జాక్ పాట్ కొట్టిన కమల్ హాసన్

సూపర్ స్టార్ లు అయినా, పవర్ స్టార్ లు అయినా, మెగా స్టార్ లు అయినా.. సినిమా హీరోలు రాజకీయాల్లో రాణించే కాలం చెల్లిపోయిందని ఇటీవల పలు ఉదాహరణలు నిరూపించాయి, నిరూపిస్తూనే ఉన్నాయి. కాస్త…

సూపర్ స్టార్ లు అయినా, పవర్ స్టార్ లు అయినా, మెగా స్టార్ లు అయినా.. సినిమా హీరోలు రాజకీయాల్లో రాణించే కాలం చెల్లిపోయిందని ఇటీవల పలు ఉదాహరణలు నిరూపించాయి, నిరూపిస్తూనే ఉన్నాయి. కాస్త ఆలస్యంగా అయినా జ్ఞానోదయం కావడంతో రజినీకాంత్ పార్టీ పెట్టకుండానే వెనక్కు జారుకున్నారు. అనారోగ్య కారణం చూపి అసలు జెండా ఎత్తేశారు.

అయితే కమల్ హాసన్ మాత్రం ఇంకా తంటాలు పడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిపోయేంత సీన్ లేదు కానీ, కనీసం కమల్ అసెంబ్లీ సీటైనా గెలుస్తారా అనేది నిన్నటి వరకూ అనుమానమే. కానీ.. అది పటాపంచలైపోయింది. తంతే.. బూరెల బుట్టలో పోయి పడ్డట్టు.. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోకి వెళ్లి పడ్డారు కమల్ హాసన్.

లోక నాయకుడికి ఎదురే లేదు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి కమల్ హాసన్ పోటీ చేస్తారనే ప్రచారం ముందునుంచీ జరుగుతూనే ఉంది. ఆరెంటిలో ఒకటి చెన్నైలోని అలందూర్ అనుకున్నారు. కానీ అంతలోనే కమల్ తన స్ట్రాటజీ మార్చారు, కోయంబత్తూర్ కి షిఫ్ట్ అయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో ఉన్న అర్బన్ ఓట్లపై ఆయన దృష్టిపెట్టారు. దీని వెనక ఓ బలమైన కారణం ఉంది.

ఇక్కడ డీఎంకే కానీ, అన్నా డీఎంకే కానీ పోటీలో దిగడం లేదు. ఆ సీటుని ఆల్రెడీ బీజేపీకి త్యాగం చేసింది అన్నాడీఎంకే. అటు ఆ సీటు కాంగ్రెస్ కి కేటాయించడానికి డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రధాన పార్టీలేవీ బరిలో లేకపోవడం కమల్ కి పెద్ద ప్లస్ పాయింట్. 

ఇటీవల వరుసగా రెండుసార్లు అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచారు. కానీ ఈసారి ఆ సీటు బీజేపీకి ఇస్తామనడంతో కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తుల్లో కొంతమంది కమల్ కి మద్దతిచ్చినా అదే ఆయనకు పెద్ద ఊరట. ఈ సమీకరణలతో అసెంబ్లీలో అడుగు పెడతానంటూ ధీమాగా చెబుతున్నారు కమల్.

దినకరన్ పార్టీతోనే దిగులు

డీఎంకే, అన్నాడీఎంకే బరిలో లేకపోవడంతో కమల్, చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని.. అక్కడ దినకరన్ పార్టీ అభ్యర్థి అసలైన పోటీ ఇస్తాడని అంటున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరపున మాజీ ఎమ్మెల్యే దొరైసామి అక్కడ్నుంచి బరిలో దిగబోతున్నారు. 

దినకరన్ పార్టీకి అన్నాడీఎంకే కార్యకర్తల లోపాయికారీ మద్దతు ఉండనే ఉంది. అయితే అది ఓట్ల రూపంలో మారుతుందా లేదా అనేది ప్రస్తుతం అనుమానమే. ఈ దశలో కమల్ హాసన్ సునాయాస విజయాన్ని సాధించబోతున్నారని అంటున్నారు ఆ పార్టీ అభిమానులు.

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జోగి బ్రదర్స్… జాతి రత్నాలు రివ్యూ