ఎన్టీఆర్ 7న వైఎస్ 8న

యాత్ర సినిమా అన్నది ఎన్టీఆర్ బయోపిక్ కు నీడలా వుంటోంది. యాత్ర నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారో? తెలియదు కానీ, తమ సినిమా డేట్ ను తమ చిత్తానికి కాకుండా, ఎన్టీఆర్ బయోపిక్ డేట్ కు…

యాత్ర సినిమా అన్నది ఎన్టీఆర్ బయోపిక్ కు నీడలా వుంటోంది. యాత్ర నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారో? తెలియదు కానీ, తమ సినిమా డేట్ ను తమ చిత్తానికి కాకుండా, ఎన్టీఆర్ బయోపిక్ డేట్ కు అనుగుణంగా మారుస్తున్నారు. ముందుగా జనవరి లో ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వస్తుంది అన్నారు.

తరువాత కాదు, డిసెంబర్ 21 అన్నారు. మళ్లీ కాదు కాదు, జనవరే అన్నారు. అంతలోనే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 14న వస్తుంది. అందుకే తాము కూడా అదే డేట్ ఫిక్స్ అని అనధికారికంగా చెప్పారు. ఇప్పుడు మళ్లీ డేట్ మారింది. ఫిబ్రవరి 8 విడుదల అని ఈసారి అధికారికంగా ప్రకటించారు.

అదేంటీ డేట్ అంటే, ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల అని, అందుకే ఓ రోజు లేట్ గా 8న ఈ సినిమా ప్లాన్ చేసారని తెలుస్తోంది. యాత్ర టీమ్ చాలా తప్పుచేస్తోంది. అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు, వైఎస్ యాత్రకు ఏమిటి సంబంధం? ఏమిటి పోటీ? ఎన్టీఆర్ బయోపిక్ లో డజన్ల మంది నటీనటులు వున్నారు.

కమర్షియల్, గ్లామర్ టచ్ వుంది. పైగా అది ఎన్టీఆర్ బయోపిక్. యాత్ర అన్నది వైఎస్ జీవితంలో చిన్న పార్ట్. ఇందులో పెద్దగా నటీనటులు లేరు. కమర్షియల్ టచ్ వుండదు. మరి అలాంటపుడు దాంతో పోటీ ఎందుకు? తమకు అనుకూలమైన డేట్ చూసి విడుదల చేసుకోవడం మానేసి. అనవసరంగా అనధికార పోటీకి వెళ్లి వైఎస్ పరువు తీసేలా వున్నారు యాత్ర దర్శక నిర్మాతలు.