మోహన్ బాబు మిగిల్చిన, రగిల్చిన అనుమానాలు

సీనియర్ నటుడు మోహన్ బాబుది ఓ విలక్షణ శైలి. ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఎవరైతే నాకేంటీ.. ఎవరు ఏమనుకుంటే నాకేంటీ అనే పద్దతి ఆయనది. ఎన్టీఆర్ బయోపిక్ అడియో పంక్షన్ లో…

సీనియర్ నటుడు మోహన్ బాబుది ఓ విలక్షణ శైలి. ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఎవరైతే నాకేంటీ.. ఎవరు ఏమనుకుంటే నాకేంటీ అనే పద్దతి ఆయనది. ఎన్టీఆర్ బయోపిక్ అడియో పంక్షన్ లో కూడా మోహన్ బాబు తనదైన శైలిలో మాట్లాడారు. ఆ మాటల్లో అనేక కనిపించని, వినిపించని సంగతులు తొంగిచూసాయి. ఆయన ప్రసంగంలోని కొన్ని పాయింట్లు ఇక్కడ చూద్దాం.

నిజాలు మాట్లాడాలా? ఆ నిజాల్లో కూడా కొన్ని నిజాలే మాట్లాడాలా?

''అన్నయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లు డౌన్ డౌన్ అన్నారు. ఐ యామ్ ద ఓన్లీ మాన్ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అన్నది..''

'..మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తే జనం రారేమో అని ఓ వ్యక్తి అన్నారు. కానీ జనం లక్షల్లో వచ్చారు..''

''..కొన్ని సంఘటనలు చెప్పారు. అందులో ఒకటి చెప్పకూడదు..''

''..1995లో మళ్లీ షిర్డీ తీసుకెళ్లాను..'(1995 ఆగస్టులో ఎన్టీఆర్ కు వెన్నుపోటు)

''..క్రిష్ పిక్చర్ బాగా తీసావ్.. దాంట్లో (పిక్చర్లో) చెడ్డ క్యారెక్టర్లను కూడా మంచివాళ్లను చేసావో నాకు తెలియదు..''

ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం, అలాంటి నాయకుడికి చాలా దగ్గరగా మసలిన నటుడు మోహన్ బాబుకు మరిన్ని విశేషాలు తెలిసి వుండడం సహజం. అలాంటి వ్యక్తి నిజాలు మాట్లాడాలా? కొన్ని నిజాలే మాట్లాడాలా? అన్నారు అంటే, అర్థం ఏమిటి? ఈ ఫంక్షన్ లో కొన్ని నిజాలే చెప్పాల్సి వస్తోందనా?

అన్నయ్యను కాంగ్రెస్ వాళ్లు డౌన్ డౌన్ అన్నారు. అని గుర్తుచేసారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి ముద్దు అయింది. ఆ విషయం తెలిసీ ఈ విషయం గుర్తుచేసారు అంటే ఏమనుకోవాలి?

ఎన్టీఆర్ షిర్డీ వెళ్లినపుడు కొన్ని సంఘటనలు చెప్పారు. వాటిల్లో కొన్ని చెప్పకూడదు అని చెప్పారు మోహన్ బాబు. చెప్పకూడదు అనుకున్నపుడు అసలు వాటిని ప్రస్తావించడం ఎందుకు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య జరిగే సమావేశంలో వారికి కూడా తెలియని సంఘటనలు మోహన్ బాబుకు ఏం తెలుసో?

క్రిష్ సినిమా బాగా తీసావ్ అని మెచ్చుకున్నారు. అంతవరకు ఓకె. అయితే చెడ్డ క్యారెక్టర్లు కూడా మంచిగా తీసావేమో అన్న అనుమానం మోహన్ బాబుకు ఎందుకు కలిగింది? అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో చెడ్డ క్యారెక్టర్లు ఏవి వుండే అవకాశం వుంది?

సినిమారంగంలో ఆయనకు తిరుగులేదు. అందువల్ల అక్కడ చెడ్డ క్యారెక్టర్లు వుండే అవకాశం లేదు. ఇక మిగిలింది ఎన్టీఆర్ గద్దెదింపిన చంద్రబాబు క్యారెక్టర్ ఒక్కటే. దాన్ని దృష్టిలో వుంచుకునే ఆ మాటలు అన్నారా?

మొత్తం మీద ఫంక్షన్ హడావుడిలో నూటికి తొంభై తొమ్మిది మంది అభినందనల ప్రసంగాల్లో మోహన్ బాబు ప్రసంగాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ, ఆయన మిగిల్చిన, రగిల్చిన అనుమానాలు అయితే వున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా