తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయోగించిన హనీట్రాప్‌లో మేధావి, విద్యావంతుడు, పండితుడైన సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శ చేశారు.
జాతీయ పార్టీ పెట్టాలని కసరత్తు చేస్తున్న కేసీఆర్ పలువురు ప్రముఖులతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లితో కేసీఆర్ లంచ్ భేటీ అయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది.
భేటీ అనంతరం కేసీఆర్ విజన్‌పై ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. మోదీని ఎదుర్కోడానికి అన్ని రకాల తెలివితేటలు, ఆకట్టుకునే నేర్పరితనం కేసీఆర్‌లో ఉన్నట్టు ఉండవల్లి చెప్పారు. కేసీఆర్‌ను ఉండవల్లి ప్రశంసించడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఇవాళ ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉండవల్లిపై గౌరవాన్ని చాటుతూనే విమర్శలు గుప్పించడం విశేషం.
అప్పుడప్పుడు మిలటరీ అధికారులు హనీట్రాప్‌లో పడుతూ, దేశ రహస్యాలను శత్రు దేశాలకు అందిస్తుంటారని మీడియాలో చూస్తుంటామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ రీతిలోనే కేసీఆర్ ప్రయోగించిన హనీట్రాప్‌లో ఉండవల్లి పడ్డట్టున్నారని వ్యంగ్యంగా అన్నారు. మేధావి, చదువుకున్నోడు, మంచి పండితుడైన ఉండవల్లి సమైక్య రాష్ట్రం కోసం పోరాడినా, ఆయన పై గౌరవం ఉందన్నారు. ఏం చూసి కేసీఆర్ దగ్గరికి పోయారో, తలుపులు మూసి ఉండవల్లికి ఏం పెట్టారో అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్‌తో భేటీ తర్వాత బయటికి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ భజన చేస్తున్నారని విమర్శించారు. ఇది భావ్యమా… పెద్దలు ఉండవల్లి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు వ్యతిరేకించినా మీ పట్ల ప్రజలు ఎప్పుడూ గౌరవంగా ఉన్నారని ఉండవల్లిని ఉద్దేశించి అన్నారు. కేసీఆర్‌ను కలవడం ద్వారా తెలంగాణ ప్రజల్ని అవమానించారన్నారు.
తెలంగాణ సమాజం ఒక రావణాసుడిలా చూస్తున్న కేసీఆర్ పంచన మీరు చేరి, మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ పని చేసే నాయకుడని కీర్తించడం ఏంటని నిలదీశారు.