ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ అంగరంగ వైభోగంగా జరిగింది. దాదాపుగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు అంతా హాజరయ్యారు. కానీ అతి కీలకమైన చిన్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు, మరో కీలకమైన మనవడు నారా లోకేష్ మాత్రం హాజరుకాలేదు. యూనిట్ వర్గాల నుంచి దీనికి వచ్చిన ఆన్సరు చిత్రంగా వుంది. ఫంక్షన్ కు పొలిటికల్ టచ్ వుండకూడదనుకున్నారు. అందుకే పిలవలేదు అని. ఈ పాయింట్ చాలా చిత్రంగా వుంది.
అసలు తొలుత తిరుపతి లో ఫంక్షన్ ప్లాన్ చేసిపుడే కొడుకులు కోడళ్లు అడియోను, కూతుళ్లు అల్లుళ్లు ట్రయిలర్ ను విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు వినికిడి. కానీ అది ఎందుకో మారిపోయింది.
బయోపిక్ హీరో బాలకృష్ణ స్వయంగా ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ మనిషి. మరి అది పొలిటికల్ టచ్ కాదా? అలాగే దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా నాయకురాలు. మరి అది పొలిటికల్ టచ్ కాదా?
పోనీ చంద్రబాబు, లోకేష్ రాలేనంత కీలక వ్యవహారాల్లో వున్నారా? అంటే ప్రస్తుతం పొలిటికల్ హడావుడి ఏమీ లేదు. కేవలం ఎన్టీఆర్ మనవడిగానే కాదు, హీరో బాలయ్య అల్లుడిగానైనా లోకేష్ హాజరు కావాల్సివుంది. బాలయ్య రెండో అల్లుడు భరత్ వచ్చారు. ప్రసంగించారు కూడా.
రారేమో అనుకున్న ఎన్టీఆర్ ను కూడా బాలయ్య ఫోన్ చేసి మరీ పిలిచి రప్పించారు. మరి అలాంటిది స్వంత అల్లుడు లోకేష్ ను పిలవకుండా వుండి వుంటారా? పైగా ఎన్టీఆర్ కు స్వంత మనవడు కదా? ఎందుకు రానట్లు?
కనీసం ఈ విషయం ఎటువైపు నుంచీ ఎటువంటి వివరణ కూడా లేదు. అదే ఆశ్చర్యం.
ఇంకా గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ ను పిలిచి, ఆయన వస్తానన్న సమయానికే ఫంక్షన్ కు లోకేష్ రావడం లేదన్న విషయం ఇండస్ట్రీలో బయటకు పొక్కింది. ఎన్టీఆర్ వస్తున్నారని, లోకేష్ రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అంటే అనుకోకుండా రాకపోవడం కాదన్నమాట.
మొత్తం మీద నందమూరి కుటుంబంలో పైకి కనిపించినంత సఖ్యత అయితే నిజంగా వుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.