తెలుగుదేశం- జనసేనల పొత్తు వ్యవహారం ఏ తీరానికి చేరుతుందో కానీ.. ఒకవేళ ఈ పొత్తు గనుక కుదరకపోతే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్ద చిల్లు అయితే పడే అవకాశం ఉన్నట్టుంది. రాయలసీమలో జనసేనతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి దక్కేదేమీ లేకపోయినా, జనసేన గనుక ఇప్పుడు సోలోగా పోటీ దిగితే.. సీమ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకుకు మాత్రం పెద్ద చిల్లు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
రాయలసీమలో తెలుగుదేశం- జనసేనల ఓటు బ్యాంకు వేర్వేరు కాదు. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులో బలిజలు ముందు వరసలో ఉంటారు. మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా జై కొడుతూ ఉన్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వాసనే బలిజలకు పెద్దగా పడదు. అలాగని తెలుగుదేశం పార్టీ వీరిని ఉద్ధరించింది ఏమీ లేదు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాయలసీమలో ఒక రేంజ్ కు ఎదిగిన బలిజ నేత ఒక్కరూ కనిపించరు. కొన్నాళ్ల పాటు రామచంద్రయ్య పేరును ప్రచారంలో పెట్టారు. ఒక్క టర్మ్ రాజ్యసభ సీటు ఇచ్చారంతే. ఆయన కూడా చాలా యేళ్ల కిందట తెలుగుదేశం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుంచినే బలిజలకు మంచి ప్రాతినిధ్యం లభించింది. రాజంపేట నుంచి ఎంపీగా బలిజ నేత వరస విజయాలను నమోదు చేశారు కూడా!
రాయలసీమలో తెలుగుదేశం నాయకత్వం అంతా కమ్మలే. అయితే వీరి జనాభా శాతం చాలా తక్కువ! చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం అంటే కమ్మ నేతలే కనిపిస్తారు. పేరుకు బీసీల పార్టీ అని చెప్పుకుంటూ.. బలిజల ఓట్లను కూడా గంపగుత్తగా పొందుతూ.. కమ్మ వాళ్లే నేతలుగా చలామణిలో ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో. మరి ఇంత జరిగినా… బలిజల విశ్వాసం మాత్రం తెలుగుదేశం పార్టీకి సొంతం అయ్యింది.
రాయలసీమ బలిజల్లో పరిమిత సంఖ్యలో ఓసీలు, మెజారిటీ మంది బీసీలున్నారు. కొందరు బలిజలు ఓసీలు, చాలా మంది బలిజలు బీసీలు. బలిజల్లో ఉన్న రకాలను బట్టి.. కొన్ని వర్గాల వారు బీసీలుగా రిజర్వేషన్లను పొందుతుంటారు. మరి కొందరు ఓసీలుగా ఉన్నారు. బలిజలు చిరంజీవిని చాలా యేళ్లుగా ఓన్ చేసుకున్నారు. కోస్తాంధ్రలోని కాపులు తాము ఒకటే అని వీరు ఒక ఐక్యతారాగాన్ని పాడుతూ ఉంటారు. అయితే బలిజలు, వారిలోని తెగల్లోకి వెళితే… చాలా వైరుధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే సీమలో బలిజల్లో ఉపశాఖ ఏదైనప్పటికీ.. తాము బలిజలం అని చెప్పుకోవడం జరుగుతుంది. విశేషం ఏమిటంటే.. సినిమాల వరకూ అయితే సీమ బలిజలు చిరంజీవిని పెద్దగా ఓన్ చేసుకునే వారు కాదు.
రాయలసీమలో మొదటి నుంచి సినిమా అభిమానంలో నందమూరి ఫ్యామిలీదే ఎక్కువ హవా ఉండేది. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సీమలో. ప్రజారాజ్యం పార్టీ పుట్టే ముందు వరకూ కూడా బలిజ యువత బాలకృష్ణకు బ్యానర్లు కట్టేది. అయితే ప్రజారాజ్యం ఆవిర్భావంతో.. అప్పటికే చిరంజీవి-బలిజ అనే మాటకు ఊపు వచ్చింది. పెద్ద ఎత్తున బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రజారాజ్యం వైపు మళ్లారు. అప్పటి నుంచినే బలిజ యువత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాలకృష్ణ నుంచి చిరంజీవి, పవన్ కల్యాన్, రామ్ చరణ్ ల వైపు మళ్లింది!
అయితే బలిజల సినీ అభిమానాన్ని బాగా చూరగొన్నా.. రాజకీయాల విషయంలో మాత్రం బలిజల పూర్తి మద్దతు ప్రజారాజ్యం పార్టీకి కానీ, జనసేనకు కానీ దక్కలేదు! బలిజల ఓట్లను 2009లో ప్రజారాజ్యం పార్టీ 60 శాతం పొందగా, తెలుగుదేశం పార్టీ 30 శాతం పొందింది. ఇక పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించినప్పుడు 2014లో బలిజల మద్దతు తెలుగుదేశం వైపు గట్టిగా నిలిచింది. ఇక గత ఎన్నికల సమయంలో.. కూడా బలిజ యువత పవన్ కల్యాణ్ కు బ్యానర్లు కట్టింది. అయినప్పటికీ.. మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకే జై కొట్టారు.
వందమంది బలిజ కులస్తుల ఓట్లు ఉన్న ఊర్లో జనసేన అభ్యర్థికి పది ఓట్ల లోపు పడ్డాయి సగటున. మిగతా ఓట్లలో మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీకే దక్కాయి కూడా. మరి ఇప్పుడు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే.. ఆ యువ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడొచ్చు. అయితే.. జనసేన గనుక వేరేగా పోటీ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకమైన అంశం.
పవన్ కల్యాణ్ సోలో బలం 2019 లాగే ఉంటే.. తెలుగుదేశం పార్టీకి పెద్దగా నష్టం లేకపోవచ్చు! పవన్ కు సీమలో రెండు మూడు శాతం ఓటింగ్ దక్కినా.. అది తెలుగుదేశం పార్టీదే అయినప్పటికీ.. ఆ లాస్ తీవ్రమైనది కాదనుకోవాలి. అయితే ప్రతి ఓటూ విలువైనదే అనుకుంటే.. మాత్రం ఆ రెండు మూడు శాతం ఓట్లు కూడా టీడీపీకి ఎంతో కొంత నష్టం చేస్తాయి. జనసేన పొందే ప్రతి ఓటూ టీడీపీ ఖాతాలోంచి తీసుకునేదే అవుతుంది వచ్చే ఎన్నికల్లో. ఒకవేళ పవన్ ప్రభావం మరింత పెరిగితే.. అతడితో పొత్తు లేకపోతే టీడీపీకి మరింత నష్టం చేకూరుస్తుంది.
పవన్ కల్యాణ్ ఎన్నికల నాటికి రాయలసీమలో తన తాహతును ఎంత పెంచుకున్నా.. అది టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు నుంచినే ఓట్లను తీసుకుంటుంది. అయితే పవన్ కల్యాణ్ కు ఎలాగూ అంత ఓపిక కనపడటం లేదు. ఎంతసేపూ ఉభయ గోదావరి జిల్లాల చుట్టూరానే తిరుగుతున్న పవన్ కల్యాణ్.. రాయలసీమకు వచ్చేంత ఓపికతో అయితే లేనట్టుగా ఉన్నాడు!