సహజంగా పోలీసులంటే జనంలో ఓ రకమైన భయం ఉంది. ప్రధానంగా ప్రజలపై వాళ్లు ఉపయోగించే భాషే అభ్యంతరకరంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన బాధితులతో వాళ్లు మాట్లాడే సంస్కృత భాషే సగం భయపెడుతుంది.
జనాన్ని బెదరగొట్టడం తమ ‘వృత్తి’ హక్కు అని పోలీసులు బలంగా నమ్మే సిద్ధాంతం. అందుకే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాలంటే సామాన్యులు భయపడుతారు. ఇక పోలీస్‌స్టేషన్ గడప తొక్కే మహిళలంటే పోలీసుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
బహుశా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళలపై పట్ల తమ సిబ్బంది ఎంత ‘మర్యాద’గా వ్యవహరిస్తారో బాగా తెలిసిన డీజీపీ గౌతమ్‌సవాంగ్ సున్నితంగా హితవు పలికాడు. స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల పోలీసుల మనస్తత్వంలో మార్పు రావాలని ఆయన కోరాడు.
అంతేకాదండోయ్, ప్రతి ఒక్కరినీ అమ్మా, తల్లీ, చెల్లీ, మీరు అంటూ పలకరిస్తూ… సమస్య ఏమిటో ఓపిగ్గా విని తెలుసుకుని పరిష్కరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఏపీలోని 967 పోలీసు స్టేషన్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ 16 పోలీసు స్టేషన్ల నుంచి సిబ్బంది కుటుంబ సభ్యులు, మహిళా మిత్రలు, గ్రామ మహిళా రక్షణ కార్యదర్శులతో డీజీపీ మాట కలిపాడు.
2020వ సంవత్సరాన్ని వుమెన్ ఫ్రెండ్లీ ఏడాదిగా ప్రకటించిన సవాంగ్ పోలీసు కుటుంబాలకు చెందిన మహిళలు పోలీసు స్టేషన్లోకి అడుగుపెట్టిన ఈ రోజే వుమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శుభప్రదమైన అడుగు పడిందన్నాడు.
మహిళలు స్టేషన్‌కు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్క మహిళతోనూ అగౌవరవంగా మాట్లాడటానికి వీల్లేదని ఆయన హెచ్చరించాడు. మరి పోలీస్ బాస్ గౌతమ్ నోట వచ్చిన బుద్ధుడి లాంటి మాటలు కాఠిన్యానికి పర్యాయపదమైన పోలీసుల చెవికెక్కుతాయా?