మేజ‌ర్, విక్రం సూప‌ర్ …అంటే సుంద‌రానికి ఓవ‌ర్‌

ఈ మ‌ధ్య వ‌రుస‌గా మూడు సినిమాలు చూశాను. మేజ‌ర్‌, విక్రం, అంటే సుంద‌రానికి …న‌లుగురికి క‌లిపి మినిమం 5 వేలు ఖ‌ర్చు అయ్యింది. టికెట్ల‌కే 3 వేలు (ఆన్‌లైన్ బుకింగ్‌). క్యాబ్ ఖ‌ర్చులు, పాప్‌కార్న్…

ఈ మ‌ధ్య వ‌రుస‌గా మూడు సినిమాలు చూశాను. మేజ‌ర్‌, విక్రం, అంటే సుంద‌రానికి …న‌లుగురికి క‌లిపి మినిమం 5 వేలు ఖ‌ర్చు అయ్యింది. టికెట్ల‌కే 3 వేలు (ఆన్‌లైన్ బుకింగ్‌). క్యాబ్ ఖ‌ర్చులు, పాప్‌కార్న్ 2 వేలు. మా త‌మ్ముడి కొడుకు పాప్‌కార్న్ కోస‌మే సినిమాకి వ‌స్తాడు (బ‌కెట్ రూ.450. బ‌య‌ట కొంటే వంద‌కి మించ‌వు). స‌రే, పిల్ల‌లుంటే ఇవి కంప‌ల్స‌రీ. మ‌న ద‌ర్శ‌కులు ఫ్యామిలీ సినిమాలు తీయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. తీస్తే పాప్‌కార్న్‌, స‌మోసాల‌కే త‌ల్లిదండ్రులు ఆరిపోతారు.

మామూలుగా నేనొక‌న్నే చూసేవాన్ని, పిల్లాడికి సెల‌వులు కాబ‌ట్టి, వాడి కోసం ఫ్యామిలీ ప్యాక్‌తో చూడాల్సి వ‌చ్చింది. మ‌రి డ‌బ్బులు గిట్టుబాటు అయ్యాయా లేదా అంటే మేజ‌ర్‌, విక్రం న్యాయం చేశాయి. అన్నిటికంటే ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న నానినే ముంచేశాడు. దీనికి కార‌ణం నాని కాదు. కాసేపైనా న‌వ్వుకుంటూ కూచోడానికి ఆయ‌నే కార‌ణం. వివేక్ ఆత్రేయ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో టీవీ సీరియ‌ల్ చూపించాడు.

మేజ‌ర్ అద్భుత‌మైన బ‌యోపిక్‌. ప‌క‌డ్బందీ స్క్రీన్‌ప్లే. అన‌వ‌స‌ర‌మైన సీన్స్ లేకుండా ఎక్క‌డ ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. సెకెండాఫ్‌లో మాత్రం ఒక చోట సీరియ‌స్‌గా టెర్ర‌రిస్టుల‌ని ఫేస్ చేస్తున్నపుడు ప్లోకి ప్లాష్ బ్యాక్ అడ్డు త‌గులుతుంది. అదేం మ‌రీ లోపం కాదు. ఫైన‌ల్‌గా ఒక మంచి సినిమా చూసిన‌ తృప్తితోనే బ‌య‌టికొస్తాం.

విక్రం ఒక మ్యాజిక్‌. చాలా ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్‌హాస‌న్ ఫీనిక్స్‌ ప‌క్షిలా పైకి లేచాడు. ఫాజిల్‌, విజ‌య‌సేతుప‌తిల‌తో క‌లిసి క‌మ‌ల్‌హాస‌న్ ఒక మ్యాజిక్ సృష్టించాడు. దీనికి ద‌ర్శ‌కుడు కూడా చాలా వ‌ర‌కు కార‌ణం.

క్రైంతో ముడిప‌డిన క‌థ‌ని అంత గ్రిప్పింగ్‌గా న‌డ‌ప‌డం మామూలు విష‌యం కాదు. రొటీన్ సెంటిమెంట్స్‌, ఎమోష‌న్స్ ఏమీ లేవు. ఒక‌టే స్పీడ్‌. భ‌విష్య‌త్ అంతా ఇలాంటి స్క్రీన్‌ప్లేల‌దే. దీనికి భిన్నంగా పాప్‌కార్న్ సీన్‌ల‌తో క‌థ చెప్పే ద‌ర్శ‌కులంతా త్వ‌ర‌లోనే షెడ్‌కి చేరుకుంటారు.

