సినిమాలు చేసే కొద్దీ సీనియారిటీ పెరుగుతుంది. అనుభవం వస్తుంది. మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్క హీరోల వరకే. హీరోయిన్ల విషయానికొచ్చేసరికి సినిమాలు చేసే కొద్దీ సీనియారిటీ పెరుగుతుంది. క్రేజ్ తగ్గుతుంది. ఫ్లాపులు వెక్కిరిస్తాయి. 2018లో ఈ విషయాన్ని ఏకంగా ముగ్గురు భామలు నిజంచేసి చూపించారు.
కాజల్.. ఈ ముద్దుగుమ్మ ప్రస్థానం గురించి చెప్పాలంటే పుష్కరం వెనక్కి వెళ్లాలి. మగధీరతో స్టార్ అయిన కాజల్, ప్రతి ఏటా హిట్స్ కొడుతూనే ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆమె ఫ్లాప్ హీరోయిన్. తెలుగులో ఆమె చేసిన అ!, ఎమ్మెల్యే, కవచం సినిమాలు మూడూ ఫ్లాప్ అయ్యాయి.
కాజల్ బాటలోనే బోలెడంత సీనియారిటీ పెట్టుకొని ఫ్లాపులిచ్చిన మరో భామ తమన్న. ఈమె కూడా కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లు దాటింది. ఆ సీనియారిటీ ఈ ఏడాది పనికిరాలేదు. తెలుగులో మిల్కీబ్యూటీ చేసిన నా నువ్వే, నెక్ట్స్ ఏంటి సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి.
మరో సీనియర్ ఇలియానాది కూడా ఇదే పరిస్థితి. అమర్ అక్బర్ ఆంటోనీతో రీఎంట్రీ ఇచ్చి మరోసారి చక్రం తిప్పుదామనుకుంది ఇలియానా. కానీ గోవాబ్యూటీకి రవితేజ-శ్రీనువైట్ల కలిసి ఆ ఛాన్స్ లేకుండా చేశారు. ఈ సినిమా దెబ్బతో తెలుగులో ఇప్పటివరకు మరో సినిమా అంగీకరించలేదు ఇల్లీ బేబీ.
సీనియర్ హీరోయిన్లలో ఈ ఏడాది అనుష్క మాత్రమే టాలీవుడ్ లో క్లిక్ అయింది. ఆమె చేసిన భాగమతి సినిమా హిట్ అయింది. ఈమెను మినహాయిస్తే మిగతా సీనియర్ హీరోయిన్లంతా ఫెయిల్ అయ్యారు. అటు తమిళనాట మాత్రం త్రిష, నయనతార తమ సత్తాచాటారు. వయసు, సీనియారిటీ పెరిగినా క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు.