ఈ సినిమా పోతే.. స్టార్‌ హీరోకి అవకాశాలు లేనట్టే!

ఒకవైపు బాలీవుడ్‌లోకి కొత్త నీరు వచ్చిచేరింది. ఖాన్‌ త్రయమే.. బాలీవుడ్‌ను ఏలేరోజులు దాదాపు అయిపోయాయి. చాలాకాలం పాటు సాగిన వారి ఆధిపత్యానికి గండిపడి చాలా కాలం అవుతోంది. బాలీవుడ్‌కు దక్షిణాది నుంచి కూడా గట్టిపోటీ…

ఒకవైపు బాలీవుడ్‌లోకి కొత్త నీరు వచ్చిచేరింది. ఖాన్‌ త్రయమే.. బాలీవుడ్‌ను ఏలేరోజులు దాదాపు అయిపోయాయి. చాలాకాలం పాటు సాగిన వారి ఆధిపత్యానికి గండిపడి చాలా కాలం అవుతోంది. బాలీవుడ్‌కు దక్షిణాది నుంచి కూడా గట్టిపోటీ ఎదురవుతోంది. దక్షిణాది సినిమాలు హిందీలోకి డబ్బింగ్‌ అయ్యి..బాలీవుడ్‌ సినిమాలకు ధీటైన కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. అసలు హీరోలు ఎవరు? ఎక్కడివారు? సినిమాలో హీరో నేపథ్యం ఏమిటి? అనే అంశాలను ప్రేక్షకులు పరిగణనలోకి తీసుకునే రోజులు కూడా పోతున్నాయి.

సినిమా బాగుందంటే.. హీరో ఎవరైనా చూడటం, సినిమా బాగోలేదు అంటే.. ఎంతటి పెద్ద హీరో సినిమా అయినా తిరస్కరించేయడం. ఇదీ ఇప్పటి ట్రెండ్‌. అసలు సినిమాను మేల్‌ యాక్టరే లీడ్‌ చేయాల్సిన అవసరంలేదు.. హీరోయిన్లు కూడా సినిమాను లీడ్‌ చేయవచ్చు.. అలాంటి సినిమాలు కూడా వందకోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకోవచ్చు.. అని కూడా కొన్ని బాలీవుడ్‌ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో ట్రెండ్‌ మొత్తం మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ కొంతమంది హీరోలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. టాప్‌ స్టార్స్‌గా చలామణి అయిపోతూనే ఉన్నారు.

కానీ.. ఇప్పుడు ఒక బాలీవుడ్‌ హీరో కెరీర్‌కు ప్రమాదం వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే చెబుతున్నాడు. వరస ఫ్లాపులతో సతమతమవుతూ.. ఈ సినిమా పోతే తనకు మళ్లీ కెరీర్‌ ఉండదేమో.. అని బయటకే చెప్పేస్తున్న స్టార్‌ హీరో షారూక్‌ ఖాన్‌. ఇతడి తాజా సినిమా 'జీరో' ప్రమోషన్స్‌లో షారూక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. జీరో సినిమా ఫ్లాప్‌ అయితే తను జీరో అవుతానని ఈ హీరో చెప్పాడు! తన సినిమా 'జీరో' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్‌ అయితే.. ఇది ఫ్లాప్‌ అయితే తను కొన్నాళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వస్తుందని షారూక్‌ ఖాన్‌ అంటున్నాడు.

దీనికి ఆయన బాధపడటంలేదు కానీ.. కొంచెం యథార్థవాదిలా మాట్లాడుతూ ఉన్నాడు. జీరో గనుక బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అయితే.. ఏడెనిమిది నెలలు తనకు మరే సినిమా అవకాశమూ రాకపోవచ్చని, బహుశా ఏడాది వరకూ మళ్లీ తను మరే సినిమాలోనూ నటించలేకపోవచ్చని షారూక్‌ అన్నాడు. తను ఏదో బ్రేక్‌ తీసుకుంటానని ఈ హీరో చెప్పడంలేదు. తనకు కొంతకాలం పాటు అవకాశాలు రావేమో అని అంటున్నాడు. తనను బాలీవుడ్‌ పక్కన పెట్టేస్తుందేమో అని వ్యాఖ్యానించాడు.

ఒక స్టార్‌ హీరో.. ఇప్పటికీ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్‌ ఉందని అంతా అనుకుంటున్న హీరో.. ఇలా మాట్లాడాడు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే షారూక్‌ ఏదో సరదాగా ఇలా మాట్లాడలేదు. నిజంగానే ఆయన కెరీర్‌ ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉంది. జీరో  సినిమా గనుక ఆకట్టుకోకపోతే.. భారీ విజయంగా నిలవకపోతే.. షారూక్‌ కెరీర్‌కు ఇబ్బంది మొదలైనట్టే. విశేషం ఏమిటంటే.. ఇప్పుడు షారూక్‌ చేతిలో మరో సినిమా ఏదీలేదు.  జీరో ఫలితాన్ని బట్టి ఈ హీరోకి తదుపరి అవకాశాలు దక్కుతాయని అనుకోవాల్సి వస్తోంది.

వరస ఫ్లాపులు.. డిజాస్టర్లు!
షారూక్‌ సరైన హిట్‌కొట్టి ఐదు సంవత్సరాలు కావొస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' తర్వాత షారూక్‌ ఆస్థాయి హిట్‌ లేదు. ఆ సినిమాలా మాస్‌ ఎంటర్‌ టైనర్‌, మంచి వసూళ్లు సాధించిన సినిమా.. కమర్షియల్‌గా హిట్టైన సినిమా షారూక్‌కు మళ్లీ పడలేదు. 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమా వచ్చింది. షారూక్‌కు విజయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఈ హీరో సినిమాలు ప్రేక్షకుల తిరస్కరణనే పొందుతూ ఉన్నాయి.

హ్యాపీ న్యూ ఇయర్‌, దిల్‌ వాలే, ఫ్యాన్‌, డియర్‌ జిందగీ, రయిస్‌, జబ్‌ హ్యారీ మెట్‌ సాజల్‌.. ఈ సినిమాల్లో షారూక్‌ ఫుల్‌లెంగ్త్‌ పాత్రలు చేశాడు. షారూక్‌ సినిమాలుగా భారీ అంచనాల మధ్యన ఇవి విడుదల అయ్యాయి. అయితే వీటిల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి లేవు. ఒకదానికి మించి మరోటి ఫ్లాప్స్‌గా నిలిచాయి. వీటిల్లోనూ జబ్‌ హ్యారీ మెట్‌ సాజల్‌ అయితే.. డిజాస్టర్‌. ఆ సినిమా దర్శకుడు ఇంతియాజ్‌ అలీ మీద థియేటర్లలో ప్రేక్షకులను మరీ అంతగా నిరుత్సాహపరుస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. మోడ్రన్‌ డేస్‌ డైరెక్టర్లలో ప్రేమకథలను చక్కగా డీల్‌ చేసే దర్శకుడిగా పేరుంది ఇంతియాజ్‌కు .ఆ పేరును కాస్తా చెడగొట్టుకోవడంతో పాటు.. షారూక్‌కు కూడా ఒక డిజాస్టర్‌ను ఇచ్చాడు ఆ దర్శకుడు. ఆ సినిమాకు షారూక్‌ పేరు మీద కనీసం పోస్టర్ల సొమ్ములు కూడా తిరిగి వచ్చినట్టుగా లేవు.

స్టార్‌ హీరోల సినిమాలు ఫ్లాప్‌ కావడంలో పెద్ద విచిత్రం ఉండదు. అయితే ఓపెనింగ్‌ డే కలెక్షన్స్‌తో కొద్దోగొప్పో వసూళ్లు తిరిగివస్తాయి. హీరోల పారితోషకం ఎలాగూ భారీస్థాయిలో ఉంటుంది. కనీసం ఆ సొమ్ము అయినా ఓపెనింగ్స్‌తో తిరిగి వస్తుందని వాటి నిర్మాతలు ఆశిస్తూ ఉంటారు. అయితే షారూక్‌ సినిమాలు మాత్రం అలాంటి స్థాయి మొత్తాలను కూడా రాబట్టుకోలేకపోయాయి. ఇలా వరస ఫ్లాఫులతో.. డిజాస్టర్లతో షారూక్‌ కెరీర్‌ గతుకు రోడ్లలో పయనిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు జీరో ఈ హీరో కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమా గనుక కమర్షియల్‌గా హిట్‌ అనిపించుకోకపోతే.. షారూక్‌కు తదుపరి అవకాశం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ హీరోని నమ్మి భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి బయటి నిర్మాతలు అంత సాహసించే పరిస్థితి ఉండకపోవచ్చు.

బాలీవుడ్‌లో రోజులు మారాయి!
స్వశక్తితో ఎదిగాడు షారూక్‌ఖాన్‌. నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లో అప్పటి స్టార్‌ హీరోలు యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ పాత్రలను చేయడం ఆపేస్తున్న దశలో.. వాళ్లను ఇక హీరోలుగా చూడలేం.. అన్నట్టుగా ప్రేక్షకులు ఫీల్‌ అవుతున్న దశలో.. అమితాబ్‌, మిథున్‌ చక్రవర్తి వాళ్లు ఇంకా హీరో వేషాలు వేసి జనాలను విసిగిస్తున్న తరుణంలో షారూక్‌ వంటి యంగ్‌ హీరోల ఎంట్రీ జరిగింది. లవ్‌ స్టోరీలతో వీళ్లు స్టార్లు అయ్యారు. వీళ్ల సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌గా దేశవ్యాప్తంగా వీళ్లకు గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఇక మరోవైపు ఇప్పుడు బాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు స్టార్లు అయ్యారు. రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌.. వంటివాళ్లు టాప్‌స్టార్స్‌ రేంజ్‌కు వెళ్లారు. సల్మాన్‌ తన జోనర్‌ సినిమాలకే పరిమితం అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో షారూక్‌ అంటూ ప్రత్యేకత లేకుండా పోతోంది. లవ్‌ సినిమాలు చేయాలి.. లవర్‌ బాయ్‌గా జనాలు యాక్సెప్ట్‌ చేసేలా లేరు. అందుకే ఈసారి జీరో అంటూ ప్రయోగాత్మకంగా వచ్చాడు. ఇది షారూక్‌ను ఏ మేరకు నిలబెడుతుందో దీని వసూళ్లే చెబుతాయి.

క్రేజ్‌ అయితే ఉంది కానీ..!
ఇటీవలే ఎవరో ఒక జంట తమ పెళ్లికాగానే.. షారూక్‌ ఇంటి దగ్గరకు వచ్చింది. తమ పెళ్లి కాగానే.. షారూక్‌ ఇంటిని చూడాలని అనుకున్నారట ఆ జంట. ఈ హీరోపై అభిమానుల్లో ఇంకా క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే.. ఇదంతా షారూక్‌ తన గత సినిమాలతో సంపాదించుకున్నదే. బాజీగర్‌ నాటి అభిమానగణమే ఇప్పటికీ ఉంది. దిల్‌తో పాగల్‌ హై చూసి పాగల్స్‌ అయిన వాళ్లే షారూక్‌ను అమితంగా అభిమానిస్తూ ఉన్నారు. ఆ పరంపర కొనసాగడం ఓకే కానీ.. అర్జెంటుగా షారూక్‌కు హిట్‌ అవసరం.

లవర్‌బాయ్‌ వేషాలను ఇక షారూక్‌ కట్టిపెట్టినట్టే అనుకోవాలి. కింగ్‌ఆఫ్‌ రొమాన్స్‌, దివంగత యశ్‌చోప్రా కూడా షారూక్‌తో కొన్నేళ్ల కిందట ఒక ప్రేమ సినిమా తీసి బోల్తాపడ్డాడు. ఇక షారూక్‌ రూటు మార్చాల్సిందే. చక్‌ దే ఇండియా వంటి వైవిధ్యాలను రుచి చూపిస్తే షారూక్‌కు నేటితరంలో కూడా మళ్లీ ప్రేక్షకామోదం రావొచ్చు. అవతల బాలీవుడ్‌ యంగ్‌ హీరోలు దూసుకుపోతున్నారు. సౌత్‌ నుంచి దుల్కర్‌ సల్మాన్‌, మిజయ్‌ దేవరకొండ, ధనుష్‌లు దండయాత్రలు చేస్తున్నారు. కాబట్టి.. కింగ్‌ఖాన్‌ లాంటి వాళ్లు అలర్ట్‌ కావాల్సిందే. అలర్ట్‌ అవుతున్న దాఖలాలు షారూక్‌ మాటలను బట్టే అర్థం అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో కెరీర్‌ను జీరో ఏం చేస్తుందో!

జగన్ కు ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా