అయినవారికి కూడా అదేరూలు వర్తిస్తుందా?

నేరమయ రాజకీయాలను అరికట్టే లక్ష్యంతో తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ప్రజాప్రతినిధులకు క్రిమినల్ కేసుల్లో కనీసం రెండేళ్ల జైలుశిక్ష పడితే గనుక.. వారి పదవి తక్షణం రద్దవుతుంది. ఆ శిక్ష పడిన నాటినుంచి మరో ఆరేళ్లపాటు…

నేరమయ రాజకీయాలను అరికట్టే లక్ష్యంతో తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ప్రజాప్రతినిధులకు క్రిమినల్ కేసుల్లో కనీసం రెండేళ్ల జైలుశిక్ష పడితే గనుక.. వారి పదవి తక్షణం రద్దవుతుంది. ఆ శిక్ష పడిన నాటినుంచి మరో ఆరేళ్లపాటు వారు ఎన్నికల్లో పోటీచేయడానికి గల అర్హతను కూడా కోల్పోతారు. 

నిజానికి నాయకుల్లో నేరప్రవృత్తిని అరికట్టడానికి.. ఈ తరహాలో ఏదో ఒక చట్టం, ఏర్పాటు ఉండడం మంచిదే. కానీ ఆ చట్టాన్ని అమలు చేసే విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతిపక్షాలకు చెందిన వారి మీద ఈ చట్టాన్ని ప్రయోగించి.. వారిని అనర్హులను చేయడంలో మహా దూకుడు ప్రదర్శించే ప్రభుత్వం.. తమ పార్టీ వారి విషయంలో కూడా అదే దూకుడును కనబరుస్తుందా? లేదా, వారు అప్పీలుకు వెళ్లి స్టే తెచ్చుకునేదాకా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటుందా? అనేది ఇప్పుడు తేలనుంది.

ఎందుకంటే- యూపీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఇతావా ఎంపీ రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సదరు కటారియా గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2011లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న కాలంలో.. ఆగ్రా ఎంపీగా ఉన్న రాంశంకర్ కటారియా విద్యుత్తు సరఫరా కంపెనీ మేనేజరు మీద తన అనుచరులతో కలిసి దాడిచేశారని ఆయన మీద కేసు నమోదు అయింది. పన్నెండేళ్ల కిందట దాడి కేసును విచారించిన ఆగ్రా కోర్టు తాజాగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు, యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఆ తీర్పు మీద అప్పీలుకు వెళ్లడానికి ఆయనకు అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ చర్చనీయాంశం అవుతున్న సంగతి ఏంటంటే.. ఈ కటారియా ఎంపీ పదవిని రద్దు చేస్తూ లోక్ సభ స్పీకరు తక్షణం ఉత్తర్వులు జారీచేస్తారా? లేదా? అనేది! ఎందుకంటే.. రెండేళ్లకు తగ్గకుండా క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన పక్షంలో.. శిక్ష పడ్డ రోజునుంచి ప్రజాప్రతినిధిగా అనర్హుడు అవుతారు. 

మోడీ అనే ఇంటిపేరు గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు పార్లమెంటు చాలా వేగంగా స్పందించింది. మార్చి 23న రాహుల్ కు జైలు శిక్ష విధించగా.. అదే రోజునుంచి ఆయన ఎంపీ పదవి రద్దవుతున్నదని పేర్కొంటూ మార్చి 24న లోక్ సభ స్పీకరు ఓం బిర్లా ఉత్తర్వులు జారీచేశారు. వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల సంఘానికి సమాచారం కూడా పంపేశారు. రాహుల్ ను తన అధికారిక ఎంపీ క్వార్టర్ నుంచి కూడా ఖాళీ చేయించి పంపేశారు. తీరా ఇప్పుడు రాహుల్ కు పడిన శిక్ష మీద సుప్రీం కోర్టు స్టే విధించి, ఆయన ఎంపీ పదవిలో కొనసాగవచ్చునని చెప్పింది.

రాహుల్ విషయంలో ఇంత వేగంగా వ్యవహరించిన స్పీకరు ఓంబిర్లా.. బిజెపి ఎంపీ కటారియా విషయంలో అదే తీరుగా స్పందించగలరా? లేదా, తమ సొంత పార్టీ వాళ్లు గనుక.. వారు స్టే తెచ్చుకునేదాకా వేచిచూసి.. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది వేచిచూడాలి. బిజెపి సర్కారు తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే.. ఆగస్టు 5వ తేదీనుంచి కటారియా ఎంపీ పదవి రద్దయినట్టుగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు.