ఎన్టీయార్ సినిమా ఆడియో రిలీజ్‌తో ఎన్టీయార్ ఫీవర్ ప్రారంభమైంది. ఇది సినిమా రెండు భాగాలు రిలీజయ్యేవరకూ సాగుతుంది. సినిమా హిట్ అయితే యింకో నెల్లాళ్లు కొనసాగుతుంది. రెండో పార్టులో రాజకీయాలు వస్తాయి కాబట్టి, చూపించినది ఎంతవరకు కరక్టు, ఎంతవరకు కాదు అనేది మన పాఠకుల మధ్య చర్చకు వస్తుంది.
వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్ గుర్తింపు తెచ్చుకుంటే ఆ సినిమాలో చూపించిన విషయాలపై కూడా పాఠకులు వివరణ అడుగుతారు. ఎన్టీయార్ గురించి తక్కిన అనేక సందర్భాల్లో కూడా ఏం రాసినా పాఠకులు ఆసక్తిగా చదువుతారు. ఇప్పుడు మరీనూ. కొత్త విషయాలు ఏమీ ఊరవు కాబట్టి గతంలో చెప్పినదే చెప్పాల్సి వస్తుంది. అయినా పత్రికలు, వెబ్సైట్లు, టీవీ ఛానెళ్లు అవే హోరెత్తిస్తాయి.
ఈ టైములో ఊరకే ఉండడమెందుని నేనూ రాస్తున్నాను. 2005లో నేను ఎన్టీయార్ గురించి శాటిలైట్ రేడియోకై మాట్లాడినదాన్ని ఎమ్బీయస్ కబుర్లులో ఓ సారి (పదేళ్లు దాటి వుంటుంది) వ్యాసరూపంగా యిచ్చాను.
ఈ మధ్యలో చేరిన పాఠకుల సౌలభ్యం కోసం దాన్ని నాలుగు భాగాలుగా (ఎన్టీయార్ 1 నుంచి 4) మళ్లీ యిస్తున్నాను. మధ్యలో కొత్తగా కొంత చేర్చాను. దీనితో బాటు సినీముచ్చట్లలో ఎన్టీయార్ గురించిన రాసిన వాటి లింకులు కూడా యిస్తూ పోతాను.
5 వ భాగం నుంచి నేను సేకరించిన ఎన్టీయార్ ఉదంతాలు (ఎనెక్టోడ్స్) యిస్తాను. ఇవన్నీ సినిమాలకు సంబంధించినవే. రాజకీయాల గురించి టిడిపి త్రిదశత్వంలో కొంత రాశాను. కొత్తగా కూడా కొన్ని ఉదంతాలు రాస్తూ కింద పాత వాటి లింకులు యిస్తాను. సినిమాలో నాదెండ్ల వెన్నుపోటు వరకే చూపిస్తారట. అందువలన అక్కడ దాకా జరిగిన సంఘటనలే రాస్తాను.
లక్ష్మీస్ ఎన్టీయార్ వచ్చిన తర్వాత వక్రీకరణ జరిగిందనిపిస్తే అప్పుడు దాని గురించి రాస్తాను. .. ఇక 2005 నాటి వ్యాసం నాలుగు భాగాల్లో చదవండి.
ఎన్టీయార్ – ఆ మూడు అక్షరాలలోనూ ఒక పవర్ తెచ్చి పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి, నటుడు అంతకుముందుదాకా తెలుగుతెరపై ఉద్భవించలేదు. ఇప్పట్లో ఉద్భవిస్తాడన్న ఆశ కూడా లేదు. రామారావుగారు పోయినప్పుడు వచ్చిన జనం చూస్తే మతి పోయింది. ఏ రాజకీయ నాయకుడికీ అంత జనం రారు. ఏ నటుడికీ అంత జనం రారు. మహా నటుడు, ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వీళ్లిద్దరకూ కలిపి రావలసిన జనం కంటె ఎక్కువమంది వచ్చారు. ఆ ఎక్కువ ఎందుకు వచ్చారంటే, అదీ ఆయన పర్శనాలిటీ!
ఎన్టీయార్ ఎంతో పెట్టిపుట్టిన వ్యక్తి. మహర్జాతకుడు. అయితే ఆయన తన అదష్టానికి మాటిమాటికీ, విపరీతంగా పరీక్షకు గురి చేశాడు. ఒక హద్దు మీరి ఊదితే బుడగ పేలిపోయినట్లే చివర్లో అదష్టదేవత వీడి వెళ్లిపోయింది. 'హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ హిజ్ సక్సెస్, అండ్ హి యీజ్ ద ఫాదర్ ఆఫ్ హిజ్ ఫెయిల్యూర్, అంతా స్వయంకతమే' అంటారు ఆయన గురించి సన్నిహితంగా తెలిసినవాళ్లు. ఆయనకు 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం ముందు వల్లూరు వెంకన్న పంతులు గారి వద్దకు తీసుకెళితే, ఆయన దానికి ముందు పాదసాముద్రికం చూడాలంటూ పళ్లెంలో బియ్యప్పిండి పోయించి, పిల్లవాణ్ని నిల్చోమన్నాడు. పాదముద్రలు చూస్తే అరికాళ్లల్లో శంఖుచక్రాలు ఉన్నట్లు కనబడింది. 'వీడు దైవాంశ సంభూతుడు, మహర్జాతకుడు' అని డిక్లేర్ చేశాడాయన.
ఆయన వేసిన పాత్రలు ప్లస్ సమ్‌థింగ్ వుంది ఆయనలో. అదే జనాలను ఆకట్టుకుంది. ఎన్టీయార్ సినీరంగ ప్రవేశం 'మనదేశం' సినిమాతో జరిగింది. అది 1949. అంటే అప్పటికి ఆయనకు 26 యేళ్లు. అంటే నాగేశ్వరరావుగారి కంటె ఏడాదిన్నర పెద్దయినా ఐదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారన్నమాట. ఈ ఐదేళ్లు లెక్క 1944 సీతారామజననం నుండి వేస్తున్నాను. 1941 నాటి ధర్మపత్ని నుండి కాదు. సీతారామజననం నుండే నాగేశ్వరరావుగారికి సీరియస్ వేషాలు వచ్చాయి. ఐదేళ్లు వెనకాల వచ్చినా అతి త్వరలో ఎన్టీయార్ నాగేశ్వరరావుగారికి పోటీగా మారాడు. చివరివరకూ ఆ పోటీ పోటాపోటీగా సాగింది. కొన్ని సందర్భాల్లో శ్రుతి మించినా – బై అండ్ లార్జ్ – అది హెల్దీ కాంపిటీషన్గానే సాగిందని చెప్పవచ్చు. 'స్ఫర్ధ పూను విద్య యందు' అన్నట్టు ఇద్దరూ ఒకరి కొకరు ఛాలెంజ్‌గా వుండేవారు. ఎవరి నిర్మాతలు వాళ్లకుండేవారు. ఇద్దరూ ఒకే సినిమాలో వేస్తే ఎవరి యాక్షన్ బావుందాని అభిమానులు సిగపట్లకు దిగేవారు.
సీనియర్, అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుకి నిద్రపట్టకుండా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు, మంచి నేపథ్యం.. అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ ఈజ్ ఏ బోర్న్ హీరో! నేచురల్‌గా ఆయన టాలెంటుకు వెనువెంటనే గుర్తింపు వచ్చింది. వస్తూ వస్తూనే ఆయన హీరో అయిపోయారు. 'అంటే 'మనదేశం'లో ఆయన హీరోనా?' అని అడక్కండి. దానిలో హీరో నారాయణరావు. ఈయనది చిన్న ఇన్స్పెక్టర్ వేషం. ఎల్వీ ప్రసాద్‌గారితో మొహమాటం కొద్దీ వేయాల్సి వచ్చింది. దానికంటె ముందు బుక్ అయినది, రిలీజవ్వాల్సినది అయిన 'పల్లెటూరి పిల్ల'లో ఈయనది హీరో వేషం. అది లెక్కలో తీసుకుని మొదటి సినిమా నుండే హీరో అన్నాను. కాస్త కన్ఫ్యూజింగ్గా వుందా? సరిగ్గా చెప్తానుండండి –
ఆయన గుంటూరులో ఎసి కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే సినిమా ఆఫర్లు వచ్చాయి. బిఏ పూర్తవందే సినిమాల్లో చేరే ఉద్దేశం లేదన్నాడు. అప్పటికే జగ్గయ్య, ముక్కామల వీళ్లందరితో కలిసి నాటకాలు వేసేవాడు. ఈయన వేసిన ఓ నాటకం చూసి సినీనటి శ్రీరంజని భర్త సి.పుల్లయ్యగారికి పరిచయం చేశారు. పుల్లయ్యగారు 'కీలుగుర్రం' తీసే ప్రయత్నాల్లో వున్నారు. అందులో రాకుమారుడి పాత్రకు ఈయన బాగుంటారని అనుకున్నారు పుల్లయ్యగారు. అడ్రసు తీసుకున్నారు. మద్రాసు వెళ్లాక ఆయన ఐడియా మారింది. ''కీలుగుర్రం' కాదు, 'వింధ్యరాణి'లో వేషం యిస్తాం, రా' అన్నారు. ఈయన చదువు వదిలి రానన్నారు. చదువు సెన్సిటివ్ మేటర్ కావడానికో కారణం వుంది.
