మొత్తానికి గీతాఆర్ట్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమ బ్యానర్ పైనే పరశురాం తన నెక్ట్స్ సినిమా చేస్తాడంటూ గీతా ఆఫీస్ నిన్న అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయ్యేలా కనిపించడం లేదు. పరశురాం నెక్ట్స్ సినిమాలో హీరో ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
గీతాఆర్ట్స్ లో సినిమా అంటే కామన్ గా మెగా హీరో ఉంటాడు. సో.. కుదిరితే బన్నీ, కుదరకపోతే మరో మెగా హీరోతో పరశురాం సినిమా ఉంటుంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది అనుకోవచ్చు. సరిగ్గా ఇక్కడే అల్లు అరవింద్ మెలిక పెట్టాడు. గీతాఆర్ట్స్ లో మెగా హీరోనే ఎందుకు? బయట హీరోలు కూడా ఉండొచ్చు కదా అంటూ ఫీలర్ వదిలాడు.
మహేష్ బాబు, నాని, నాగచైతన్య లాంటి హీరోలతో ఇప్పటికే చర్చలు షురూ చేసింది గీతా. ఆమధ్య గీతాఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా ఓ సినిమా ఉండొచ్చంటూ కథనాలు కూడా వచ్చాయి. సో.. ఇప్పుడు పరశురాంకు ఆప్షన్లు పెరిగాయి. కేవలం బన్నీకో లేక అల్లుశిరీష్ కో కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మంచి కథ రాసుకుంటే ఏ హీరోతోనైనా సినిమా చేయొచ్చు.
ప్రస్తుతానికైతే పుకార్లన్నీ బన్నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. అతడి దృష్టి మొత్తం త్రివిక్రమ్ సినిమాపైనే ఉంది. త్రివిక్రమ్ తో సినిమా చేసిన తర్వాతే బన్నీ మరో ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడు. ఈలోగా పరశురాంకు కూడా స్టోరీ రెడీ చేయడానికి మరో 6 నెలలు పడుతుంది. అప్పుడు ఏ హీరో అందుబాటులో ఉంటాడో చూడాలి.