అంటే …సుంద‌రానికి తాబేలు అమ్మ మొగుడు. అద్భుత స్క్రీన్‌ప్లే భ్ర‌మ‌లో అప‌స‌వ్య, గంద‌రగోళ సినిమాని తీశాడు. నిజానికి ఇప్పుడు చాందస‌త్వం బ్రాహ్మ‌ణుల్లో నుంచి ఇత‌ర కులాల‌కి వ‌చ్చేసింది. ప్రేమ పెళ్లిళ్ల‌కి బ్రాహ్మ‌ణులే ఎక్కువ ఆమోదిస్తున్నారు. ఇత‌రుల్లోనే స‌మ‌స్య‌లు.

ఎపుడో రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్‌లో (1976) ప్రేమ‌కి మ‌తం అడ్డు ప‌డితే అప్ప‌టి రోజులు అనుకోవ‌చ్చు. ఇపుడు అంత సీన్‌లేదు. సింపుల్‌గా ఇంట్లో చెబితే పోయేదానికి అబ‌ద్ధాలు చెప్పి మూడు గంట‌లు ప్రేక్ష‌కుల తాట తీయ‌డం న్యాయ‌మా?

సుదీర్ఘ‌మైన చైల్డ్ ఎపిసోడ్‌, కాసేపు అనుప‌మ‌, కాసేపు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ల‌తో హీరో క‌థ చెప్ప‌డం, ర‌క‌ర‌కాల మూఢ న‌మ్మ‌కాలు (త‌థాస్తు దేవ‌త‌లు), ప్రేమ‌లో ఉప క‌థ‌లు, హీరోయిన్ అక్క క‌థ ఇలా ఆరు గంట‌లు క‌థ రాసుకుని క‌న్ఫ్యూజ‌న్‌తో మూడు గంట‌లు తీసి, ఎడిట‌ర్ చేతిలో క‌త్తెర లాక్కొని అల్మారాలో దాచేసి జ‌నం స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు వివేక్ ఆత్రేయ‌. క‌రోనాలో రోజుల త‌ర‌బ‌డి ఇళ్ల‌లో కూచున్న వాళ్లు, మూడు గంట‌లు థియేట‌ర్‌లో కూర్చోలేరా  అనుకున్నాడేమో?

కామెడీని హ్యాండిల్ చేయ‌డం క‌ష్టం. కేవ‌లం నాని న‌ట‌న‌, టైమింగ్‌తో కాసేపు షో న‌డిచింది. విష‌యం లేక‌పోతే హీరో మాత్రం ఏం చేస్తాడు? క‌థ‌ల సెల‌క్ష‌న్‌లో త‌ప్ప‌ట‌డుగులు వేసినంత కాలం నాని గ్రాఫ్ ప‌డిపోతూనే వుంటుంది.

హీరోలు, ద‌ర్శ‌కుల‌కి అర్థం కావాల్సింది ఏమంటే స్పీడ్ స్క్రీన్ ప్లే, కొత్త నేరేష‌న్ ప్రాక్టీస్ చేయ‌కుండా సోది క‌థ‌లు చెబితే జ‌నం ఇక థియేట‌ర్ల‌కి రారు. క‌రోనాలో అంద‌రూ పెద్ద టీవీలు కొని, థియేట‌ర్‌ని ఇంట్లోనే ఎవ‌రి స్థాయికి త‌గిన‌ట్టు వాళ్లు పెట్టుకున్నారు. OTTలో చూద్దామ‌నే మూడ్‌లో వున్నారు. టికెట్లు, పెట్రోల్‌, పిల్ల‌లుంటే చిరుతిండ్ల ఖ‌ర్చు మినిమం వెయ్యి దాటితే, ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల కాలంలో మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు అస‌లు రారు. 

కేవ‌లం సినిమా పిచ్చోళ్లు, అభిమానుల‌తో శుక్ర‌, శ‌ని, ఆదివారాలు న‌డిపించి సోమ‌వారం నుంచి ఈగ‌లు తోలు కావాల్సిందే. ప‌రిస్థితి ఇదే కొన‌సాగితే వ‌చ్చే ఏడాదిక‌ల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం 20 శాతం థియేట‌ర్‌లు మూత‌ప‌డ‌తాయ‌ని అంచ‌నా.

జీఆర్ మ‌హ‌ర్షి