ఇతను1923 మే 28న నిమ్మకూరులో పుట్టాడు. అది చాలా కుగ్రామం. ఏ విధమైన సౌకర్యమూ లేదు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రామమ్మలకు ఆలస్యంగా పుట్టిన సంతానం, ఇతను పుట్టిన 4 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. ఇతనికి తారక రామారావు పేరు పెట్టినది, చిన్ననాటి జీవితంలో ముఖపాత్ర పోషించినది – సోకు రామయ్యగారు. ఆయన తండ్రికి సోదరుడని కొందరు రాస్తే, పెత్తల్లి చంద్రమ్మ గారి భర్త అని లక్ష్మీపార్వతి రాశారు. ఇతనికి తల్లి కష్ణుడి పేరు పెడదామనుకుందట. బహుశా ఆవిడే చేతి మీద కష్ణుడి పచ్చబొట్టు పొడిపించి వుంటుంది. తాత రామస్వామి చౌదరికి 80 ఎకరాలుండేవి. లక్ష్మయ్య చౌదరిగారికి యిద్దరు అన్నలు, ఒక తమ్ముడు. తలా 20 ఎకరాలు వచ్చాయి. 5 కి.మీ.ల దూరంలో ఉన్న నిడుమోలు గ్రామవాసి వల్లూరి సుబ్బయ్య పంతులు అనే ఆయన వద్ద ఇతను 1,2,3 క్లాసులు చదవడం జరిగింది. 4,5 తరగతులు అవురుపూడి మునసబు గారింట్లో నడుస్తున్న ఇంగ్లీషు బడిలో చదివించారు.
రామయ్య గారు షోకిల్లాగా బతికేవాడు కాబట్టి సోకు రామయ్య అనేవారు. పిల్లలు లేరు. రోజూ సైకిలు మీద విజయవాడ వచ్చి జల్సా చేసేవాడు. ఆయన యితన్ని గారాబంగా పెంచాడు. ఆ దంపతులు విజయవాడకు మకాం మార్చి తమ దగ్గరే పెట్టుకుని 1933లో విజయవాడ గాంధీ మునిసిపల్ హైస్కూల్లో హైస్కూలు చదువు చదివించారు. దానితో బాటు సోకు రామయ్య యితన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని విజయవాడలోని దుర్గా కళామందిర్‌కు తీసుకుని వచ్చి నాటకాలు చూపించేవాడు. బందా, స్థానం, వేమూరి వగైరాలు నటించేవారు, అవి చూసి యితనికి నాటకాలపై ఇంట్రస్టు కలిగింది. ఎస్సెల్సీ టైములోనే పుండరీ కాక్షయ్య, సుంకర కనకారావు వగైరాలు పరిచయమయ్యారు.
1940లో ఎస్సెల్సీ పూర్తయ్యేసరికి సోకు రామయ్య ఆస్తి కరిగిపోయింది. ఇంకో నాలుగైదేళ్లకు పోయాడు కూడా. ఈలోగా దీనికి కారణం ఇతని తండ్రికి అన్నదమ్ములతో ఉన్న పేచీ కారణంగా ఆస్తి పోగొట్టుకుని, పొలమంతా అమ్మేసి, విజయవాడకు కాపురం మార్చారు. తండ్రి 4 గేదెలు కొని పాల వ్యాపారం మొదలెట్టారు. హీరో సైకిలు మీద యిళ్లకు పాలు పోసి కాలేజీకి వెళ్లేవాడు. నిజానికి యితను చిన్నప్పణ్నుంచి కష్టానికి వెరవలేదు. సెలవుల్లో యింటికి వెళ్లినపుడు కాలవ నుంచి 40 కావిళ్ల నీళ్లు గంటలో తోడి యింటికి తెచ్చేవాడు.
ఎస్సెల్సీ తర్వాత ఎస్ఆర్ఆర్ (అప్పటికి సివిఆర్ అని చేరలేదు) కాలేజీలో ఇంటరు (అప్పట్లో ఎఫ్ఏ)లో చేరాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరరు. కాలేజీలోనే కెవిఎస్ శర్మ (తర్వాతి కాలంలో సినిమా నటుడు) పరిచయమయ్యాడు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అనే సినీ నటుడు ('భక్త పోతన', 'పెద్దమనుష్యులు' వగైరా సినిమాల్లో వేశారు) యితనిపై అభిమానంతో రిక్షాలో కూర్చోపెట్టుకుని తిప్పుతూ సినిమా కబుర్లు చెప్పేవాడు.
