ఎమ్బీయస్‌ : గ్రద్ద దేనికి సంకేతం?

పివిఆర్‌కె ప్రసాద్‌ గారి ‘నాహం కర్తా…’ కథనానికి బాపుగారు గరుత్మంతుడు పెద్ద దుంగను పట్టుకొస్తున్నట్లు బొమ్మ వేశారని రాశాను కదా. ఆ సందర్భంగా ఆ బొమ్మను మళ్లీ ఒకసారి చూస్తూ ఉంటే నాకు అనిపించింది-…

పివిఆర్‌కె ప్రసాద్‌ గారి ‘నాహం కర్తా…’ కథనానికి బాపుగారు గరుత్మంతుడు పెద్ద దుంగను పట్టుకొస్తున్నట్లు బొమ్మ వేశారని రాశాను కదా. ఆ సందర్భంగా ఆ బొమ్మను మళ్లీ ఒకసారి చూస్తూ ఉంటే నాకు అనిపించింది- మనకు హిందూ పురాణాలు తెలుసు కాబట్టి విష్ణువు వాహనమైన గరుడుడు, విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి సేవ చేస్తున్నాడు అని గ్రహించాం, ఆ గాథ తెలియనివాడు దాన్ని చూసి ఏమనుకుంటాడా అని! గ్రద్ద అమెరికా చిహ్నంపై ఉంది కాబట్టి, అమెరికా వాళ్లు తిరుపతి గుడికి దుంగలు పంపించారా? అనే సందేహం వస్తుందేమో! అసలు వాళ్లెందుకు గ్రద్దను ఎంచుకున్నారు? అది దేనికి సంకేతం? అని ఆసక్తి కలిగి పుస్తకాలు తిరగేస్తే చాలా విషయాలు తెలిశాయి.

గరుడుణ్ని త్యాగరాజస్వామి ‘ఖగరాజు’ అన్నట్లే యితర దేశాల్లో కూడా గ్రద్దను పక్షులకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడి కళ్లలోకి కళ్లు పెట్టి చూడగల సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. సిరియాలోని పామైరా ప్రాంతంలో గ్రద్దను సూర్యదేవుడికి సంబంధించిన పక్షిగా అనుకునేవారు. ఫీనిక్స్‌ లాగ అది చితి నుంచి పునరుజ్జీవనం పొందగలదని వారి నమ్మకం. గోథిక్‌ కట్టడాల్లో కిటికీ అద్దాలపై గ్రద్ద రెక్కలు యింకా రాని తన పిల్లలను ఆకాశానికి తీసుకెళ్లి సూర్యుడి వంక తేరిపార చూడడం నేర్పించినట్లు చిత్రీకరిస్తారు. పాములను అధోజగత్తుకు, చీకటి ప్రపంచానికి ప్రతీకలుగా చూస్తారు కాబట్టి పామును సంహరించే గ్రద్దకు గౌరవం హెచ్చు. ధర్మవిజయానికి గుర్తుగా పామును నోటిన కరుచుకున్న గ్రద్దను అజ్‌టెక్‌ నాగరికత కాలం నుంచి మెక్సికో జాతీయ చిహ్నంగా వాడుతున్నారు.

మనుష్యులు చేరలేని స్వర్గానికి కూడాగ్రద్ద సులభంగా వెళ్లి రాగలదని విశ్వసిస్తారు. తను వెళ్లడమే కాదు, పుణ్యాత్ములను తీసుకెళ్లగదని కూడా అనుకుంటారు. బాబిలోనియా ప్రాచీన పుస్తకాల్లో ఈటానా రాజుని ఒక గ్రద్దే స్వర్గానికి తీసుకెళ్లిందని ఉందిట. ఆ కాంలో ఎవరైనా రాజు చనిపోతే అంత్యక్రియ సమయంలో ఒక గ్రద్దను విడిచిపెట్టేవారట. అది ఆ వ్యక్తి ఆత్మను స్వర్గానికి తీసుకెళుతుందని నమ్మకం. ఈజిప్టులో పురాతనకాలంలో కూడా గ్రద్దను రాజచిహ్నంగా వాడారు. ఇప్పటికీ ఎయిర్‌ ఫోర్స్‌ వాళ్లు ఆ చిహ్నాన్ని వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వెలసిల్లిన అన్ని నాగరికతల్లో జూపిటర్‌ (లేదా జ్యూస్‌) దేవాధిదేవుడిగా ఆరాధించబడ్డాడు. గ్రద్దను అతనికి సంబంధించిన వాహనంగా నమ్ముతారు కాబట్టి దానికి గౌరవం ఉంది. 

