కేసీఆర్ మోనార్క్ వైఖరి.. మేలుచేస్తుందా?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన ప్రతిభను పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. నిజంగా జాతీయ రాజకీయాల మీద శ్రద్ధతోనే.. ఢిల్లీ వైపు దృష్టిసారిస్తున్నారా? లేదా, రాష్ట్రంలో తన చేతులమీదుగానే వారసుడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక మార్గంగా…

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన ప్రతిభను పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. నిజంగా జాతీయ రాజకీయాల మీద శ్రద్ధతోనే.. ఢిల్లీ వైపు దృష్టిసారిస్తున్నారా? లేదా, రాష్ట్రంలో తన చేతులమీదుగానే వారసుడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక మార్గంగా జాతీయ రాజకీయాలను అడ్డదారిలా వాడుకుంటున్నారా? అనేది ఇప్పటికీ ప్రజలకు సస్పెన్స్ గానే ఉంది. అయితే.. తాజాగా రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మాత్రం.. ఆయనలోని మోనార్క్ ధోరణికి నిదర్శనంగానే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించి తీరాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నారు. వామపక్షాలూ అనుకుంటున్నాయి. మమత, కాంగ్రెస్ కూడా అనుకోవడంలో వింత లేదు. అయితే వీరందరూ సమష్టిగా అనుకుంటున్నారా? విడివిడిగా అనుకుని.. బిజెపి నెత్తిన పాలు పోస్తారా అనేది కీలకం. 

మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం ఏర్పాటుచేసింది. కేసీఆర్ కూడా తనలాగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గనుక.. ఆయనకు దీదీ ఫోను కూడా చేసింది. తీరా మీటింగ్ ముహూర్తం వచ్చేసరికి, అయితే ‘‘ఠాట్ మీరు కాంగ్రెస్ ను పిలుస్తారా’’ అంటూ కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీదీ తనకు ఫోను చేసినప్పుడు.. కాంగ్రెస్ ను పిలవకుండా.. మిగిలిన ప్రాంతీయ పార్టీలతో సమావేశం పెట్టుకుని.. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. దానిని కాంగ్రెసుకు చెప్పవచ్చునని కేసీఆర్ సూచించారట. ఆయన సూచనను పట్టించుకోనందువల్ల.. దీదీ పెట్టే మీటింగుకు ఆయన వెళ్లదలచుకోలేదుట..! అలా అని వార్తలు వచ్చాయి. 

కేసీఆర్ మాటలు.. ఆయన మోనార్క్ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ ను రాష్ట్ర రాజకీయాల్లో వ్యతిరేకించవచ్చు గాక.. జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. బిజెపి, కాంగ్రెస్ ఇద్దరినీ వ్యతిరేకిస్తూ తృతీయ కూటమే ముద్దు అని ఆయన చాటుతూ ఉండవచ్చు గాక.. కానీ.. పట్టు విడుపు లేకుండా ఇలా చేస్తే.. ఆయన జట్టులో ఎవరు మిగులుతారు. ఒకవైపు కూటమి ఆలోచనకు సహకరిస్తున్న వారు పెద్దగా లేనందువల్లనే.. ఆయన జాతీయ పార్టీ అనే ప్రహసనానికి తెరలేపుతున్నారనే విమర్శలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో.. కేసీఆర్ ఇదే మోనార్క్ తీరునుచూపిస్తూ ఉంటే.. ఆయన జాతీయ పార్టీకి మాత్రం మనుగడ ఉంటుందా?

ఏతావతా.. కాంగ్రెస్ ను దూరం పెట్టాలనే అడ్డగోలు సిద్ధాంతంతో.. కొందరు అనుమానిస్తున్నట్టుగా.. కేసీఆర్ భారతీయ జనతాపార్టీకి మేలు చేయడానికే ఈ వ్యవహారం నడిపిస్తున్నారా? అనేది కూడా సందేహమే. ఇవాళ్టి వైఖరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా మేలు చేసే అవకాశం కూడా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.