సినిమా రివ్యూ: ఒడియన్‌

రివ్యూ: ఒడియన్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఆశిర్వాద్‌ సినిమాస్‌ తారాగణం: మోహన్‌లాల్‌, ప్రకాష్‌రాజ్‌, మంజు వారియర్‌, సన అల్తాఫ్‌, సిద్ధిక్‌ తదితరులు రచన: హరికృష్ణన్‌ సంగీతం: ఎం. జయచంద్రన్‌ నేపథ్య సంగీతం: శామ్‌ సి.ఎస్‌.…

రివ్యూ: ఒడియన్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఆశిర్వాద్‌ సినిమాస్‌
తారాగణం: మోహన్‌లాల్‌, ప్రకాష్‌రాజ్‌, మంజు వారియర్‌, సన అల్తాఫ్‌, సిద్ధిక్‌ తదితరులు
రచన: హరికృష్ణన్‌
సంగీతం: ఎం. జయచంద్రన్‌
నేపథ్య సంగీతం: శామ్‌ సి.ఎస్‌.
కూర్పు: జాన్‌ కుట్టి
ఛాయాగ్రహణం: షాజి కుమార్‌
నిర్మాతలు: ఆంటొని పెరుంబవూర్‌, రామ్‌ దగ్గుబాటి
దర్శకత్వం: వి.ఏ. శ్రీకుమార్‌ మీనన్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 14, 2018

'మన్యం పులి' తెలుగులో ఘన విజయం సాధించిన నేపథ్యంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లేటెస్ట్‌ అడ్వెంచర్‌ మూవీ 'ఒడియన్‌' తెలుగులోకి అనువాదమై మలయాళ వెర్షన్‌తో పాటుగా విడుదలయింది. 'మన్యం పులి' మాదిరిగా ఇది కూడా ఒక థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సినిమా అయి వుంటుందనే ఫీలింగ్‌ ట్రెయిలర్‌తో వచ్చింది. అయితే ఇది కేవలం 'మన్యం పులి' తరహా సినిమా కాదు, అచ్చంగా దానినే మరోసారి రిపీట్‌ చేయాలని చేసిన అటెంప్ట్‌లా అనిపిస్తుంది. మన్యం పులిలో 'టైగర్‌ హంటింగ్‌' కాన్సెప్ట్‌లా ఇందులో హీరో 'ఒడియన్‌' పని చేస్తుంటాడు.

కేరళలో ఈ ఒడియన్‌లకి ఒక హిస్టరీ వుంది. ఆ కాలంలో శత్రువులని భయపెట్టడానికి ఒడియన్‌లని ఉపయోగించేవారట. జంతు వేషధారణలో చీకట్లో శత్రువులపై దాడి చేసి వారిని భయభ్రాంతులకి గురి చేయడం వీరి ఉద్యోగమట. అలా తాత ముత్తాతల నుంచి వంశ పారంపర్యంగా వచ్చిన విద్యలతో ఒడియన్‌గా జీవనం సాగిస్తోన్న 'మాణిక్యం' (మోహన్‌లాల్‌) కథే ఇది. చిన్నతనం నుంచి తాను ఆరాధించిన ప్రభ (మంజు వారియర్‌) కుటుంబానికి అండగా వుంటూ, ఎవరినైనా భయపెట్టే పనులొస్తే అవి చేసుకుంటూ వుంటాడు ఒడియన్‌ మాణిక్యం.

ప్రభపై కన్ను వున్న ఆమె బావ రాజారావు (ప్రకాష్‌రాజ్‌) ఆమెని తన సొంతం చేసుకోవడానికి చాలా పన్నాగాలు పన్నుతూ ఒడియన్‌ ఊరిలోనుంచి వెళ్లిపోయేట్టు చేస్తాడు. ప్రభ ప్రాణాలకి ప్రమాదం వుందని తెలిసి మళ్లీ తిరిగి వచ్చిన ఒడియన్‌ ఏం చేస్తాడు? ఒడియన్‌లకి సంబంధించిన హిస్టరీ, వారు చీకట్లో జంతువులుగా మారి భయపెడతారనే ఇంట్రడక్షన్‌ మొదట్లో ఉత్కంఠ రేకెత్తిస్తాయి. అయితే ఒక్కసారి ఒడియన్‌ ఏమి చేస్తాడనేది తెరపై చూపించిన తర్వాత ఆ ఎక్సయిట్‌మెంట్‌ హరించిపోతుంది.

చీకట్లో జంతు వేషంలో భయభ్రాంతులకి గురయిన వారితో ఇంకా థ్రిల్లింగ్‌గా చేయడానికేముంటుంది? మొదటి సీన్‌తోనే విషయం బోధపడిపోవడంతో ఇక సదరు 'భయపెట్టే' సన్నివేశాలపై హోప్స్‌ వుండవు. సదరు సన్నివేశాలని 'మన్యం పులి'లో 'పులి వేట' తరహాలో తీయాలనే ప్రయత్నం జరిగింది. అదే తరహా సెట్టింగ్‌, లైటింగ్‌, చురుగ్గా కదులుతోన్న మోహన్‌లాల్‌ (?) అన్నీ అమరాయి కానీ ఆ సన్నివేశాల మాదిరిగా థ్రిల్‌కి స్కోప్‌ లేదిక్కడ. అలాగే మరీ కటిక చీకట్లోనే యాక్షన్‌ అంతా జరుగుతూ వుండడం, కంబళీలు కప్పుకుని హీరో అటు ఇటు దూకుతూ వుండడంతో 'యాక్షన్‌' రిజిష్టర్‌ కాదు.

విపరీతమైన డిస్ట్రాక్షన్స్‌తో తెరపై ఏమి జరుగుతుందనేది కంటికి దొరకదు. యాక్షన్‌ సంగతి ఇలా వుంటే ఇక మిగిలిన కథ మరీ పాత కాలం నాటి ప్రేమకథని తలపిస్తూ, సిక్స్‌టీస్‌ నాటి విలనిజమ్‌తో విసిగిస్తుంది. ఈ సన్నివేశాలని సుదీర్ఘంగా, మందకొడిగా నడిపించడంతో మూడు గంటల సినిమా అంతకు రెట్టింపు సమయం చూస్తోన్న భావన కలిగిస్తుంది. దానికి తోడు అవసరం లేని పాటలు చాలానే కథనంలోకి చొరబడడంతో ఇంకా, ఇంకా లెంగ్త్‌ ఎక్కువై ఇక ఈ సినిమా అవ్వదా అని మౌనంగా అరుపులు పెట్టిస్తుంది.

ప్రథమార్ధంలో అయితే ఏదో పెద్ద మిస్టరీ చేధిస్తున్నట్టుగా నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో కథ వర్తమానంలోంచి గతంలోకి, గతంలోకి స్వగతంలోకి వెళుతూ ఇంకా గందరగోళంగా అనిపిస్తుంది. ద్వితియార్థంలో ఆ నస తగ్గిందనుకుంటే, సినిమా పతాక సన్నివేశానికి వెళ్లాల్సిన దశలో మళ్లీ గతంలోని లవ్‌స్టోరీని తెర మీదకి తెచ్చిన దర్శకుడు ఈ సినిమాతోనే తన టాలెంట్‌ అంతా చూపించేయాలని కట్టుకున్న కంకణం కనిపిస్తుంది. మోహన్‌లాల్‌ యంగ్‌ ఒడియన్‌ రూపంలో ఛార్మింగ్‌గా వున్నాడు. ఆయన నటనకి కొత్తగా నిర్వచనాలు ఇవ్వాల్సిన పనిలేదు.

మన్యం పులిలో దాదాపుగా పోరాట సన్నివేశాలని మోహన్‌లాలే చేసాడు. కానీ ఇక్కడ వాస్తవాతీతంగా వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో క్లోజప్స్‌లో తప్ప ఆయనలా అనిపించడు. ప్రకాష్‌రాజ్‌ పర్‌ఫార్మెన్స్‌ బాగుంది కానీ మరీ వన్‌ డైమెన్షనల్‌ క్యారెక్టర్‌ అయిపోవడంతో ఆయన ప్రత్యేకంగా చేయడానికంటూ ఏమీ లేదు. మంజు వారియర్‌ పర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఈ చిత్రానికి ప్రధానాకర్షణ ఛాయాగ్రహణం. ముఖ్యంగా నైట్‌ ఎఫెక్ట్‌లో తీసిన సన్నివేశాల్లో కెమెరా వర్క్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నేపథ్య సంగీతం సన్నివేశాలని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

తెరపై జరుగుతున్న దాని కంటే ఎక్కువ ఇంపాక్ట్‌ నేపథ్య సంగీతంతో వచ్చింది. ఈ సినిమాలో అనవసరమైన ఫుటేజ్‌ చాలానే వుంది. దానిని అలా వదిలేయడానికి దర్శకుడినే తప్పు పట్టాలి తప్ప ఎడిటర్‌ని కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించారు. ఫైట్‌ సీన్స్‌ కొన్ని ఆకట్టుకుంటాయి. దర్శకుడు తన శైలిలో ఈ కథ చెప్పడానికి ప్రయత్నించకుండా మన్యం పులిని రిఫరెన్స్‌గా పెట్టుకోవడం వల్ల ఒడియన్‌లో మేటర్‌ వున్నా కానీ ఆ చిత్రం మాదిరిగా గర్జించలేకపోయింది. సుదీర్ఘమైన కథనం, మందకొడి గమనం ఈ చిత్రంపై వున్న ఆసక్తిని కాస్త కాస్తగా తినేస్తూ పోయాయి.

ఒడియన్‌ అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇంత భయపెడతాడు, అంత వణికిస్తాడు అంటూ ఎప్పటికప్పుడు బిల్డప్పులే తప్ప అసలు సీన్‌కి వెళ్లే సరికి బిల్డప్‌కి తగ్గ అవుట్‌పుట్‌ వుండదు. పతాక సన్నివేశంలో ఎప్పుడూ చూడని ఒడియన్‌ని చూపిస్తానంటూ 'బ్యాట్‌మేన్‌' వేషంలో దిగడం హాస్యాస్పదంగా వుంది. ఇక చివరి ఫైట్‌ సీన్‌ అయితే 'మన్యం పులి'నుంచి ఎత్తుకొచ్చినట్టు అనిపిస్తుంది.

ఆసక్తికరమైన కాన్సెప్ట్‌, మోహన్‌లాల్‌ ఛరిష్మాటిక్‌ పర్‌ఫార్మెన్స్‌, అద్భుతమైన టెక్నికల్‌ వేల్యూస్‌ వున్నప్పటికీ బిగి సడలని కథనం కానీ, ఆసక్తిగొలిపే సన్నివేశాలు కానీ లేక, అవసరం లేని రన్‌టైమ్‌తో, ఆకట్టుకోని స్టోరీలైన్‌తో 'ఒడియన్‌' ఓపికకి పరీక్ష పెడుతుంది. తెరపై పాత్రలని భయపెట్టడం మాట ఏమో కానీ విషయ శూన్యమైన సన్నివేశాలతో, తుది ఎప్పుడో తెలియని కథనంతో తెరముందు వున్న వారిని బాధపెడుతుంది.

బాటమ్‌ లైన్‌: పరేషాన్‌!
– గణేష్‌ రావూరి