పైగా బలానికి, ఉన్నత స్థానాలకు వెళ్లే సామర్థ్యానికి గుర్తుగా దాన్ని మన్నించారు. దాని రెక్కలు విస్తరించి ఉండడం సామ్రాజ్యవిస్తరణకు సంకేతం. అందువలన యూరోప్‌లో వర్ధిల్లిన అన్ని సామ్రాజ్యాలూ గ్రద్దను చిహ్నంగా వాడారు. రోమ్‌ సామ్రాజ్య స్థాపకుడైన రోములస్‌యే గ్రద్దకు చాలా ప్రాముఖ్యత యిచ్చాడు. ఎవెంటైన్‌ కొండపై అతనికి మొదట గ్రద్ద కనబడింది. తర్వాత తన కవల సోదరుడితో జరిగిన యుద్ధంలో విజయం లభించడంతో దాన్ని అతను శుభశకునంగా నమ్మాడు. అందువలన తన సైన్యం యుద్ధంలో పాల్గొనేటప్పుడు వాళ్లను జండా పట్టుకునే బదులు గ్రద్దను ముందు పెట్టుకుని వెళ్లమనేవాడు. రోమన్‌ సామ్రాజ్యమే గ్రద్దకు గౌరవం యివ్వడంతో చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ అనుకరించాయి. 

క్రైస్తవం రోమ్‌ సామ్రాజ్యంలోనే వర్ధిల్లింది కాబట్టి వాళ్లూ గ్రద్దకు గౌరవం యిచ్చారు. అది మూడుసార్లు నీటిలో మునుగుతుందని, అది బాప్టిజంతో సమానమని అనుకుని దాన్ని గౌరవిస్తారు. క్రైస్తు పునరుత్థానం తర్వాత స్వర్గానికి వెళ్లడానికి, యిది పైకి ఎక్కడికో వెళ్లపోవడానికి పోలిక చూస్తారు. క్రైస్తవ గ్రంథాలో జాన్‌ ద బాప్టిస్ట్‌ లేదా జాన్‌ ద ఎంవాజలిస్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. లోకాన్ని ఉద్ధరించే మెస్సయ్య క్రీస్తుగా అవతరించబోతాడని అతనే ముందుగా వెల్లడిస్తాడు. స్వర్గం నుంచి ఎగిరివచ్చి మనను చేరే గ్రద్దను జాన్‌ ద బాప్టిస్టుకు ప్రతీకగా క్రైస్తవులు విశ్వసిస్తారు. 

మధ్యయుగంలో సకల జంతువుల గురించి, పక్షుల గురించి విపులంగా రాసిన గ్రంథం బిస్టియరీ.  ప్రాణుల గురించి రాశాక, వాటిని పౌరాణిక చిహ్నాలతో ముడిపెట్టారు. వాటి నుంచి మనం నేర్చుకోవసిన నీతి ఏమిటో కూడా రాశారు.  ఆ పుస్తకంలో గ్రద్దకు, తొలి మానవుడు ఆదాముకు పోలిక చూపారు. గ్రద్ద ఆకాశంలో విహరిస్తూనే, ఆహారం కోసం కక్కుర్తి పడి భూమి మీదకు వస్తుంది. అది ఒకరకంగా పతనమే. అలాగే తొలుత స్వర్గవాసియైన ఆదాము నిషిద్ధఫలం కోసం కక్కుర్తి పడి భూమికి పతనమయ్యాడు.

అనేక యూరోపియన్‌ దేశాలలో గ్రద్దను జాతీయచిహ్నం (కోట్‌ ఆఫ్‌ ఆర్మ్‌స్‌) గా వాడుతూ వచ్చారు. జాతీయ పతాకాన్ని ప్రజలందరూ వాడతారు. దేశం బయట దేశానికి గుర్తుగా వాడతారు. కానీ కోట్‌ ఆఫ్‌ ఆర్మ్‌స్‌ను ప్రభుత్వం తన దస్తావేజులపై, రాజపత్రాలపై వాడుతుంది. ప్రభుత్వ భవనాలలో గోడను దానితో అలంకరిస్తుంది. ఇప్పటికాలంలో అయితే పాస్‌పోర్టు పుస్తకాల అట్టపై ముద్రిస్తోంది. ఈ దేశాల వాళ్లు సింహానికి కూడా గ్రద్దతో బాటు సముచిత స్థానాన్ని యిచ్చారు. కానీ బలానికి, హీరోయిజానికి గుర్తుగా గ్రద్దను సంభావించి తమ జాతీయచిహ్నంగా ప్రధానంగా వాడుకున్నారు. వాడుకునేటప్పుడు  బయట కనబడేట్లా కాకుండా అందంగా, కళాత్మకంగా దాని రూపాన్ని మార్చారు. 

