ఏపీలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. అయితే మిగతావారిపై పెద్దగా ఆరోపణలు రాలేదు కానీ అనిల్ పై మాత్రం తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పోర్ట్ ఫోలియోకు సంబంధించి ఇందులో ఏమీ లేకపోవడం విశేషం. కేవలం నెల్లూరు సెంటర్ గా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూకబ్జాలు, లేఅవుట్లలో కమీషన్లు, ఇలా రకరకాలుగా ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు స్థానిక టీడీపీ నేతలు. అనిల్ కూడా తీవ్ర అసహనంలో ఉన్నారు. గతంలో లోకల్ టీడీపీ లీడర్లను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు తన స్థాయిని కూడా తగ్గించుకుని స్థానిక టీడీపీ నేతలను నేరుగా కామెంట్ చేస్తున్నారు.
అనిల్ కు మరోవైపు కాకాణితో వైరం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కాకాణి వైపు వెళ్లిపోయారు. ప్యాచప్ జరిగిందని అంటున్నా.. అది పైకి మాత్రమే. మొత్తంగా అనిల్ నెల్లూరులో ఒంటరి అయ్యారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు అటు పార్టీ కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరూ ఖండించడం లేదు.
సపోర్ట్ కూడా రావట్లేదు. దీంతో టీడీపీ మరింత రెచ్చిపోతోంది. ఏకంగా నారా లోకేష్ కూడా రంగంలోకి దిగి అనిల్ పై ట్విట్టర్ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఫలానా వారు మీకు బినామీ, ఫలానా చోట లే-అవుట్లలో అవినీతి చేశారంటూ సిల్లీ విషయాలను కూడా హైలెట్ చేస్తున్నారు. ఆ ఫలానా అని చెప్పే వ్యక్తి గతంలో టీడీపీ లీడర్. కానీ ఇప్పుడు అనిల్ ని టార్గెట్ చేసేందుకు అతడిని వాడుకుంటున్నారు.
గడప గడపకు వెళ్తున్న అనిల్..
వాస్తవానికి మంత్రి పదవిలో ఉన్నప్పుడు అనిల్, తన నియోజకవర్గాన్ని కాస్త లైట్ తీసుకున్నారని అంటారు. నెల్లూరు విషయానికొస్తే భారీ ఫ్లైఓవర్ నిర్మాణం తలపెట్టారు కానీ, అది నత్తనడకన సాగుతోంది. ఏడాదిలో పూర్తి చేస్తామన్న.. మూడేళ్లుగా సగం పని కూడా కాలేదు. ఇది అతి పెద్ద మైనస్. మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ సగం సగమే పూర్తయ్యాయి.
ఇప్పుడు మంత్రి పదవి కూడా లేకపోవడంతో ప్రత్యర్థులు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో అనిల్ తిరిగి నెల్లూరులో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడప గడపకు వెళ్తున్నారు. గతంలో తనకు మద్దతు ఇచ్చినవారందర్నీ కలుపుకొని వెళ్తున్నారు.
మొత్తమ్మీద నారా లోకేష్ ట్వీట్లతో అనిల్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అటు సొంత పార్టీ నేతల సపోర్ట్ లేక, ఇటు మంత్రి పదవి పోయాక వైరి వర్గం ఒక్కసారిగా విరుచుకుపడటంతో అనిల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.