స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తొలి రోజే నామినేషన్ల బోణీ కూడా కొట్టాయి. ఓటమి ఖాయం కావడంతో టీడీపీ ఓ పాంప్లేట్ రిలీజ్ చేసి సైలెంట్ గా కూర్చుంది. ఆ కరపత్రం చూసిన వారెవరికైనా.. జగన్ అమలు చేసిన నవరత్నాల కార్యక్రమాలు వెంటనే గుర్తొస్తాయి, వైసీపీకే ఓటేయాలనిపిస్తుంది. అలా ఉంది, వారి కపిత్వం. ఇక పవన్ కల్యాణ్ నేనున్నానంటూ మేనిఫెస్టో రూపొందించే పనిలో పడ్డారు.
అలాంటిలాంటి మేనిఫెస్టో కాదట, అది చదవిన వెంటనే జనసేనకు లేదా బీజేపీకి ఓటు వేసేయాలన్నంత పూనకం వచ్చేస్తుందట. అబ్బో ఆ మేనిఫెస్టోని పెద్ద బ్రహ్మ పదార్థంలా కీర్తిస్తున్నారు జనసైనికులు. అసలు విషయమేంటంటే.. అది కాస్తా బైటకి వస్తే నవ్వులపాలవడం ఖాయమని గుసగుసలాడుకుంటున్నారు బీజేపీ, జనసేన క్షేత్రస్థాయి నేతలు.
2019 ఎన్నికలకు ముందు పవన్ ఇలాంటి ప్రయోగమే చేసి విఫలమయ్యారు. అమలయ్యేందుకు అవకాశమే లేని హామీలు, ఆల్రెడీ అప్పటికే ప్రభుత్వాలు అమలు చేస్తున్న హామీలు.. అన్నీ కలిపి కలగూరగంప చేసేశారు. రేషన్ సరకుల పంపిణీని రద్దుచేసి ప్రతి ఇంటికీ నేరుగా నగదు బదిలీ చేస్తానంటూ భారీ హామీ ఇచ్చారు.
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాని భరోసా ఇచ్చారు. సాగు సమయంలో రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం మరిచి.. వయసైపోయిన రైతులకు నెలనెలా పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇక హాస్టల్స్ విషయంలో తనదైన పైత్యం చూపించారు. ఇప్పుడున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అన్నీ మూసేసి కామన్ హాస్టల్ సిస్టమ్ తీసుకొస్తానంటూ ప్రగల్భాలు పలికారు. సంక్రాంతికి ఆడపడుచులకు చీరలు, ఇతర మతస్తులకు కూడా పండగ చీర, సారె, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మూడు మండలాలకు ఒక స్మార్ట్ సిటీ, ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం… అబ్బో ఇలా చాలానే చెప్పారు పవన్ కల్యాణ్.
2019ఎన్నికల్లో జనసేన పార్టీనే కాదు, వారి మేనిఫెస్టోని కూడా పూర్తిగా లైట్ తీసుకున్నారు జనం. అన్నిటికంటే కామెడీ ఏంటంటే.. నియోజకవర్గాల వారీగా మరోసారి జనసేన మేనిఫెస్టోలు విడుదల చేయడం. అందులో భాగంగా గాజువాకకి కూడా సెపరేట్ మేనిఫెస్టో ప్రకటించి నవ్వులపాలయ్యారు పవన్. ఇప్పుడిక స్థానిక ఎన్నికల వంతు వచ్చింది. సాధారణంగా స్థానిక పోరుకి ఎవరూ ప్రత్యేకంగా హామీలు ఇవ్వరు.
అధికారపక్షం అప్పటికే అభివృద్ధి పథకాలను అమలు చేస్తుంది కాబట్టి, కొత్తగా చెప్పేదేమీ ఉండదు, ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలు చేస్తుంది. ఈ రెండూ కానీ జనసేన-బీజేపీ మాత్రం మేనిఫెస్టో విడుదల చేస్తామంటూ హడావిడి చేస్తూ కామెడీ మొదలు పెట్టాయి.
వకీల్ సాబ్ షూటింగ్ గ్యాప్ లో తనకొచ్చిన ఆలోచనల్ని పవన్ పేపర్ పై పెట్టి, వాటినే మేనిఫెస్టోగా విడుదల చేస్తారేమోనని జనసైనికులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ దిశగా రెండు పార్టీలు కలిసి కూర్చొని చర్చించిన దాఖలాల్లేవు. పవన్ షూటింగ్స్ తో, మనోహర్ జిల్లా పర్యటనలతో, బీజేపీ నేతలు ఢిల్లీ టూర్స్ తో బిజీగా ఉన్నారు.
అసలు స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పడమే పెద్ద కామెడీ, అది విడుదలైతే ఇంకెంత కామెడీ బైటపడుతుందో చూడాలి.