవాళ్లు గాజులు బేరం చేస్తున్నారు. చిన్న రంగుల రాట్నం హుషారుగా తిరుగుతోంది. జనం వస్తున్నారు, వెళుతున్నారు.
11 గంటలు దాటాక వాతావరణంలో ఏదో మార్పు. జనం భయంగా ఏదో మాట్లాడుతున్నారు. హడావుడిగా అంగళ్లు మూస్తున్నారు. ఏదో జరిగిందని తెలుసు, ఏం జరిగిందో తెలియదు. సెల్‌ఫోన్లు లేని కాలం.
ఒక జర్నలిస్టు మిత్రుడు హడావుడిగా వచ్చి “రాజీవ్‌గాంధీని హత్య చేశారు. అల్లర్లు జరుగుతాయి. వెళ్లి పోదాం” అన్నాడు. చూస్తూ వుండగానే జాతర ఖాళీ అయ్యిపోయింది. జనం దాదాపుగా పారిపోయారు. నేను కాలినడకన బయల్దేరాను. ఇల్లు ఒక కిలో మీటర్.
అప్పటికి వీధుల్లో యువకులు అరుస్తూ ఏడుస్తున్నారు. టైర్లు కాలుతున్నాయి. మెయిన్‌రోడ్డు నుంచి కాకుండా సందుల్లో నుంచి ఇల్లు చేరాను. మరుసటి రోజు బంద్ వాతావరణం. రోడ్లన్నీ బ్లాక్. పోలీసు వెహికల్ సౌండ్.
తిరుపతిలో తమిళులు ఎక్కువ. వాళ్లపై దాడి జరుగుతుందని భయపడ్డారు. ఒక్క సంఘటన కూడా జరగలేదు. దీనికి కారణం భూమన కరుణాకరరెడ్డి లాంటి యువనాయకులు. హింస ద్వారా రాజకీయం చేయాలని ఆయన ఏనాడూ అనుకోలేదు. 30 ఏళ్లుగా అదే విధంగా ఉన్నారు.
జీఆర్ మహర్షి