కరోనా మహమ్మారి చంపుతున్నది మనుషులను మాత్రమేనా? అంటే, అంతకు మించి అని చెప్పక తప్పదు. ఆ అంతకు మించిందే మానవత్వం. కోవిడ్ విలయతాండవంలో బంధాలు, అనుబంధాలు కొట్టుకుపోతున్నాయి. చావు భయం ముందు, మరే బంధం బలమైంది కాదని నిరూపించింది. ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు తనువు చాలించక తప్పదు.
ఇందుకు మనుషులు మినహాయింపేమి కాదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని శాశ్వతంగా వీడాల్సిన వాళ్లమే. మొన్న మన స్నేహితుడు, నిన్న బావోబామ్మర్దో, నేడు ఇంకొకరు…రేపు మన వంతు. ముందూ వెనుకా తేడా అంతే తప్ప, పైకి పోవడం పక్కా. నేరస్తుడికి ఉరిశిక్ష విధించే ముందు “నీ చివరి కోరిక ఏంటి?” అని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే చివరి కోరిక తీర్చడం మానవత్వం కనుక.
అయితే కరోనా మహమ్మారి మాత్రం అలాంటి మానవత్వాన్ని దరి చేరనీయడం లేదు. కానీ కరోనా కాలంలో తాను అంతిమ దశలో ఉన్న ప్రతి మనిషి కోరుకునే చిట్ట “చివరి” కోరిక …తాను గౌరవంగా చావాలని. అలాగే గౌరవంగా అంతిమ సంస్కారానికి నోచుకోవాలని. ఆస్తులు అంతస్తులతో సంబంధం లేకుండా ప్రతి మనిషి కరోనా కాలంలో కోరుకుంటున్నది ఇదే. ఎందుకంటే తమ కళ్లెదుటే అంతిమ సంస్కారానికి నోచుకోని శవాల గురించి కథలుకథలుగా వింటుండం వల్ల, తనకు ఆ దుర్గతి పట్టకూడదని ప్రతి ఒక్కరూ మనసులో కోరుకుంటారు.
అయినప్పటికీ కరోనా మహమ్మారి ఓ అంటురోగం కావడంతో ఎంతటి ఆత్మీయ బంధమున్నా… అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. అంత వరకూ ధర్మం, న్యాయం, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు అంటూ సూక్తులు వల్లించిన ఆదర్శమూర్తులు కూడా తమ వరకూ వస్తే కరోనాతో తనువు చాలించిన రక్త సంబంధీకులకు తుది వీడ్కోలు పలకడంలో మాత్రం వెనుకంజ వేయడం కరోనా మిగిల్చిన అత్యంత విషాదంగా చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి రుయాలో ఆదరణకు నోచుకోని ఏడు అనాథ మృతదేహాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇటీవలే కొందరు ముస్లిం సోదరులతో కలిసి 21 అనాథ మృత దేహాలకు ఎమ్మెల్యే భూమన సారథ్యంలో తుది వీడ్కోలు పలికి ప్రధాని కార్యాలయం నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే కోణంలో మానవత్వాన్ని ప్రదర్శించారని సంతోషించాలా? లేక రక్త సంబంధీకులే పట్టించుకోలేని అమాన వీయ వ్యవస్థలో బతుకుతున్నామని ఆవేదన చెందాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనాతో చనిపోయారనే కారణంతో కుటుంబ సభ్యులు శవాలను ఆస్పత్రుల్లోనే వదిలేసి వెళ్లడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మన వరకూ వస్తే అని ఒక్క క్షణం మనిషి ఆలోచిస్తే… ఇలాంటి దుస్థితి తలెత్తే అవకాశం రాదని ఆయన అన్నారు.
కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించడం వల్ల మనం దాని బారిన పడమని, ఈ సందేశాన్ని, సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఇక మీదట ఏ ఒక్కరూ మృతదేహాలను ఏ దిక్కూ లేనివిగా పడేసి వెళ్లొద్దని ఆయన కోరారు. అనంతరం ఆయన ఏడుగురి మృత దేహాలను సంప్రదాయ బద్దంగా శ్మశాన వాటికకు తరలించి చితి వెలిగించారు. ఆ చితిలో ఒక వైపు అనాథలకు తుది వీడ్కోలు పలికిన మానవీయ వెలుగులు, మరోవైపు కాలుతున్న మానవత్వపు తాలూకు మంటలు కనిపించాయి.