జర్మనీ రాజులు, పోలండ్‌ రాజులు, బవేరియా, ఆస్ట్రియాలోని డ్యూక్‌ లు అందరూ దాన్ని వాడారు. గ్రద్దకు రెండు రెక్కలుండి, ఒక తల మాత్రమే వుంటే సిమిట్రీ కుదరటం లేదని కాబోలు రెండు తలల గ్రద్దను ఊహించి, చిత్రీకరించారు. రోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే జర్మనీ రాజు జర్మనీని పాలించే రోజుల్లో ప్రభుత్వంపై చక్రవర్తికి, రాజుకి యిద్దరికీ అధికారం ఉందని సూచించడానికి యీ రెండు తలల చిహ్నాన్ని వాడారని అంటారు. ఏది ఏమైనా యీ రెండుతలల గ్రద్దను హోలీ రోమన్‌ ఎంపైర్‌ క్రీ.శ.1433 నుంచి క్రీ.శ. 1806 వరకు వాడుకుంది. రోమన్‌ సామ్రాజ్యం తర్వాత జార్‌ చక్రవర్తుల పాలనలోని రష్యా 1917 వరకు, ఆస్ట్రియా 1919 వరకు వాడుకున్నాయి. సెర్బియన్‌ రాజులు కూడా వాడుకున్నారు. అల్బేనియాలో యిప్పటికీ జాతీయచిహ్నంగానే ఉంది. 

నెపోలియన్ కూడా తను జూపిటర్ వంటి వాడినని, సీజర్ రోమన్ సామ్రాజ్యాన్ని  విస్తరించినట్లు తనూ ఫ్రాన్స్ రాజ్యాన్ని విస్తరిస్తనానని చూపుకోవడానికి గ్రద్దను చిహ్నంగా ఎంచుకున్నాడు. ఇక అమెరికా విషయానికి వస్తే రెండుతలల గ్రద్దను మధ్యలో పెట్టుకుని రాజచిహ్నాన్ని తయారుచేసుకుంది. 1782లో తొలిసారి దాన్ని ఉపయోగించారు. అమెరికన్‌ పాస్‌పోర్టులపై కూడా యీ చిహ్నాన్ని చూడవచ్చు.  చైనాలో గ్రద్దను శారీరక దారుఢ్యానికి, శక్తికి సంకేతంగా చూస్తారు. చైనీస్‌ భాషలో ఇంగ్‌ అంటే గ్రద్ద. వీరుడు అనడానికి వాడే పదం వినడానికి యిలాగే వుంటుంది (హోమోనిమ్‌). బండరాతిపై గ్రద్ద ఉన్నట్టు చెక్కితే ద్వంద్వయుద్ధానికి సిద్ధపడుతున్న యోధుడని అర్థం. పైన్‌ (దేవదారు) వృక్షంపై గ్రద్ద ఉన్నట్టు చెక్కితే అమితబలానికి, దీర్ఘాయుర్దాయానికి గుర్తు. 

ఇక మన హిందూ పురాణాల విషయానికి వస్తే – గ్రద్ద గరుత్మంతుడికి ప్రతీక. గరుత్మంతుడు మహాబలశాలి. అమృతం తెచ్చి తల్లికి దాస్యవిముక్తి కలిగించినవాడు. పాములకు అతనంటే హడలు. విష్ణువుకు వాహనంగా ఉంటూ అతన్ని సేవించుకుంటూ ఉంటాడు. అందుకే విష్ణ్వాలయాలలో అతనికి విగ్రహం ఉంటుంది. రెండు అరచేతులూ చాచి వుంటుంది కాబట్టి కొందరు సరదాగా లంచగొండులను ‘గరుడవాహనం’ అని జోక్‌ చేస్తూంటారు. గరుడుడి పేరు మీద పురాణం వుంది. (నటుడు శివాజీ వెరయిటీ కాదు) దానిలో అనేక విషయాలతో బాటు చనిపోయాక జీవి స్వర్గనరకాలకు ఎలా వెళతాడు, మోక్షం ఎలా పొందుతాడు అనే విషయాలున్నాయి. చనిపోయినప్పుడు దినాల్లో దాన్ని చదువుతారు.  జనాభాలో 87 శాతం ముస్లిములున్న ఇండోనేసియా ప్రభుత్వపు ఎయిర్ లైన్స్ పేరు – గరుడ ఇండోనేసియా!. (ఫోటో – మెక్సికో, ఈజిప్టు, రోమ్, నెపోలియన్ కాలం నాటి ఫ్రాన్స్, జారిస్టు రష్యా, అమెరికా జాతీయ చిహ్నాలు) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)

[email protected]