నిజం నిప్పులాంటిదంటారు. నిప్పుతో చెలగాటం మంచిది కాదని మన పెద్దలు ఏనాడో చెప్పారు. నిజం, నిప్పు, చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు- జర్నలిస్టు పితామహుడు వేమూరి రాధాకృష్ణ మధ్య స్నేహసంబంధాలు కూడా బహిరంగ రహస్యమే. అలాంటిది టీడీపీ గురించి నిజాలు రాసినా, చెప్పినా…నిప్పు బాబు నుంచి ఎదురయ్యే ఇబ్బందులేమిటో తెలిసి కూడా, నిప్పుతో చెలగాడం ఆడొద్దనే పెద్దల హితవును కూడా లెక్క చేయకుండా మన ఆర్‌కే సార్ ఎంతో రిస్క్ చేసి రాసిన వ్యాసానికి వైసీపీ వాళ్లు ఇచ్చే బహుమతి ఇదా?
ఇంకా చెప్పాలంటే ఆర్‌కేకు అది కూడా బాధ అనిపించలేదు. కానీ ఒక్క విషయం మాత్రం హర్ట్ చేసింది. అదేంటంటే ఎవరినైతే పొగడ్తలతో ముంచెత్తాడో, ఆ పెద్ద మనిషి ట్వీట్‌లో ఆర్‌కేని ఎన్నేసి మాటలు తిట్టాడు. ఇది న్యాయమా?
‘విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు పెద్ద అసెట్ అనే చెప్పాలి. బీజేపీ పెద్దలకు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య అనుసంధానకర్తగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి పన్నిన వ్యూహం కారణంగా ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేశ్ అంబానీ తాడేపల్లి వచ్చి మరీ జగన్‌ను కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించారు’…. అసలు ఆర్‌కే కలం నుంచి విజయసాయిరెడ్డి గురించి ఇలాంటి ప్రశంసాపూర్వక మాటలు వస్తాయని ఎవరైనా కలలోనైనా ఊహించారా? అబ్బే లేనే లేదు కదా! మరి పైసా ఖర్చు లేకుండా విజయసాయి పరపతిని ఆకాశానికి ఆర్‌కే ఎత్తితే…దానికి ప్రతిఫలంగా విజయసాయి ఏమిచ్చాడో తెలుసా?
'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఈ ట్వీట్‌లో కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో అంటే నిన్నటి కొత్తపలుకు వ్యాసంలో ఆర్‌కే సూచనను స్వీకరించాలని బాబును విజయసాయి అవహేళన చేశాడు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఆర్‌కే …. 'పోరాడితే వచ్చేదేమిటి?' శీర్షికతో రాసిన కొత్త పలుకు వ్యాసంలో ‘సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, మునిసిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఎంతమంది నాయకులూ ముందుకు వస్తారో తెలియదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం’ అని చంద్రబాబుకు సలహా ఇచ్చాడు.
ఈ విషయాన్ని విజయసాయి పరోక్షంగా ప్రస్తావించాడు. ఇందులో భాగంగా ఆర్‌కేను కులమేధావి, కిరసనాయిలు అని దెప్పి పొడిచాడు. నిజాలు రాయకపోతే చూడు చూడు ఆ ఆంధ్రజ్యోతిలో ఎలా రాసారో అని విమర్శిస్తారు. నిజాలు రాస్తే ఇలా పరోక్షంగా ప్రస్తావిస్తూ అవహేళన చేస్తారు. ఇలాగైతే ఈ వైసీపీ వాళ్లతో ఎలాగబ్బా? కనీసం నిజాలు చెప్పినప్పుడైనా ఒక్క మంచి మాట మాట్లాడితే ఆ విజయసాయిరెడ్డి సొమ్ము ఏమి పోతుందో అర్థం కాదు. ఆర్‌కేను ఇలా హర్ట్ చేస్తారా? సరే సరే కానివ్వండి…ఆర్‌కేకు ఓ రోజు వస్తుందని గుర్తించుకోండి. అంతే… అంతేగా మరి!