ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మవిశ్వాసాన్ని ఆయన చిరకాల ప్రత్యర్థి మమతా బెనర్జీ అమాంతం ఆకాశానికి పెంచేశారు. మమతా దీదీ స్వయంగా ఏర్పాటు చేసిన సమావేశం సాక్షిగా.. తన బలానికి గానీ, తన వ్యూహాలకు గానీ ఎదురు లేనే లేదని, తన ప్రత్యర్ధులు తలకిందులుగా తపస్సు చేసినా తనను అందుకోజాలరని నరేంద్ర మోదీ పరిపూర్ణంగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. మోదీకి ఉన్న బలానికంటే.. ప్రత్యర్థుల అనైక్యత వలన కలిసివచ్చిన బలమే పెద్దదని అందరికీ అర్ధం అవుతోంది.
బిజెపి తరఫున బరిలోకి దిగబోయే రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించడం ద్వారా.. నరేంద్రమోదీ కి షాక్ ఇవ్వాలని విపక్షాలు అందరూ ఆరాటపడడం సహజమే. కానీ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోగల వారు ఎందరుంటారు? ఇప్పుడు జరిగింది కూడా అదే. ప్రతిపక్షాల తరఫున ఒక ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడం కోసం మమతా దీదీ ఢిల్లీలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే.. సమావేశానికి ఆమె నేతృత్వం వహించడం ఇష్టంలేని వారు కొందరు, ఇతరత్రా సాకులు చెబుతూ కొందరు, ఫలానా పార్టీ ఉంటే మేం రాము అని చెబుతూ కొందరు ఇలా రకరకాలుగా గైర్హాజరయ్యారు.
ఎగ్గొట్టిన వారు పోగా.. పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. ఒక సుదీర్ఘమైన సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం ఏం సాధించింది. మోడీకి వారు కలగన్నట్లుగా ఝలక్ ఇవ్వగల ఒక మంచి నిర్ణయం ఏమైనా ఈ సమావేశంలో తేలిందా అంటే లేదు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మరాఠా నేత శరద్ పవార్ ను బరిలోకి దించాలని దీదీ తలపోసింది. ఆయన సమావేశానికి కూడా వచ్చారు. అయితే.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి బరిలోకి దిగబోయేది లేదని క్లారిటీ ఇచ్చారు.
దీదీ సారథ్యంలో విపక్షాలు ఎంత పేలవమైన సమావేశం నిర్వహించాయంటే.. పవార్ తిరస్కరించిన తర్వాత.. తమ ఉమ్మడి అభ్యర్థిగా రెండో ప్రత్యామ్నాయం ఏమిటో, ప్లాన్ బీ ఏమిటో లేకుండానే సమావేశంలో కూర్చున్నారు. దాంతో పవార్ వారి ఆశల మీద నీళ్లు చల్లడంతో.. మరో అభ్యర్థి కింద రెండు నామమాత్రపు పేర్ల ప్రతిపాదన వచ్చింది. నిర్ణయం జరగనేలేదు. పేలవమైన ఆ సమావేశం ముగిసింది.
ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే.. పవార్ ఎందుకు తిరస్కరించారు? బయటకు వెల్లడైనంత వరకు.. తాను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఇన్నింగ్స్ కొనసాగించాలని ఉన్నదని అందుకే రాష్ట్రపతి పదవికి బరిలో దిగనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, అసలు కారణం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. విపక్షాలు ఎంతగా కుస్తీలు పట్టినా బిజెపి అభ్యర్థిని ఓడించడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నందునే పవార్ తిరస్కరించారట.
ఇలా.. దీదీ ఏర్పాటుచేసిన విపక్ష సమావేశంలో కూర్చున్న వారే.. తమ ఉమ్మడి అభ్యర్థి నెగ్గుతారనే విశ్వాసం ప్రకటించలేకపోతున్న నేపథ్యంలో.. మోదీ ఆత్మవిశ్వాసం అమాంతం పెరగకుండా ఏమవుతుంది? దీదీ ప్రత్యామ్నాయంగా ప్రకటించిన పేర్లు గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా అనేవి.. నామమాత్రపు ప్రతిపాదనలే అనుకోవాలి. ఆ పేర్లు ఓట్లను కూడగట్టేంత చరిష్మా ఉన్న పేర్లు అనుకోడానికి వీల్లేదు.
రకరకాల కారణాల నేపథ్యంలో విపక్షాల్లో అందరి మద్దతును వారికి కూడగట్టడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఏతావతా.. కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా ఇంత పెద్ద కసరత్తు చేసి, సమావేశం పెట్టిన మమతా దీదీ.. మోదీ ఆత్మవిశ్వాసాన్ని తనవంతుగా కొంత పెంచినట్లే కనిపిస్తోంది.