తెల్లటి వస్త్రాల్లో దేవకన్యలా ఓ చక్కటి రూపవతి చెంగుచెంగుమని నాట్యమాడుతూ ప్రత్యక్షమవుతుంది. “నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక” అంటూ రాజును కవ్విస్తూ నాట్యమాడుతుంది. భైరవద్వీపంలోని ఆ పాటకు నిన్నమొన్నటి హీరోయిన్ , నేటి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా… చక్కటి అభినయంతో ప్రేక్షకులను మైమరిపిస్తుంది.
తాజాగా తనలో ఆ కళాభిరుచి ఇంకా సజీవంగా ఉందంటూ నిరూపించుకున్నారామె. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో, అభినయంతో అభిమానులను అలరించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజా చూడచక్కని నృత్య ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన రోజా తిరుపతిలో డిగ్రీ చదువుతుండగానే సినిమాల్లో ప్రవేశించారు. దివంగత రాజకీయవేత్త, నటుడు శివప్రసాద్ ప్రోత్సాహంతో ఆమె సినీ రంగంలో అడుగు పెట్టారు. తన నటనా చాతుర్యం, వాక్పటిమతో చిత్రరంగంలో నిలదొక్కుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయ రంగంలో ఆమె ప్రవేశించారు. మొదట టీడీపీలో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత వైసీపీలోకి మారి జగన్ వెంట నడుస్తున్నారు.
వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజా…ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పోస్టుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగన్ సర్కార్‌పై ఈగ వాలనివ్వదనే పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా….బుల్లి తెరపై మాత్రం కనిపిస్తూనే ఉన్నారు. పలు చానల్స్‌లో ఆమె హోస్ట్‌గా, జడ్జిగా వ్యవహరిస్తూ, చక్కటి నటన ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆమె రవీంద్రభారతిలో చేసిన నృత్య ప్రదర్శన తెలంగాణ గవర్నర్ తమిళ సై, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశంసలు అందుకొంది. మహిళా దినోత్సవం సందర్భంగా రోజాకు శుభాకాంక్షలు చెబుదాం.