అడుసు తొక్క నేల.. కాలు కడగనేల? అనేది పాచిపోయిన సామెత! తప్పు చేయనేల.. దిద్దుకునేందుకు పాట్లు పడనేల? అనేది వర్తమానంలో నడుస్తున్న సామెత! అదే ప్రింట్ మీడియా విషయానికి వస్తే ‘అబద్ధపు వార్తలు వేయనేల? దొంగ పని దొరికిపోయి వాటికి సవరణలు ప్రచురించనేల?’ అనేది ఆధునిక నీతి!!
దిగజారుడు జర్నలిజంలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న ఈనాడు దినపత్రిక ఈ నీతిని నిత్యం పాటిస్తూనే ఉంటుంది. అబద్ధపు ప్రచారాలకు తెగబడుతూనే ఉంటుంది. దొరికితే దొంగ.. దొరికేదాకా తాము చేస్తున్న అబద్ధపు ప్రచారం మొత్తం దొరతనమే కదా అనే తీరులో ఈనాడు చెలరేగిపోతూ ఉంటుంది. తాజాగా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లు వద్ద తెలుగుదేశం గుండాలు చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో చేసిన దాడులు, దుర్మార్గాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు ప్రచురించిన ఈనాడు దుర్బుద్ధి బయటకు వచ్చింది.
అంగళ్లు వద్ద జరిగిన దుర్ఘటనలో తెలుగుదేశం గుండాలు రెచ్చిపోయి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద, ఏకంగా పోలీసుల మీద కూడా దాడికి తెగించారు. చంద్రబాబు కాన్వాయ్ లో వచ్చే సమయంలోనే రాళ్లు దుడ్డు కర్రలు తమ వాహనాలతో పాటు తీసుకువచ్చి వాటిని విసిరి తమ ప్రత్యర్థులందరినీ గాయపరిచారు. వీళ్ళ దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడటం జరిగింది. అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. పోలీసుల, వైసిపి వారి ప్రతిఘటనలో కొందరు తెలుగుదేశం వారికి కూడా గాయాలయ్యాయి.
ఈ మొత్తం ఎపిసోడ్లలో కేవలం తెలుగుదేశం కార్యకర్తల మీద మాత్రమే దాడి జరిగినట్టుగా ప్రచారం చేస్తూ మసిపూసి మారేడు కాయ చేయడానికి ఈనాడు దినపత్రిక సహజంగానే ప్రయత్నించింది. గాయపడిన వారి ఫోటోలను పరిశీలించి వైసిపి గుండాలు వారిని కొట్టేసారంటూ మొసలి కన్నీరు కార్చింది. అయితే దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించిన ఒక ఫోటో వారి దుర్బుద్ధిని నగ్నంగా ప్రజల ముందు నిలబెడుతున్నది. ఆ ఫోటోలో తెలుగుదేశం వారి రాళ్ల దాడిలో గాయపడిన ఒక వైసీపీ కార్యకర్త తల పగిలి నిద్దరోడుతున్నారు! ఆయన ఫోటోను ప్రచురించి ‘తెలుగుదేశం కార్యకర్త’ అని రాసేయడం ఈనాడుకు మాత్రమే చెల్లుబాటు అయిన విద్య!
తెల్లారాక దినపత్రికలో ఇలాంటి ప్రచారం చూసుకొని నివ్వెరపోయిన సదరు వైసీపీ కార్యకర్త, మీడియా ముందుకు వచ్చి ఈనాడు దుర్బుద్ధిని ఎండగట్టారు! తన ఫోటో ప్రచురించి తెలుగుదేశం కార్యకర్త అని రాయడం నీచమైన చర్యగా నిందించారు. తాను వ్యవసాయం చేసుకుంటూ తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రమే ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈనాడు మరొకసారి తమ తప్పుడు కథనాలకు సంజాయిషీ చెప్పుకోవలసిన, క్షమాపణ అడగాల్సిన పరిస్థితి దాపురించింది!
ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం వైసిపి మీద బురద చల్లడానికి కట్టుకథలు అల్లడం ఈనాడుకు కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధి పట్టాభి విషయంలో కూడా ఇలాంటి తప్పుడు ఫోటోలను ప్రచురించారు. ఆయనను పోలీసులు ఎలాంటి హింసకు గురి చేయకపోయినా సరే, ఆయన కాళ్లు మొత్తం వాచిపోయినట్లుగా పోలీసులు కొట్టినట్టుగా పాత ఫోటోలు ప్రచురించి కొత్తగా అవన్నీ జరిగినట్టుగా ప్రచారం చేయడానికి ఈనాడు నిస్సిగ్గుగా ప్రయత్నం చేసింది.
అయితే వెంటనే ఆ దుర్బుద్ధిని అందరూ ఎండగట్టడంతో మరురోజు ఈనాడు సుదీర్ఘమైన సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్ కు ముడిపెట్టి ఇద్దరు ఉద్యోగులను కూడా సంస్థ తొలగించింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తకి తెలుగుదేశం రంగు పులిమి చేస్తున్న ఈ దుష్ప్రచారానికి ఎవరిని నిందించాలి? తప్పు తమ యాజమాన్యం వైఖరిలో లేదు అని చెప్పుకోవడం కోసం మళ్లీ ఎవరో కొందరు ఉద్యోగులను బలి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు!