కన్‌ఫ్యూజన్‌లో త్రివిక్రమ్?

‘అల వైకుంఠపురములో’ కథ, కథనాలు చూస్తే ఎలాంటి ప్రత్యేకతలు కనిపించవు. పాత సినిమా ఫార్ములా తీసుకుని సగటు సినీ ప్రియుడి అభిరుచికి తగ్గట్టుగా త్రివిక్రమ్ మలిచాడు. అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ‘అరవింద…

‘అల వైకుంఠపురములో’ కథ, కథనాలు చూస్తే ఎలాంటి ప్రత్యేకతలు కనిపించవు. పాత సినిమా ఫార్ములా తీసుకుని సగటు సినీ ప్రియుడి అభిరుచికి తగ్గట్టుగా త్రివిక్రమ్ మలిచాడు. అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో త్రివిక్రమ్ సరికొత్త శైలి చూపించినా కానీ అందులో తన మార్కు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ లేక యావరేజ్‌గా ఆడింది. 

ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేసే సినిమా విషయంలో ఎన్టీఆర్‌ని యాక్షన్ హీరోగా చూపించాలా లేక తాను తీసే కుటుంబ కథా చిత్రాల తరహాలోనే ఎన్టీఆర్‌కి కూడా న్యూ డైమెన్షన్ ఇవ్వాలా అనే విషయంపై త్రివిక్రమ్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు. ఎన్టీఆర్‌కి వున్న మాస్ ఇమేజ్ వేరు. త్రివిక్రమ్ తీసే సినిమాల తీరు వేరు. త్రివిక్రమ్ స్టయిల్లోకి మారడానికి ఎన్టీఆర్ సిద్ధంగానే వున్నా కానీ అతని అభిమానులని కూడా త్రివిక్రమ్ దృష్టిలో వుంచుకోక తప్పదు. 

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పాత సినిమాల కథల్లో ఏదైనా ఈ చిత్రానికి పనికి వస్తుందేమో అని చూస్తున్నాడని, ‘మంత్రిగారి వియ్యంకుడు’ ఫార్ములా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడని పుకార్లు కూడా వినిపించాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం కామెడీ, ఎమోషన్, యాక్షన్ సమపాళ్లలో వుండే కమర్షియల్ ఫార్ములానే రంగరించే ప్రయత్నంలో వున్నట్టు తెలిసింది. మీడియా మాత్రం ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ చుట్టూ కథలు అల్లేస్తోంది.