అవును, ఆయ‌నే చెప్పారు

రాజ‌కీయాల్లో మాట సాయం మామూలే. ఫ‌లానా వాడు మా వాడు ప‌ని చేసి పెట్టండి అని కిందిస్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కూ చెబుతారు. మ‌న‌వాళ్ల‌కి కూడా చేయ‌లేక‌పోతే ప‌ద‌వులెందుకు? చంద్ర‌బాబు బ్రీప్‌డ్ మి అని…

రాజ‌కీయాల్లో మాట సాయం మామూలే. ఫ‌లానా వాడు మా వాడు ప‌ని చేసి పెట్టండి అని కిందిస్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కూ చెబుతారు. మ‌న‌వాళ్ల‌కి కూడా చేయ‌లేక‌పోతే ప‌ద‌వులెందుకు? చంద్ర‌బాబు బ్రీప్‌డ్ మి అని దొరికిపోయాడు కానీ, మోదీ తెలివైన వాడు. దొర‌క‌డు.

విష‌యం ఏమంటే శ్రీ‌లంక‌లో మ‌న్నార్ జిల్లా వుంది. అక్క‌డ అతి పెద్ద గాలిమ‌ర‌ల విద్యుత్ ప్రాజెక్టుని అదానీ గ్రూప్ వ‌శం చేసేందుకు మోదీ ఒత్తిడి తెచ్చాడు. ఈ మాట చెప్పింది ఎవ‌రో కాదు సిలోన్ ఎల‌క్ట్రిసిటీ బోర్డు చైర్మ‌న్ పెర్డినాండో. వెంట‌నే ఏదో ప్లోలో అన్నాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుని రాజీనామా చేశాడు. కాంట్రాక్టుల్లో ప‌క్ష‌పాతం లేద‌ని శ్రీ‌లంక అధ్య‌క్ష కార్యాల‌యం చెప్పింది. అయితే మోదీ కానీ, అదానీ కానీ కిమ్మ‌న‌లేదు.

అదానీ కూడా ఒక ర‌కంగా ప్ర‌భుత్వ సంస్థే. ఎందుకంటే ప్ర‌భుత్వాన్ని అది న‌డిపిస్తోందో, ప్ర‌భుత్వ‌మే అదానీని న‌డిపిస్తోందో కూడా తెలియ‌నంత బంధం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో స‌హా అన్ని రాష్ట్రాల్లో అదానీ కాలు పెట్టింది. ఏ దేశంలోనైనా కార్పొరేట్లు బాగుంటేనే ప్ర‌భుత్వాలు బాగుండేది.

ఇంకో విష‌యం ఏమంటే గాలి మ‌ర‌ల ప్రాజెక్టుల కంటే ముందే కొలంబో పోర్టులో పెద్ద ట‌ర్మిన‌ల్ అదానీ చేతిలోకి వెళ్లింది. పేద దేశంగా మారిన శ్రీ‌లంక‌కి భార‌త్ సాయం వెనుక ఇలా చాలా విష‌యాలు వుంటాయి.

అస‌లు ఇదంతా అమెరికా స్టైల్‌. పేద దేశాల‌కి సాయం చేయ‌డం, త‌ర్వాత వ్యాపారాలు స్టార్ట్ చేయ‌డం, మెల్లిగా సైనిక స్థావ‌రాన్ని ఏర్పాటు చేసి ఆ దేశ అధ్య‌క్షుల్ని మార్చ‌డం చేస్తుంది. మ‌న‌కి ఇంకా అంత తెలివి లేదు గానీ, ప్ర‌స్తుతం వ్యాపారాల‌ ద‌గ్గ‌రే ఆగింది.

శ్రీ‌లంక సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్ర‌పంచ మీడియాలో పెద్ద‌గా వార్త‌లు రావ‌డం లేదు. ఎందుకంటే ఎపుడు ఏది హైలైట్ చేయాలో నిర్ణ‌యించే శ‌క్తులు వేరే వుంటాయి. జ‌ర్న‌లిస్టులు, పాఠ‌కులు కేవ‌లం నిమిత్త మాత్రులు.