ఇంటరు చదువుతూండగానే జరిగిన పెళ్లి విషయంలో కాస్త గొడవ వచ్చింది. బసవతారకం గారు యితని తల్లి కజిన్ బ్రదర్ కూతురు. ఆమెను చేసుకోవాలని సోకు రామయ్య పట్టుదల. మరో పక్క యితని పినతండ్రి తన మరదలి నిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించాడు. తల్లి వైపు బంధువులా, తండ్రి వైపు బంధువులా ఎవరి వైపు మొగ్గాలన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. చివరకు యితని తలిదండ్రులు పెళ్లికి రాలేదు. సోకు రామయ్యే దగ్గరుండి జరిపించాడు. తన మాట నెగ్గలేదని కోపగించుకున్న యితని పినతండ్రి యితని తండ్రిపై కక్ష సాధించాడు. ఆయన పొలాన్ని ఆయన పేర రిజిస్టర్ చేయకుండా మోసగించాడు. (ఎన్టీయార్ సినిమా ఫీల్డులో నిలదొక్కుకున్నాక పోయిన ఆస్తులన్నీ సాధించాడు)
1942లో ఇంటర్ చదువు పూర్తయింది. పెళ్లి వలనో, నాటకాల వలనో ఇంటర్ రెండుసార్లు ఫెయిలయి 1945 వరకు పాస్ కాలేదు. (సోకు రామయ్య పోయినది యీ టైములోనే) ఈ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. మిలటరీ లేదా పోలీసు ఉద్యోగం చేద్దామనుకున్నాడు. బంధువొకాయన మద్రాసు పచ్చయప్ప కాలేజీలో లెక్చరరుగా వున్న ఎన్జీ రంగా వద్దకు తీసుకెళ్లి సిఫార్సు చేశాడు. ఆయన 'నీకెందుకు ఉద్యోగం? పోయి వ్యవసాయం చేసుకో' అన్నాడు. ఇతను ఇన్సల్ట్గా ఫీలయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చి ఖాళీగా వున్నాడు. బియ్యే చదవాలంటే విజయవాడలో ఆ సౌకర్యం లేదు, గుంటూరుకి వెళ్లాలి.
అప్పట్లో ఉద్యోగాలకైనా, సినిమాల కైనా బొంబాయి వెళ్లాల్సిందే. జనతా ఫోటో స్టూడియో కోటేశ్వరరావు అనే ఆయన్ని వెంటపెట్టుకుని బొంబాయి సినీరంగంలో చేరదామని వెళ్లాడు. అక్కడ ఎడిటింగు విభాగంలోనో, సౌండ్ రికార్డింగు లోనో చేరమన్నారు. వద్దులే అనుకుని మిలటరీ వైపు చూశాడు. రెండవ ప్రపంచయుద్ధంలో వార్ పోస్టల్ డెలివరీకై గ్లయిడర్లు నడిపేవారు. వాటికి పైలట్లగా పని చేయడానికి ఎమెచ్యూర్స్ను తీసుకుని 15 రోజుల శిక్షణ యిచ్చి గ్లయిడర్ ఎక్కమనేవారు. ఈయన 3 నెలల కోర్సులో చేరి, గ్లయిడర్లను నమ్మడానికి లేదని దానిలో చేరలేదు. తర్వాత బొంబాయిలో మాతుంగాలో ఆంధ్రా మెస్ నడిపాడు. చివరకు ప్రాణం విసిగి, తండ్రి వెనక్కి వచ్చేయమంటే జనతా కోటేశ్వరరావుతో సహా వెనక్కి ఊరికి వచ్చేశాడు.
అక్కణ్నుంచి విజయవాడలో పాల వ్యాపారం చేశారు. సైకిల్‌మీద వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారు. పొగాకు వ్యాపారం పెట్టారు. రెండేళ్లపాటు యిలా కష్టపడ్డారు. హానీహానీగా వ్యవహారం గడిచేది. బంధువులంతా హేళన చేశారు. 'మీ పెదనాన్న నిన్ను తన దగ్గర వుంచుకుని పెంచాడు. పెద్ద చదువులు చదువుతావనీ, ఆఫీసరు అవుతావనీ కలలు కన్నాడు. ఆయన పోయాడు. నువ్వు చూస్తే యిలా వున్నావ్' అన్నారు. బంధువులు హేళన చేయడంతో ఎన్టీయార్‌కు పట్టుదల వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత 1945లో బియేలో చేరారు. కష్టపడి చదివారు. ఆ టైములోనే ఇందాకా చెప్పిన సినిమా ఆఫర్ వస్తే వద్దన్నారు. తనను పెంచిన పెదనాన్నకు ఆత్మశాంతి లభించాలంటే బియే పూర్తవాల్సిందేనన్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2018)
[email protected]
ఎన్టీయార్ గురించి ఒక సంఘటన లింకు కింద చూడండి…
https://telugu.greatandhra.com/articles/mbs/cine-snippets-ntr-62292.html