దేశంలో యాక్టివ్ కరోనా కేసుల విషయంలో చాన్నాళ్లకు మహారాష్ట్ర కు ఊరట లభించింది. తొలి దశ కరోనా విజృంభణ నుంచి మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది మహారాష్ట్ర. రెండో వేవ్ కు అయితే మహారాష్ట్రనే కేంద్రంగా నిలిచింది.
మహారాష్ట్రలో విజృంభించిన రెండో వేవ్ కరోనా ఆ తర్వాత దేశమంతా అల్లుకుపోయింది. అయితే ఆ రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా కేసుల సంఖ్య కాస్తంటే కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలుస్తోంది.
ఇక ప్రస్తుతం దేశంలో భారీగా కరోనా కేసుల సంఖ్యను కలిగిన రాష్ట్రంగా నిలుస్తోంది కర్ణాటక. గత కొన్నాళ్లుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. ఇప్పటికే ఆంక్షలు, లాక్ డౌన్ పెట్టినా అక్కడ ఇంకా కరోనా కట్టడి కాలేదు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న నగరంగా బెంగళూరు, యాక్టివ్ కరోనా కేసుల విషయంలో దేశంలోనే తొలి స్థానంలో కర్ణాటక నిలుస్తున్నాయి.
ప్రస్తుతం కర్ణాటకలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య అధికారికంగానే 5.90 లక్షల వరకూ ఉంది. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 5.48లక్షలుగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 12 వేల వరకూ తగ్గింది. ఇక 4.33 లక్షల యాక్టివ్ కేసులతో కేరళ మూడో స్థానంలో ఉంది. ఇలా ఈ మూడు రాష్ట్రాలే మొత్తం యాక్టివ్ కేసుల్లో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్నాయి.