ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగా అందుబాటులో ఉండడానికి, రాజధాని రూపేణా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు వికేంద్రీకరణ మంత్రాన్ని పఠిస్తున్న సంగతి తెలిసిందే.
కులపరమైన ఆర్థిక ప్రయోజనాలను ప్రాధాన్యంగా ఎంచుకొని రాష్ట్రంలో ఒకే ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలనుకున్న తెలుగుదేశం కుట్రలకు తిలోదకాలు ఇస్తూ.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసం సర్కారు ఈ ప్రతిపాదన తెచ్చింది.
హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడం, సుప్రీంకోర్టులో చేసిన అప్పిలు ఇంకా తేలకపోవడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ సత్సంకల్పం పెండింగ్లోనే ఉంది. అయితే తొలినుంచి ఇప్పటిదాకా ఇదిగో రాజధాని అదిగో రాజధాని అంటూ.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వచ్చేస్తున్నది వచ్చేస్తున్నది అంటూ.. వైసీపీ నాయకులు పదేపదే ప్రకటించడం ద్వారా ప్రజలలో చులకన అవుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జి అయిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే పరిపాలన రాజధాని విశాఖకు వస్తుందని వెల్లడించారు.
వై వి సుబ్బారెడ్డి ఈ తరహా ప్రకటన చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఈ మాట అన్నారు. తొందరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని విశాఖపట్నానికి మారుస్తారని కూడా ఇవాళ చెప్పారు. వైసీపీ నాయకులందరూ కూడా పదేపదే త్వరలో రాజధాని వచ్చేస్తుందనే మాట అంటున్నారు.
నిజానికి పరిపాలన రాజధాని విశాఖకు తరలివస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి విషయంలో అద్భుతమే అని చెప్పాలి. విశాఖపట్నం అనేది దక్షిణ భారతదేశపు ముంబాయి లాగా పేరు తెచ్చుకోగలదని కూడా వైవి సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే రాజధాని ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా విశాఖపట్నం రాకపోవడానికి గల కారణాలు కూడా వైవి మాటల్లోనే బయటకు వచ్చాయి. న్యాయపరమైన చిక్కుల కారణంగా కొంత జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తుది తీర్పు వస్తే తప్ప విశాఖకు రాజధాని మరలే అవకాశం లేదు గాక లేదు. ఆ వాస్తవాన్ని దాచిపెట్టి వైసిపి నాయకులు పదేపదే ఎందుకు ఆ ప్రాంత ప్రజలు ప్రజలను ఊరించేలా మాట్లాడుతుంటారో అర్థం కాని సంగతి.
ఇలా అనేకమార్లు చెప్పడం వలన రాజధాని తక్షణమే తరలి రాకపోతే విశాఖ వాసులు అధికార పార్టీ మీద అసంతృప్తికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు తొలగగానే తక్షణం విశాఖకు వచ్చేస్తాం అని చెబితే సరిపోయే దానికి వైసీపీ నాయకులు ఎందుకు ఇలా డెడ్లైన్లు ప్రకటిస్తూ మాటలు చెబుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు!