‘చినబాబు’ సత్తాపై సన్నగిల్లుతున్న ఆశలు

మనవాళ్లు, మన పార్టీ, మన వర్గం అన్నపుడు బలహీనతలు సైతం బలాలుగా కనిపిస్తాయి. కింద పడనా, మీద పడ్డామనే అంటారు. ఎలాగైనా మద్దతు పలుకుతారు. మద్దతుగా నిలుస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు,…

మనవాళ్లు, మన పార్టీ, మన వర్గం అన్నపుడు బలహీనతలు సైతం బలాలుగా కనిపిస్తాయి. కింద పడనా, మీద పడ్డామనే అంటారు. ఎలాగైనా మద్దతు పలుకుతారు. మద్దతుగా నిలుస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు పార్టీ యువరాజు చినబాబు విషయంలో మాత్రం రెండు భిన్నమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి.

కమ్మసామాజిక వర్గం లో మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వుంటుందన్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. ఆ పార్టీ పునాదులు ఆ సామాజిక వర్గంలోంచే తయారయ్యాయన్నది చరిత్ర చెప్పే సత్యం. పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చంద్రబాబును సదా అభిమానిస్తూనే వుంటారు.

అయితే ఇటీవల కమ్మ సామాజిక వర్గం సర్కిళ్లలో ఓ భిన్నమైన దోరణి కనిపిస్తోందని తెలుస్తోంది. చంద్రబాబు పట్ల అభిమానం అలాగే వుంది. పార్టీ పట్ల మద్దతు అలాగే వుంది. కానీ చినబాబు లోకేష్ శక్తి సామర్థ్యాల మీద మాత్రం నమ్మకం రాను రాను సడలిపోతోందని తెలుస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కష్టం చూసి, పోరాటం చూసి ముచ్చటపడుతున్న కమ్మ సామాజిక వర్గ జనాలు, పార్టీ భవిష్యత్, లోకేష్ సామర్థ్యం తలుచుకుని నిట్టూరుస్తున్నారట.

పార్టీని విజయపథంలో నడిపించే శక్తి, పార్టీని నిలబెట్టే సామర్థ్యం లోకేష్ కు లేవు అని ఓ అంచనాకు కమ్మ సామాజిక వర్గ జనాలు వచ్చేసినట్లు ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు ఈ వయసులో కూడా తానే పోరాడుతున్నారు తప్ప, లోకేష్ ను ముందుకు నడిపించి, తాను డైరక్షన్ చేయడం లేదు. దీనికి కారణం లోకేష్ పోరాట పటిమ అర్థం అయిపోవడమే అన్న కామెంట్లు ఈ వర్గంలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా లోకేష్ ను ఎలాగైనా ముందుకు తెచ్చి నడిపించాలని అనుకుంటే, లేనిపోని తలకాయనొప్పులు వస్తాయని, అందువల్ల లోకేష్ ను వెనుక వుంచి, బాబుగారు పోరాడ్డమే బెటర్ అనే అభిప్రాయం తెలుగుదేశం అభిమాన వర్గాల్లో వినిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఓటమి చెందడం వెనుక లోకేష్ కోటరీ  వ్యవహారాలు వున్నాయని ఇన్నాళ్లు ఇదే సామాజిక వర్గం లోలోపల అనుకుంటోంది కానీ పార్టీ అభిమానం దృష్ట్యా అంతగా బయటపడలేదు. కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితుల రీత్యా, లోకేష్ ను వెనుక సీట్లో వుంచి, బాబుగారు పార్టీ వాహనం డ్రయివ్ చేసుకోవడం బెటర్ అనే ఒపీనియన్ వినిపిస్తోంది.

ఇదంతా బాగానే వుంది. పోనీ బాబుగారు వున్నారు కాబట్టి పోరాడతారు, జనంలో తిరుగుతారు. మరి భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏమిటి?  లోకేష్ ఎప్పటికైనా పార్టీ పగ్గాలు పూర్తిగా చేపట్టగలరా? ఆ శక్తిలేదా? అన్నమానాలు బయట వారికి వున్నాయేమో కానీ, పార్టీకి మద్దతు ఇస్తున్న ఈ కీలక సామాజిక వర్గంలో మాత్రం వున్నట్లు కనిపించడం లేదు.

బహుశా అందుకే కావచ్చు, ఈ సామాజిక వర్గం లో యువ తరం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై ఆశలు పెట్టుకుంటోంది. ఆ పరిస్థితి వచ్చినపుడు కచ్చితంగా జూనియర్ నే పార్టీని ఆదుకునేది అని నమ్ముతోంది. అంతర్గత చర్చల్లో ఈ విషయాలు సదా వినిపిస్తున్నాయని బోగట్టా.

ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ మరోసారి నందమూరి వారి చేతుల్లోకి రావడం పక్కా అని అనుకోవాల్సి వస్తోంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా