అల్లుడ్ని కిరాతకంగా హత్య చేయించిన మామ మారుతీరావు చనిపోయాడు. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఉరేసుకుని చనిపోయాడని ముందు వార్తలొచ్చాయి. కాదు కాదు విషం తాగాడని తర్వాత బ్రేకింగ్ లు సవరించుకున్నారు. ఇప్పుడు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ మారుతీరావు మరణం వెనకున్న రహస్యం ఏంటి?
అల్లుడు ప్రణయ్ పై అటాక్ జరిగిన వెంటనే అది మామ పనేనని తెలిసిపోయింది, రోజుల వ్యవధిలోనే ముఠా పట్టుబడింది. కానీ మామ మృతి మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగింది? అల్లుడ్ని సుపారీ ఇచ్చి హత్య చేయించినా.. తాను మాత్రం తప్పించుకోడానికి అప్పట్లో చాలా తెలివితేటలు ప్రదర్శించారు మారుతీరావు. హత్య జరిగే సమయంలో కలెక్టరేట్ లో ఉండి కథ నడిపారు. కానీ సూత్రధారి పాత్ర తేటతెల్లమవడంతో చివరకు జైలుకెళ్లాల్సి వచ్చింది.
కూతురు దూరమైంది, ఊరిలో పరువుపోయింది, బంధువుల సూటిపోటి మాటలు.. ఇవన్నీ తట్టుకుని నిలబడదామన్నా మరోవైపు ఉరి శిక్ష ఖాయమవుతుందే అనుమానం. వీటన్నిటి మధ్య నలిగిపోయిన మారుతీరావు, బెయిల్ పై బైటకొచ్చినా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారని చెబుతున్నారు.
దీనికి తోడు మరో పుకారు కూడా జోరుగా షికారు చేస్తోంది. మారుతీ రావుకి అమృత ఒక్కతే సంతానం. దీంతో ఆస్తిపాస్తులపై మారుతీరావు సోదరుడి కన్నుపడిందని, ఆయన తన కొడుకుల పేరున ఆస్తి రాసివ్వమంటూ బలవంత పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతీరావు హఠాన్మరణంపై అనుమానాలు తలెత్తాయి. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అసలు కారణం ఏంటనేది కొన్నిరోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనా.. మహిళా దినోత్సవం రోజున బైటపడిన ఈ సంఘటన కూతురికి తండ్రిని దూరం చేసిందని అనుకోవాలా.. కూతురి పసుపు కుంకుమలను తుడిచేసిన దుర్మార్గుడు పశ్చాత్తాపంతో చనిపోయాడని అనుకోవాలా.. లేక ఆ దేవుడే మరో రూపంలో ఆయన్ను బలికోరాడని అనుకోవాలా? ఎవరెలా అనుకున్నా, కారణం ఏదయినా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్.