కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో సమూహాల్లోకి వెళ్లడం తగ్గించాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా రకాల సభలు, సదస్సులు కూడా రద్దు అవుతున్నాయి. ఇండియాలోనే ఈ మేరకు అలర్ట్ అవుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. బీజేపీ వాళ్లు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ ఉన్నారు. వీరిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఆయన హైదరాబాద్ పర్యటన అందుకే వాయిదా పడిందని తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన పార్టీ నేతలకు ఇదే సూచన చేస్తున్నారట. అవి పార్టీ కార్యక్రమాలు అయినా సరే.. వాటిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించినట్టుగా వార్తలు వచ్చాయి.
మోడీ కూడా పలు అంతర్జాతీయ సదస్సులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో.. ఆయన విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇలా ఇండియన్స్ బాగానే అలర్ట్ గా ఉన్నా.. అమెరికాలో మాత్రం ఇంత అలర్ట్ గా ఉన్నట్టుగా లేరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు హాజరైన ఒక కార్యక్రమంలో కరోనా వైరస్ వ్యక్తి కల్లోలం రేపుతున్నాడు!
అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ ఒక సభను నిర్వహించిందట. ఆ కార్యక్రమానికి ట్రంప్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు కూడా హాజరయ్యారట. ఆ కార్యక్రమానికి జనసందోహం కూడా హాజరైంది. అలా హాజరైన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా, అతడికి కరోనా సోకిందని వైద్యులు ధ్రువీకరించినట్టుగా సమాచారం!
ఏసీ హాల్ లో జరిగిన ఆ సదస్సులో ఆ వ్యక్తి కూడా పాల్గొన్నాడట. దీంతో… అక్కడ మరెవరికి అయినా ఆ వ్యాధి సోకిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సదస్సులో స్వయంగా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా పాల్గొనడంతో.. అమెరికాలో కరోనా వార్త పతాక శీర్షికలకు ఎక్కుతూ ఉంది. మరి ఆ సదస్సుకు హాజరైన వారంతా పరీక్షలు చేయించుకోవాలేమో, ట్రంప్ తో సహా!