హెచ్ఆర్ భరద్వాజ్.. గాంధీల కుటుంబానికి బాగా విధేయుడు. బహుశా ఒక్కసారి కూడా ప్రజల నుంచి గెలవకపోయినా.. వరసగా రాజ్యసభ సభ్యత్వాన్ని సుదీర్ఘ కాలం పాటు పొంది.. ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాల్లో పని చేసిన కాంగ్రెస్ నేత ఈయన. ఇందిర, రాజీవ్ ల హయాంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా పని చేసి, పీవీ హయాంలోనూ అదే శాఖకు మంత్రిగా చేసి, మన్మోహన్ సింగ్ కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా.. దేశంలో సుదీర్ఘ కాలం పాటు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన రికార్డును సొంతం చేసుకున్నారాయన.
న్యాయశాఖలు పలు సంస్కరణలను తీసుకు వచ్చిన మంత్రిగా ఈయనకు పేరుంది. అంతకన్నా ఎక్కువగా ఈయన వార్తల్లో నిలిచింది కర్ణాటకకు గవర్నర్ గా చేయడం ద్వారా! యూపీఏ వన్ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన భరద్వాజ్ ఆ తర్వాత కర్ణాటకకు గవర్నర్ గా వెళ్లారు. అక్కడ అప్పట్లో అధికారంలో ఉండిన యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ సర్కారుతో ఒక ఆట ఆడుకున్నారీయన.
గవర్నర్ తలుచుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలను ఎంతగా ఇబ్బంది పెట్టవచ్చో అంతా నిరూపించారు భరద్వాజ్. ఆఖరికి యడ్యూరప్పను ప్రాసిక్యూట్ చేయడానికి కూడా గవర్నర్ హోదాలో భరద్వాజ్ ఆమోదించారు! దీంతో తప్పనిసరిగా యడ్యూరప్ప పదవిని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ హై కమాండ్ ఒత్తిడి తెచ్చి యడ్యూరప్ప చేత రాజీనామా చేయించింది. మరొకరిని ముఖ్యమంత్రిగా చేసింది. దీంతో యడ్యూరప్ప అలిగి బీజేపీకి రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీని యడ్యూరప్ప పార్టీ దెబ్బేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది! గవర్నర్ హోదాలో భరద్వాజ్ వ్యవహరించిన తీరు ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలను నిర్దేశిచింది.
ఇలా కేంద్ర మాజీ మంత్రిగా కన్నా కర్ణాటక మాజీ గవర్నర్ గానే ఎక్కువగా గుర్తిండిపోయిన భరద్వాజ్ తుదిశ్వాస విడిచారు. 83 యేళ్ల ఆయన గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తోంది. ఆయన వారసులు ఎవరూ కాంగ్రెస్ లో, రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరని సమాచారం.